Hyderabad: ఎల్వీపీఈఐకి అరుదైన రికార్డు
ABN, Publish Date - Sep 13 , 2024 | 04:48 AM
ఎల్‌వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
50 వేలకుపైగా కార్నియా మార్పిడిలు
ఏటా 12 వేలకుపైగా నేత్రదానాలు
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యధికం
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఎల్‌వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యధికంగా 50 వేలకు పైగా కార్నియా మార్పిడిలను ఎల్వీపీఈఐలోని శాంతిలాల్ సంఘ్వీ కార్నియా ఇన్‌స్టిట్యూట్ నిర్వహించి ఘనతను సాధించింది. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్వీపీఈఐ వ్యవస్థాపకుడు డాక్టర్ గుళ్ళపల్లి ఎన్ రావు వివరాలు వెల్లడించారు. 1987లో ఎల్‌వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థను స్థాపించినప్పటి నుంచి 50 వేలకు పైగా కార్నియా మార్పిడిలను పూర్తి చేసుకుందని చెప్పారు. ఎల్వీపీఈఐ నేత్రనిధి వ్యవస్థ పరిధిలోని హైదరాబాద్‌లోని రామాయమ్మ అంతర్జాతీయ నేత్రనిధి, విశాఖపట్నంలోని మొహ్సిన్ నేత్రనిధి, భువనేశ్వర్‌లోని దృష్టి దాన్ నేత్రనిధి, విజయవాడ టీకేఈబీ సంస్థల నుంచి ప్రతి ఏడాది 12 వేలకుపైగా పైగా నేత్రదానాలను అందుకుంటున్నాయని వివరించారు.
ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యధికం అన్నారు. 37 సంవత్సరాలలో యాబై వేల కార్నియా మార్పిడులు చేయడం ప్రపంచంలో ఏ ఇతర సంస్థ చేయలేదన్నారు. 1989లో స్థాపించినప్పటి నుంచి రామాయమ్మ అంతర్జాతీయ నేత్ర నిధి 5,10,000 కుపైగా కార్నియాలను భద్రపరిచే మాధ్యమం (ఎంకె మీడియం) వయల్స్ ఉత్పత్తి చేసిందని, 1,29,500 కార్నియాలను సేకరించిందన్నారు. కార్యక్రమంలో ఎల్వీపీఈఐ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ ప్రశాంత్ గర్గ్, శాంతిలాల్ సంఘ్వీ కార్నియా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ వడ్డవల్లి పాల్గొన్నారు.
Updated Date - Sep 13 , 2024 | 04:48 AM