KTR: రైతులను నిండా ముంచిన రేవంత్.. కేటీఆర్ ఘాటు విమర్శలు
ABN, Publish Date - Oct 19 , 2024 | 02:41 PM
అలవికాని హామీలిచ్చి సీఎం రేవంత్(CM Revanth Reddy) ఆధ్వర్యంలోని కాంగ్రెస్ సర్కార్ రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) విమర్శించారు.
హైదరాబాద్: అలవికాని హామీలిచ్చి సీఎం రేవంత్(CM Revanth Reddy) ఆధ్వర్యంలోని కాంగ్రెస్ సర్కార్ రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు(రైతు భరోసా) రాం రాం చెబుతున్నారన్న మాజీ సీఎం కేసీఆర్ మాటలను రేవంత్ సర్కార్ అక్షరాల నిజం చేసిందని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.
"వానాకాలం పంట సీజన్ కు రైతుబంధును(రైతు భరోసా) పూర్తిగా ఎగ్గొట్టేసింది. లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టింది. రేపు, మాపు అంటూ నెట్టుకొస్తున్నప్పుడే ఈ ప్రభుత్వం మీద అనుమానం కలిగింది. ఇప్పుడు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేతులేస్తున్నట్లు ప్రకటించారు. మీ చేతగానీ తనంతో రైతన్నలను మోసం చేస్తామంటే ఊరుకునేలేదు. సబ్ కమిటీ, గైడ్ లైన్స్ అంటూ పెట్టుబడి సాయాన్ని ఎగ్గొడతామంటే రైతులు మిమ్మల్ని వదిలిపెట్టరు. ఎద్దు ఏడ్చినా ఎవుసం, రైతు ఏడ్చినా రాజ్యం బాగుపడదంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా రైతును ఏడిపిస్తున్న కాంగ్రెస్‌కు వారి ఉసురు తప్పదు.
రైతు భరోసాకు డబ్బులు లేకపోవటంతోనే సబ్ కమిటీ అంటూ డ్రామాలు స్టార్ట్ చేశారు. కేసీఆర్ పదివేలు ముష్టి వేస్తున్నాడు...మేము రూ. 15 వేలు ఇస్తామన్న సిఫాయి ఎక్కడ? పేదల ఇండ్లను, జీవితాలను పడకొట్టి రూ. లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణకు డబ్బులుంటాయా? మీరుచెప్పినట్లు రైతులకు ఎకరానికి రూ. 7,500 ఇచ్చేందుకు పైసలు లేవా? పచ్చి అబద్ధాలు, మోసాలతో రైతులను దగా చేశారు. నీ దగాకోరు మాటలు నమ్మి గెలిపించిన రైతులను అరిగోస పెడుతున్నారు. రుణమాఫీ మోసం చాలదన్నట్లు ...ఇప్పుడు రైతు భరోసాలోనూ దగా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాల్సిందే. లేదంటే ఎక్కడికక్కడ మీ ప్రజాప్రతినిధులను ప్రజలే నిలదీస్తారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. రైతు భరోసా ఇచ్చే వరకు కాంగ్రెస్‌ను వదిలేది లేదు" అని కేటీఆర్ విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: గబ్బు రేపుతున్న హైదరాబాద్ పబ్బులు..
TG News: ముగ్గురు యువకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు చూస్తే..
TG News: ప్రేమించిన యువతి దూరం పెట్టడంతో సహించలేని ఓ యువకుడు ఏం చేశాడంటే
Updated Date - Oct 19 , 2024 | 02:41 PM