Telangana: అప్పులు తక్కువ.. చెల్లింపులు ఎక్కువ!
ABN, Publish Date - Apr 15 , 2024 | 03:29 AM
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి రేవంత్‌రెడ్డి సర్కారు ప్రయత్నిస్తోంది. అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేందుకు చర్యలు చేపడుతోంది. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పాటు వడ్డీలను చెల్లించేందుకు ఆర్థిక క్రమశిక్షణను
4 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ కొత్త రుణం రూ.17,618 కోట్లు
వడ్డీలు, వాయిదాలకు రూ.25,911 కోట్ల చెల్లింపులు
ఆర్థిక క్రమశిక్షణకు సర్కారు పెద్దపీట
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సర్కారు ప్రయత్నిస్తోంది. అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేందుకు చర్యలు చేపడుతోంది. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పాటు వడ్డీలను చెల్లించేందుకు ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తోంది. దుబారా లేకుండా ప్రతి పైసాకు జవాబుదారీ ఉండేలా ఖర్చులను నియంత్రిస్తోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో సుమారు రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసింది. వాటికి చెల్లించే వడ్డీలు, కిస్తీలే తడిసిమోపెడయ్యాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు అంటే.. డిసెంబరు నుంచి ఈ నెల 13 వరకు రూ.17,618 కోట్ల రుణాలు (బడ్జెట్, బడ్జెటేతర) చేసింది. అయితే.. ఇదే వ్యవధిలో రూ.25,911 కోట్ల మేర (అప్పులు, వడ్డీలు) కిస్తీల పేరిట తిరిగి చెల్లించింది. కొత్తగా చేసిన అప్పుల కంటే సుమారు రూ.8 వేల కోట్లకు పైగా చెల్లింపులను ఎక్కువగా చేశారు. ఆ మేరకు రాష్ట్ర ప్రజలపై రుణ భారం తగ్గినట్లయిందని అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కలిపి తిరిగి చెల్లించేందుకు గడిచిన 125 రోజుల్లో రేవంత్ సర్కారు సగటున రోజుకు రూ.207 కోట్లు ఖర్చు పెట్టింది.
గత ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా చేసిన అప్పులకు వడ్డీలు, కిస్తీలను చెల్లించేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక అప్పులు, వడ్డీల చెల్లింపులే కాకుండా ప్రజోపయోగమైన పనులకు మరో రూ.5,816 కోట్లు మూలధన వ్యయం కూడా చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా భారీ అప్పుల జోలికి వెళ్లకుండా ప్రస్తుత ప్రభుత్వం నియంత్రణను పాటిస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ పరిమితులకు లోబడి మార్కెట్ రుణాలు తీసుకొని, ఖర్చులకు సరిపడేలా సర్దుబాటు విధానం అనుసరిస్తోంది. గతంతో పోలిస్తే అప్పులు తగ్గుముఖం పట్టడం శుభసూచకమని ప్రభుత్వ పెద్దలు పేర్కొంటున్నారు. రాష్ట్ర రుణ భారాన్ని తగ్గించినట్లవుతుందని అంచనా వేస్తున్నారు. 2023 డిసెంబరు నుంచి ఇప్పటి వరకు అంటే నాలుగు నెలల్లో రూ.15,968 కోట్ల మేర ప్రభుత్వం అప్పులు తీసుకుంది. గత ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో రూ.19,569 కోట్లు, 2021-22లో రూ.26,995 కోట్ల అప్పులు తీసుకుంది. 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.59,625 కోట్ల రుణాలను రేవంత్ సర్కారు అంచనా వేసింది. అందు లో ఇప్పటివరకు కేవలం రూ.2,500 కోట్లు అప్పుగా తీసుకుంది. గతంతో పోలిస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) పెరిగినందున రుణాలు తీసుకునే పరిధి పెరిగింది. జీఎ్‌సడీపీ ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం తక్కువ అప్పులు చేయడం కొత్త మార్పునకు సంకేతమని పేర్కొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Apr 15 , 2024 | 08:09 AM