Minister Ponguleti: పదవులు, అధికారం శాశ్వతంకాదు..
ABN, Publish Date - Feb 28 , 2024 | 01:39 PM
ఖమ్మం జిల్లా: ప్రజలందరి దీవెనలతో ఎమ్మెల్యే గా ఎన్నికయ్యానని, తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం పాలేరు ప్రజలు పెట్టిన భిక్షని.. పదవులు, అధికారం శాశ్వతంకాదని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.
ఖమ్మం జిల్లా: ప్రజలందరి దీవెనలతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం పాలేరు ప్రజలు పెట్టిన భిక్షని.. పదవులు, అధికారం శాశ్వతంకాదని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) వ్యాఖ్యానించారు. బుధవారం తిరుమలాయపాలెం మండలం, మాదిరిపురంలో ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వచ్చిన 11 నెలల్లోనే ఎంపీ (MP) అయ్యానని, పదవి ఉన్నా.. లేకపోయినా ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని అన్నారు. హాస్టల్ మాత్రమే ఉండి క్లాస్ రూమ్‌లు లేకపోవడంతో రూ. 5 కోట్లతో పాఠశాల ఏర్పాటు చేశామని, అధికారంలోకి వచ్చిన 80 రోజుల్లో ప్రభుత్వం ఏం చేస్తుందో మీరు చూస్తున్నారన్నారు. ఆరు గ్యారెంటీల్లో ఉచిత బస్సు పథకంలో ఇప్పటి వరకు 17 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారన్నారు. మరో రెండు పథాకలు అమలు చేస్తున్నామని, 200 యూనిట్‌ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ రాజ్యంలో మాట ఇస్తే ఎంత కష్టం అయినా ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని, ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులో తప్పులు ఉంటే మళ్లీ అప్లై చేసుకోవచ్చునని మంత్రి పొంగులేటి అన్నారు. రూ. 500 లకే గ్యాస్ (Gas) ఇస్తున్నామని, అర్హులైన వారందరికీ ఇస్తామని స్పష్టం చేశారు. ధరణి (Dharani) పేరుతో గత ప్రభుత్వంలో వేలాది ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ధరణిలో ఇచ్చిన అప్లికేషన్‌లు వెనక్కి పంపించారన్నారు. ధరణిలో వచ్చిన రెండు లక్షల నలబై ఐదు వేల అప్లికేషన్‌లను పరిష్కరిస్తామని, తెల్ల రేషన్ కార్డులను (White Ration Card) త్వరలోనే ఇస్తామని మంత్రి చెప్పారు.
గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇస్తామని చెప్పి వందల్లో మాత్రమే కేసీఆర్ (KCR) ఇచ్చారని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళు, మహిళలకు రూ. 2500 త్వరలోనే ఇస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. మొన్నటి వరకు అధికారంలో ఉన్నవారు రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేసారని, గత పాలకులు ప్రాజెక్టులను చిత్త శుద్ధితో కట్టామని చెపుతున్నారు తప్ప చేసిన తప్పులు ఒప్పుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. గత ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన నష్టాన్ని సరిదిద్దే పనిలో ఉన్నామని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
Updated Date - Feb 28 , 2024 | 01:41 PM