Kishan Reddy: రేవంత్ ప్రచారం పనిచేయలేదు
ABN, Publish Date - Nov 24 , 2024 | 04:29 AM
మహారాష్ట్ర ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం పనిచేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ అబద్ధాలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదు: కిషన్‌రెడ్డి
హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం పనిచేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కోసం రేవంత్, తెలంగాణ ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలుచేసి మహారాష్ట్ర పంపించినా.. అది కూడా పనిచేయలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అనేక రకాల తప్పుడు ప్రచారం చేసినా అక్కడి ప్రజలు ప్రధాని మోదీ నాయకత్వంలోని డబు ల్ ఇంజన్ సర్కార్‌కే అత్యధిక ఓట్లు, సీట్లతో మరోసారి పట్టం కట్టారని చెప్పారు.
శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీ వస్తే రిజర్వేషన్లు పోతాయని, మరాఠీలకు అన్యాయం జరుగుతందని లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసి కొంత లబ్ధి పొందారు. కానీ, 5 నెలల్లోనే ప్రజలకు వాస్తవం అర్థమైంది. ఇంత పెద్ద విజయం అందించార’ని చెప్పా రు. రాహుల్ చిలకపలుకులకు, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని చేసుకుని అసత్య ప్రచారాలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదన్నారు. ప్రజాతీర్పును గౌరవించకుం డా కాంగ్రెస్ నేతలు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ విమర్శించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
కాంగ్రెస్ కుట్రలను గుర్తించారు: డీకే అరుణ
కాంగ్రెస్ కుట్రలు, తప్పుడు ప్రచారం మహారాష్ట్ర ఎన్నికల్లో పనిచేయలేదని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టే సెంటిమెంట్ రాజకీయాలను కాంగ్రెస్ చేసిందని ఆమె ఆరోపించారు.
Updated Date - Nov 24 , 2024 | 04:29 AM