ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హరికథా సార్వభౌమ కోటా సచ్చిదానంద శాస్త్రి కన్నుమూత

ABN, Publish Date - Sep 18 , 2024 | 03:45 AM

తెలుగునాట ప్రసిద్ధి చెందిన హరికథకుడు కోట సచ్చిదానంద శాస్త్రి(90) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గుంటూరు అమరావతి రోడ్డులోని నివాసంలో సోమవారం అర్ధరాత్రి మృతి చెందారు.

  • హరికథా సార్వభౌముడిగా విశేష ఖ్యాతి

  • దేశవ్యాప్తంగా 20వేలపైగా ప్రదర్శనలు

  • 2023లో పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక

  • ఆదిభట్ల నారాయణదాసు శిష్యుల్లో అగ్రగణ్యులు

  • 2018లో సంగీత నాటక అకాడమీ పురస్కారం

గుంటూరు(తూర్పు), సెప్టెంబరు 17: తెలుగునాట ప్రసిద్ధి చెందిన హరికథకుడు కోట సచ్చిదానంద శాస్త్రి(90) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గుంటూరు అమరావతి రోడ్డులోని నివాసంలో సోమవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గతంలోనే ఆయన భార్య చనిపోయారు. కోట సచ్చిదానంద శాస్త్రి 1934 ఆగస్టు 12న ప్రకాశం జిల్లా అద్దంకిలో సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. మూడో తరగతిలోనే పాఠశాలలో చదువుకు స్వస్తి పలికారు. 12ఏళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో కుటుంబ భారం మొత్తం ఆయనపైనే పడింది. ఆ తర్వాత జీవనం కోసం తెనాలికి మకాం మార్చారు. తండ్రి వద్ద నేర్చుకున్న పూజలు, యజ్ఞాల నిర్వహణ ద్వారా పేరు సంపాదించారు. ఏఆర్‌ కృష్ణయ్య, ముసునూరి సూర్యనారాయణమూర్తి, భాగవతుల అన్నపూర్ణయ్య వద్ద హరికథ గానంలో శిక్షణ పొందారు.

ప్రసిద్ధ హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు శిష్యుల్లో అగ్రగామిగా సచ్చిదానంద పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. తెలుగు భాషపై మంచి పట్టు ఉండటం ఆయనకు ఎంతో ఉపయోగపడింది. హరికథా కళాకారుడిగా ప్రసిద్ధి చెందిన ఆయన ఈ కళాభివృద్ధికి విశేష కృషి చేశారు. హరికథ ఆలాపనలో నాటి పరిస్థితులను విభిన్నంగా మలచి వచనంలో, కవిత్వంలో, గేయరూపంలో చెప్పడం ఆయన ప్రత్యేకత. హరికఽథలను చెప్పే విధానంలో సినిమా పాటలు జోడించి, సామాజిక అంశాలను చొప్పించి ఆసక్తికరంగా, వినోద్మాతకంగా భక్తులకు అందజేయడంలో ఘనాపాటిగా సచ్చిదానంద పేరుప్రఖ్యాతులు గడించారు. ఆయన చెప్పే హరికథలు వినడానికి ఎడ్ల బండ్లు కట్టుకొని మరీ పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు గూంటూరుకు తరలివచ్చేవారు.


హరికథా భాగవతార్‌గా తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధులు ఆలిండియా రేడియోలో అగ్రశ్రేణి కళాకారుడైన ఆయన దేశ విదేశాల్లో నిర్వహించిన పలు ప్రతిష్టాత్మక సంగీత ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆయన ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 20వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. పలు అవార్డులు అందుకున్నారు. కోట సచ్చిదానంద శాస్త్రి 2023లో పద్మశ్రీ, 2018లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. హరికథా సామ్రాజ్య సార్వభౌమ, కథాగాన కళాకోవిద, మధురగాన కళానిధి, హరికథా సామ్రాట్‌, హరికథా చక్రవర్తి తదితర బిరుదులు ఆయనను వరించాయి. కళరంగానికి ఆయన చేసిన సేవకు గాను 1988లో ఉగాది విశిష్ట పురస్కారం, 2014లో హంస పురస్కారం లభించాయి, 2019లో ఏపీ ప్రభుత్వం ఆయనకు ఆదిభట్ల నారాయణ దాస పురస్కారాన్ని ప్రదానం చేసింది. 2015 తర్వాత ఆరోగ్యం సహకరించకపోడంతో హరికథ ప్రదర్శనలకు దూరమయ్యారు. సచ్చిదానంద శాస్త్రి మృతిపట్ల కళాభిమానులు, సాహితీవేత్తలు, ప్రజా ప్రతినిధులు పలువురు సంతాపాన్ని తెలిపారు.

Updated Date - Sep 18 , 2024 | 03:46 AM

Advertising
Advertising