Konda Surekha: 12న విచారణకు హాజరు కావాలి
ABN, Publish Date - Nov 29 , 2024 | 02:58 AM
సినీనటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసులో డిసెంబర్ 12వ తేదీన విచారణకు హాజరుకావాలని మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీచేసింది.
కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు
అక్కినేని నాగార్జున పరువునష్టం దావా
మంత్రిపై కేసు నమోదుకు ఆదేశాలు
హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): సినీనటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసులో డిసెంబర్ 12వ తేదీన విచారణకు హాజరుకావాలని మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీచేసింది. మంత్రిపై కేసు నమోదుకు ఉత్తర్వులు జారీ చేసింది. తన కుమారుడు నాగచైతన్య, సమంత విడాకులకు సంబంధించిన అంశంలో.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున పరువునష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంత్రి నిరాధార వ్యాఖ్యల కారణంగా తమ కుటుంబం పరువు ప్రతిష్ఠలకు తీవ్ర భంగం వాటిల్లిందని, తనతోపాటు తన కుటుంబ సభ్యులు తీవ్రమైన వేదనకు గురయ్యారని పిటిషన్‌లో నాగార్జున తెలిపారు.
మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. విచారణ సందర్భంగా నాగార్జున కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసుపై నాంపల్లి కోర్టు తాజాగా గురువారం విచారణ జరిపింది. నాగార్జున పిటిషన్‌ను పరిగణనలోకి (కాగ్నిజెన్స్) తీసుకుంది. ఈ మేరకు బీఎన్‌ఎస్ సెక్షన్ 356 కింద కొండా సురేఖపై కేసు నమోదుకు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణకు మంత్రి కొండా సురేఖ వ్యక్తిగతంగా హాజరుకావాలని పేర్కొంటూ విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది.
Updated Date - Nov 29 , 2024 | 02:59 AM