KTR: ఏపీ సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Sep 30 , 2024 | 04:37 PM
పెన్షన్లపై ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, ఎన్నికల హామీ మేరకు వారంలోనే చంద్రబాబు పెన్షన్లు పెంచారని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే పెన్షన్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వృద్దులను మోసం చేశాడని కేటీఆర్ మండిపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో పోల్చి మరీ విమర్శలు గుప్పించారు. పెన్షన్లపై ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, ఎన్నికల హామీ మేరకు వారంలోనే చంద్రబాబు పెన్షన్లు పెంచారని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే పెన్షన్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వృద్దులను మోసం చేశాడని కేటీఆర్ మండిపడ్డారు. ఇక హైడ్రా విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళతామని కేటీఆర్ చెప్పారు.
కొండగల్‌లో సర్వే నంబర్ 1138లో రేవంత్ ఇల్లు చెరువులో ఉందని ఆయన ఆరోపించారు. మెదట రేవంత్, ఆయన సోదరుడి ఇళ్లు కూల్చాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియాకు ముఖ్యమంత్రి ముఖం చాటేశాడని, హైడ్రాతో ప్రజల్లో వ్యతిరేకత రావటంతోనే సీఎం రేవంత్ మాట్లాడటం లేదని కేటీఆర్ విమర్శించారు.
మంత్రులపై కేటీఆర్ ఫైర్
‘‘సీఎం, మంత్రులు అధికారుల వెనుక దాక్కుంటున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు హైడ్రాపై ఎందుకు మాట్లాడటం లేదు?. చదువుకున్న వాడు, సంస్కారవంతుడన్న గౌరవం శ్రీధర్ బాబుపై ఉండేది. తన మాటలతో మంత్రి శ్రీధర్ బాబు గౌరవం పోగొట్టుకుంటున్నాడు. ఓటుకు నోటు కేసు వాళ్లతో కూర్చని శ్రీధర్ బాబు కూడా చెడిపోయాడు. అసలైన అరాచక శక్తి పక్కన కుర్చీలోనే శ్రీధర్ బాబు కూర్చుకుంటున్నాడు. మూసీ నది సుందరీకరణకు అస్సలు డీపీఆర్ కూడా లేదు. హైడ్రాతో హైదరాబాద్ నుంచి ఆదాయం తగ్గింది. ఎంఐఎం ముందుకు రాకున్నా.. పాతబస్తీ ప్రజల తరుపున బీఆర్ఎస్ పోరాడుతోంది. మంత్రులు, కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయిలోకి వచ్చి మాట్లాడితే ప్రజలు తరిమి కొడతారు. బండి సంజయ్ సహా.. బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి భజన చేస్తున్నారు, రేవంత్ ఏం చేసినా.. బీజేపీ ఎంపీలు ఆయన భజన చేయటం దౌర్భాగ్యం. మూసీ నది సుందరీకరణ పేరుతో రానున్న ఎన్నికలను పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది’’ అని కేటీఆర్ తీవ్ర స్థాయిలో మంత్రులపై విమర్శలు గుప్పించారు.
Updated Date - Sep 30 , 2024 | 04:46 PM