TS News: మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలి.. సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ ఎమ్మెల్యేల వినతి
ABN, Publish Date - Jul 29 , 2024 | 07:09 PM
మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాదిగ ఎమ్మెల్యేలు వినతి పత్రం సమర్పించారు. అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో అడ్లూరి లక్ష్మణ్, కవంపల్లి సత్యనారాయణ, మందుల సామ్యేల్, లక్ష్మీ కాంతారావు, వేముల వీరేశం.. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
హైదరాబాద్: మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాదిగ ఎమ్మెల్యేలు వినతి పత్రం సమర్పించారు. అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో అడ్లూరి లక్ష్మణ్, కవంపల్లి సత్యనారాయణ, మందుల సామ్యేల్, లక్ష్మీ కాంతారావు, వేముల వీరేశం.. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గమైన తమ కమ్యూనిటీకి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు.
కాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని ఆ సామాజిక వర్గ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. జనాభా పరంగా గణనీయ సంఖ్యలో ఉన్న తమకు కేబినెట్‌లో చోటు ఇవ్వాలని కోరుతున్నారు.
సీఎం దృష్టికి వికారబాద్-కృష్ణా రైల్వే రూట్ మ్యాచ్..
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్‌ను రైల్వేశాఖ చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యన్ వివరించారు. వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ మీదుగా ఈ రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. రూ.3,500 కోట్లతో 145 కి.మీ పొడవుతో ఏర్పాటు చేయనున్న ఈ రైల్వే లైన్ రూట్ మ్యాప్‌పై సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, వాకాటి శ్రీహరి, పర్ణిక రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అసెంబ్లీలో విద్యుత్ సమస్యపై మాట్లాడిన సీఎం..
అంతకుముందు ఇవాళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాల విషయంలో సత్యహరిశ్చంద్రుడి తరువాత కేసీఆరే (KCR) అన్నట్లు వాళ్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఛత్తీస్ ఘడ్ (Chhattisgarh), యాదాద్రి (Yadadri), భద్రాద్రి (Bhadradri) ఒప్పందాలపై వారే విచారణకు అడిగారని, వాళ్ల కోరిక మేరకే విచారణకు కమిషన్ నియమించామన్నారు.. కమిషన్ వద్దకు వచ్చి వివరాలు ఇవ్వాలని కోరితే కమిషన్‌పైనే ఆరోపణలు చేశారని మండిపడ్డారు. విచారణ కమిషన్ ముందు వాదన వినిపించకుండా కమిషన్ వద్దని కోర్టుకు వెళ్లారని, విచారణ కొనసాగించాల్సిందేనని సుప్రీంకోర్టు చెప్పిందని, అయితే కొత్త కమిషన్ చైర్మన్‌ను నియమించాలని న్యాయస్థానం చెప్పిందని అన్నారు. విచారణ కమిషన్‌కు కొత్త చైర్మన్‌ను సోమవారం సాయంత్రంలోగా నియమిస్తామన్నారు.
Updated Date - Jul 29 , 2024 | 07:09 PM