KTR: రేవంత్ ఓ రాబందు..
ABN, Publish Date - Nov 16 , 2024 | 04:39 AM
సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజల పాలిట రాబందులా మారారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం నిర్ణయాలతో ప్రజలు రోదిస్తున్నారని, ఆక్రోశిస్తున్నారని తెలిపారు.
సీఎం నిర్ణయాలతో ప్రజలు రోదిస్తున్నారు
కొడంగల్‌కు చక్రవర్తిలా తిరుపతిరెడ్డి
కలెక్టర్లు, అధికారులు మోకరిల్లుతున్నారు
‘లగచర్ల’లో కాంగ్రెస్ వాళ్లు కూడా ఉన్నారు
గ్రామంలో లేనివారినీ జైలుకు పంపారు
న్యాయపోరాటం చేసి వారికి బెయిలిప్పిస్తాం
కొడంగల్‌లో మర్లబడ్డట్టే తెలంగాణ అంతా..
ప్రభుత్వానికి పేదోళ్ల ఉసురు: కేటీఆర్
సంగారెడ్డి జైల్లో లగచర్ల వాసులకు పరామర్శ
సంగారెడ్డి/పటాన్‌చెరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజల పాలిట రాబందులా మారారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం నిర్ణయాలతో ప్రజలు రోదిస్తున్నారని, ఆక్రోశిస్తున్నారని తెలిపారు. ఇటీవల వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై, అధికారులపై దాడి చేసిన ఘటనలో అరెస్టయి సంగారెడ్డి జైలులో ఉన్న లగచర్ల గ్రామస్థులను శుక్రవారం పలువురు బీఆర్‌ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒకప్పుడు ఫార్మాసిటీ అంటేనే కాలుష్యం అని మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పుడేమో ఫార్మా విలేజ్‌ల పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని ఆరోపించారు. రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల విలువ చేసే భూములను రూ.10 లక్షలకే అడిగితే రైతులకు ఆవేశం రాదా? అని ప్రశ్నించారు. జీవనాధారమైన భూమలను గుంజుకుంటుంటే నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని మండిపడ్డారు. లగచర్ల నిరసనలో కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా ఉన్నారని తెలిపారు. కొడంగల్ నియోజకవర్గానికి ఎనుముల తిరుపతిరెడ్డి చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి సోదరుడు కావడమే ఆయన అర్హత అయిందని, కలెక్టర్లు, అధికారులు, పోలీసులు ఆయనకు మోకరిల్లుతున్నారని ధ్వజమెత్తారు. తిరుపతిరెడ్డి ఆదేశించిన వారందరినీ జైలుకు పంపించారని తెలిపారు. ఘటన జరిగిన రోజు ఆ గ్రామంలో లేనివారిని కూడా జైలుకు పంపించారని, వికారాబాద్ ఎస్పీ, కొడంగల్ సీఐ, ఎస్‌ఐలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు చిత్రహింసలు పెట్టారు..
లగచర్ల వాసులను పోలీసులు తీవ్రవాదుల్లా పట్టుకొచ్చి చితకబాదారని, కాళ్లు, చేతులు కమిలిపోయేలా థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కేటీఆర్ తెలిపారు. పైగా.. కొట్టినట్లు చెబితే ఇంటి దగ్గర ఉన్నవాళ్లను చిత్రహింసలు పెడతామని హెచ్చరించడం హేయమైన చర్య అని అన్నారు. న్యాయపోరాటం చేసి బాధితులందరికీ బెయిలు ఇప్పిస్తామని చెప్పారు. ఈ రోజు కొడంగల్ మర్లబడ్డట్టే రేపు తెలంగాణ రాష్ట్రమంతా తిరగబడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వానికి పేదోళ్ల కన్నీటి ఉసురు తప్పక తాకుతుందని, అక్రమ కేసులు, నిర్బంధాలతో పోరాటాలను ఆపలేరని హెచ్చరించారు. ‘‘ఈ భూమి మీద ఎవరూ శాశ్వతంగా ఉండరు. నువ్వు చక్రవర్తివి.. నియంతవు కావు. నీ పదవి ఐదేళ్లు ఉంటుందని కూడా గ్యారంటీ లేదు. ఢిల్లీ కాంగ్రెస్ అనుకుంటే ఏడాది కూడా ఉండవు’’ అని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తున్న అన్ని చోట్లా రైతులకు, ప్రజలకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివా్‌సగౌడ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, అనిల్‌జాదవ్, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
లగచర్లలో కాంగ్రెస్ కార్యకర్తలే తిరుగుబాటు చేశారు : బీఆర్‌ఎస్
ప్రభుత్వమే లగచర్ల రైతులను రెచ్చగొట్టి ఆందోళనకు దిగేలా చేసిందని బీఆర్‌ఎస్ నేతలు కేపీ వివేకానంద, ఎర్రోళ్ల శ్రీనివాస్, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆరోపించారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో వారు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం తన అల్లుడి కోసం కొడంగల్‌లో రైతుల భూములు లాక్కుంటున్నారని, లగచర్లలో తిరుగుబాటు చేసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేనన్నారు. పార్టీలకు అతీతంగా భూములు ఇవ్వమని ప్రజలు అధికారులను ఎదిరిస్తే.. కుట్రపూరితంగా రేవంత్‌రెడ్డి ఆ అంశాన్ని బీఆర్‌ఎస్ వైపు మళ్లించారని తెలిపారు. లగచర్లలో 144 సెక్షన్ విధించి రేవంత్‌రెడ్డి, ఆయన అన్న తిరుపతిరెడ్డి కలిసి రజాకార్ పాలన సాగిస్తున్నారని, అయితే అక్కడి గిరిజనుల పక్షాన బీఆర్‌ఎస్ ఉంటుందన్నారు. రేవంత్‌రెడ్డి... కేటీఆర్, హరీశ్‌రావులపై బురద చల్లుతూ కేసీఆర్ నాయకత్వాన్ని బలహీనపర్చాలని కుట్ర చేస్తున్నారన్నారు. లగచర్లలో గిరిజన రైతులను అరెస్టు చేస్తే బండి సంజయ్ ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ కలిసి కేటీఆర్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు.
గురుకులాల నిర్వహణను గాలికొదిలేశారు: కేటీఆర్
హైదరాబాద్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలల నిర్వహణను గాలికి వదిలేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గడచిన 11 నెలల్లో వివిధ కారణాలతో 36 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారని తెలిపారు. నాణ్యత లేకపోతే జైలుకే అంటూ వేదికలెక్కి కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని, కానీ.. ప్రభుత్వం పట్టించుకుంటే విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు ఎందుకు చేస్తారని శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. ఆహార బిల్లులు, గురుకుల భవనాల అద్దె చెల్లించకపోవడంతో వాటికి తాళాలు వేస్తే 9నెలల బకాయిల్లో 3నెలల బిల్లులు చెల్లించారని గుర్తు చేశారు. మరోవైపు పత్తి, వరిధాన్యం కొనాలని ఆందోళన చేసినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో రైతన్నలు నష్టపోతున్నారని తెలిపారు. ‘‘11 నెలల పాలనలో సంక్షేమం మాయమైంది. అభివృద్ధి దూరమయింది. కాంగ్రెస్ తెచ్చిన మార్పు చూసి తెలంగాణ నివ్వెరపోతోంది. సరైన కాలం రాగానే కాటేసితీరాలని ఎదురు చూస్తోంది’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Updated Date - Nov 16 , 2024 | 04:39 AM