Kishan Reddy: రేవంత్‌రెడ్డిది మిడిమిడి జ్ఞానం
ABN, Publish Date - Nov 15 , 2024 | 04:25 AM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి ఇంకా రాకపోవడం వల్ల బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటేనని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం ఆయన స్థాయికి సరికాదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.
కేటీఆర్‌పై విచారణకు అనుమతి ఇంకా రాలేదని బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటేననడం సీఎంకు తగదు
తెలంగాణకు నష్టం వాటిల్లేలా ఆయన వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి ఇంకా రాకపోవడం వల్ల బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటేనని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం ఆయన స్థాయికి సరికాదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రేవంత్ మిడిమిడి జ్ఞానంతో తొందరపాటు వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణకు నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారన్నారు. గురువారం ‘భారత్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన-2024’లో కేంద్ర గనుల శాఖ, కోలిండియా పెవిలియన్లను కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి అనేది చాలా చిన్న విషయమని, అనుమతి ఇవ్వాలా, ఇవ్వకూడదా అనేది గవర్నర్ విచక్షణపై ఆధారపడి ఉంటుందన్నారు. ఇలాంటి విషయాల్లో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా న్యాయ సలహా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో కొంత జాప్యం జరగడం సహజమని, అంతమాత్రానికే సీఎం తొందరపాటు వ్యాఖ్యలు చేయడం మంచి సంప్రదాయం కాదన్నారు. కేటీఆర్‌పై విచారణకు డిమాండ్ చేస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా అవినీతి ఎక్కడ జరిగినా, ఏ పార్టీ చేసినా నిష్పక్షపాతంగా విచారణ జరపాలన్నారు. అమృత్ టెండర్లపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకురావాలన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి ఘటనను ఖండించారు. అధికారులపై దాడులకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలి తప్ప.. అమాయక గ్రామస్థులపై అక్రమ కేసులు పెట్టవద్దన్నారు.
రైతులను బెదిరిస్తున్న దళారులు: ఈటల
హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా పరిశ్రమ ఏర్పాటు పేరిట లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, పులిచర్ల పరిధిలో కొంతమంది దళారులు అసైన్డ్ భూములు పొందిన వారిని బెదిరిస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. పట్టా భూములు ఉన్న మరికొంతమంది నుంచి వాటిని బలవంతంగా సేకరించే ప్రయత్నం జరుగుతోందన్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడారు. భూమినే నమ్ముకుని బతుకుతున్న రైతుల నుంచి రూ.40 లక్షల విలువైన భూమిని రూ.10 లక్షలకే గుంజుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కొడంగల్ నియోజకవర్గంలో ఓట్లేసి గెలిపించిన ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి హింసిస్తున్నారని ఆరోపించారు. అధికారులు సైతం రేవంత్‌కు బానిసలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమ భూములు గుంజుకోవద్దని అడ్డుకున్న రైతులకు బేడీలు వేసి, కేసులు పెట్టిన పాపం రేవంత్‌దేనన్నారు.
Updated Date - Nov 15 , 2024 | 04:25 AM