KTR: ఏపీలో ఏం జరిగిందో చూశారుగా.. అధికారులకు కేటీఆర్ మాస్ వార్నింగ్
ABN, Publish Date - Sep 26 , 2024 | 05:23 PM
అధికారులు, పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలకకూడదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) పేర్కొన్నారు. అలా చేసిన వారికి ప్రస్తుతం ఏపీలో ఏం జరుగుతుందో చూస్తున్నారుగా అని అధికారులను హెచ్చరించారు.
హైదరాబాద్: అధికారులు, పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలకకూడదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) పేర్కొన్నారు. అలా చేసిన వారికి ప్రస్తుతం ఏపీలో ఏం జరుగుతుందో చూస్తున్నారుగా అని అధికారులను హెచ్చరించారు. సిరిసిల్లలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అధికారులు కాంగ్రెస్ నేతల్లా, కార్యకర్తల్లా అత్యుత్సాహాన్ని ప్రదర్శించకూడదన్నారు. ఏపీలో ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను కూడా సస్పెండ్ చేశారని.. ఈ విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు. అధికారం శాశ్వతం కాదని, అధికారులు చట్టం ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అంటే ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించారు.
వారంతా సిద్ధంగా ఉండాలి..
రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్న విషయం తెలిసిందే. ఈ కామెంట్స్‌పై కేటీఆర్ స్పందించారు. పార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగడం ఖాయమని.. కడియంతోపాటు అందరూ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన వారికి పరాభవం తప్పదని కేటీఆర్ విమర్శించారు.
రోడ్డునపడ్డ నేతన్నల కుటుంబాలు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయంగా తన మీద ఉన్న కోపంతో రాజన్న సిరిసిల్ల ప్రజల మీద, నేతన్నల మీద పగ తీర్చుకుంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో నేతన్నల ఆత్మహత్యలు జరిగాయన్నారు.
కాంగ్రెస్ ఉన్నప్పుడే బీఆర్ఎస్ తరఫున రూ.50 లక్షలు పద్మశాలి ట్రస్ట్‌కు ఇచ్చి సిరిసిల్లను ఆదుకున్నట్లు చెప్పారు. విద్యార్థులకు యూనిఫామ్స్‌తో పాటు రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకకు ఇచ్చే చీరలను సిరిసిల్ల నేతన్నలకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ దివాలాకోరు ఆలోచనల వల్ల రాష్ట్రంలోని కోటిమందికి పైగా ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు బంద్ అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మీద కక్ష ఉంటే తనపైనే తీర్చుకోవాలని.. కానీ నేతన్నలను ఇబ్బంది పెట్టవద్దని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
Harsha Sai: హర్ష సాయిపై వాస్తవాలు బయటపెట్టిన బాధితురాలి లాయర్
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Sep 26 , 2024 | 05:31 PM