ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhadradri Kothagudem: ప్రేయసిని చంపి.. చేలో పూడ్చి

ABN, Publish Date - Nov 14 , 2024 | 04:54 AM

ఓ యువకుడు, యువతి ప్రేమ.. సహజీవనంతో మొదలైన కథ.. కక్షలతో మలుపులు తిరిగింది. ఒక మహిళపై హత్యాయత్నానికి, మరో జంట ఆత్మహత్యకు, చివరికి ఆ యువతి హత్యకు దారితీసింది.

భద్రాద్రి జిల్లాలో ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి.... ఆరేళ్ల పాటు సహజీవనం చేసి... ఘాతుకం

  • సహజీవనం చేస్తూ మరో మహిళతోపెళ్లి

  • ముగ్గురూ ఒకే ఇంట్లో కాపురం.. కలహాలు

  • హతురాలు మరో జంట ఆత్మహత్య కేసులో నిందితురాలు

జూలూరుపాడు, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఓ యువకుడు, యువతి ప్రేమ.. సహజీవనంతో మొదలైన కథ.. కక్షలతో మలుపులు తిరిగింది. ఒక మహిళపై హత్యాయత్నానికి, మరో జంట ఆత్మహత్యకు, చివరికి ఆ యువతి హత్యకు దారితీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాలో జరిగిన ఆమె హత్య ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హతురాలు భూపాలపల్లికి చెందిన తోట స్వాతి (32) ఆరేళ్ల కిందట కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆయాగా పనిచేసేందుకు వచ్చింది. మణుగూరు మండలం తోగ్గూడెం గ్రామానికి చెందిన ఆమె భర్త అప్పటికే అనారోగ్యంతో మృతిచెందాడు. స్వాతికి అదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న బానోతు భద్రంతో పరిచయం ఏర్పడి.. ప్రేమగా మారింది. అతని స్వస్థలం జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాలో ఇద్దరూ సహజీవనం మొదలుపెట్టారు. కొంతకాలానికి ఇద్దరూ పాఠశాలలో పనిచేయడం మానేశారు. భద్రం స్వాతితో సహజీవనం చేస్తూనే గ్రామానికే చెందిన నందిని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. నందినితో వివాహం జరిగిన తరువాత కూడా స్వాతితో సహజీవనం కొనసాగించాడు. ముగ్గురూ కలిసి మాచినేనివారి తండాలో ఒకే ఇంట్లో ఉండేవారు.


స్వాతి కొత్తగూడెంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా నందిని ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో వారి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. నందినిపై స్వాతి అక్కసు పెంచుకుంది. నందినిని అడ్డు తొలగించుకోవాలని పన్నాగం పన్నింది. తనతో పాటు వస్త్ర దుకాణంలో పనిచేసే జూలూరుపాడు మండలం సాయిరాంతండాకు చెందిన వివాహితుడైన హలావత్‌ రత్నకుమార్‌తో సంబంధం పెట్టుకుంది. తన తండ్రి సింగరేణిలో పనిచేస్తున్నాడని, అందులో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రత్నకుమార్‌ నుంచి రూ.15 లక్షలు, బంగారం తీసుకొంది. తరువాత నందినిని హత్య చేయించేందుకు రత్నకుమార్‌తో కుట్ర పన్నింది. సెప్టెంబరు 29న నందిని ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రత్నకుమార్‌ వెళ్లి దాడి చేయగా ఆమె గాయపడింది. తన భర్త భద్రం, స్వాతి కలిసి తనను చంపేందుకు దాడి చేయించారని నందిని జూలూరుపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఆమె తన తల్లి ఇంటి వద్దే ఉంటుండగా భద్రం, స్వాతి కలిసి ఉంటున్నారు. నందినిపై దాడి విషయం బయటికొస్తుందన్న భయంతో పాటు, ఉద్యోగం కోసమని స్వాతికి డబ్బులు చెల్లించి అప్పులపాలు కావడంతో రత్నకుమార్‌, అతడి భార్య పార్వతి సెప్టెంబరు 30న కొత్తగూడెంలో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్వాతి నమ్మించి డబ్బులు తీసుకొని మోసం చేయడంతోనే తన కుమారుడు, కోడలు ఆత్మహత్య చేసుకున్నారని రత్నకుమార్‌ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


దీంతో నందినిపై దాడి కేసు, రత్నకుమార్‌ దంపతుల ఆత్మహత్య కేసుల్లో స్వాతి విచారణ ఎదుర్కొంటోంది. తాను రత్నకుమార్‌ నుంచి రూ.8 లక్షలు తీసుకున్నానని, అందులో రూ.2 లక్షలు తన ప్రియుడు భద్రంకు ఇచ్చానని స్వాతి పోలీసుల ముందు అంగీకరించింది. ఆ డబ్బులను తిరిగి ఇచ్చేస్తానంటూ గడువు కోరింది. గడువు సమీపించడంతో తాను ఇచ్చిన రెండు లక్షలు ఇవ్వాలని భద్రంను అడగడంతో వారిద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీంతో స్వాతి 15 రోజుల క్రితం పురుగులమందు తాగింది. అయితే ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ నేపథ్యంలో కట్టుకున్న భార్యకు, కుమారుడికి దూరమాయ్యనని, ఆర్థికంగా కష్టాలు వచ్చిపడ్డాయని, దీనికంతటికీ స్వాతే కారణమని భద్రం భావించాడు. ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని పథకం పన్నాడు. ఈ నెల 9న తన ఇంట్లోనే కత్తితో స్వాతి తలపై నరికి హత్య చేశాడు. తన తల్లి సరోజ సహాయంతో మృతదేహాన్ని అదే రోజు రాత్రి గోనెసంచిలో పెట్టి తన పత్తి చేనులో పూడ్చిపెట్టాడు. కేసుల విచారణ నిమిత్తం స్వాతిని తీసుకురావాలని పోలీసులు భద్రానికి సమాచారం అందించారు. అతను పోలీసుల వద్దకు వెళ్లి మూడు రోజుల నుంచి స్వాతి కనిపించడం లేదని, ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు. అనుమానం వచ్చి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.


  • శవాన్ని వెలికితీసి.. పోస్టుమార్టం

కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్‌ రెహ్మాన్‌, జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐ రాణాప్రతాప్‌ బుధవారం మాచినేనిపేటతండాను సందర్శించారు. స్వాతి మృతదేహాన్ని వెలికితీయించి, పంచనామా, పోస్టుమార్టం చేయించారు. ఆమె బంధువులకు సమాచారం అందించగా, ఆమె తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారని, ఆమెతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని తెలిపారని సీఐ వెల్లడించారు. రెండు రోజుల పాటు కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో స్వాతి మృతదేహాన్ని ఉంచుతామని, వస్తే బంధువులకు, లేదంటే మునిసిపాలిటీకి అప్పగిస్తామని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి బీ జ్యోతి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Nov 14 , 2024 | 04:54 AM