చోరీ కేసుల నిందితుడి అరెస్ట్
ABN, Publish Date - Dec 28 , 2024 | 11:00 PM
చోరీలకు పాల్పడి పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని నారాయణపేట పొలీసులు పట్టుకున్నారు. అతని నుంచి రూ.19 లక్షల విలువ చేసే బంగారం, రూ.1.50 లక్షల విలువ చేసే వెండిని రికవరీ చేసినట్లు నారాయణపేట డీఎస్పీ లింగయ్య తెలిపారు.
నారాయణపేట టౌన్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): చోరీలకు పాల్పడి పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని నారాయణపేట పొలీసులు పట్టుకున్నారు. అతని నుంచి రూ.19 లక్షల విలువ చేసే బంగారం, రూ.1.50 లక్షల విలువ చేసే వెండిని రికవరీ చేసినట్లు నారాయణపేట డీఎస్పీ లింగయ్య తెలిపారు. వివరాలను నారాయణపేట జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. ఊట్కూరు మండలానికి చెందిన చాపలి భాస్కర్ గతంలో మక్తల్, ఊట్కూరు, మద్దూరు పోలీ్‌సస్టేషన్‌ల పరిధిలో చోరీలకు పాల్పడి, జైలుకు వెళ్లివచ్చాడని తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న భాస్కర్ 2018 ఆగస్టు 10న గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, వైద్యం కోసం మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లారన్నారు. అప్పుడు తప్పించుకున్నాడని చెప్పారు. తర్వాత హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లి కూలీగా పని చేశాడన్నారు. ఖర్చులకు డబ్బులు అవసరం ఉండగా మరికల్‌లో శనివారం చోరీకి యత్నించగా, పోలీసులు పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. భాస్కర్‌పై నారాయణపేట, మరికల్, మక్తల్, కోస్గి పోలీస్ స్టేషన్‌ల పరిధిలో సుమారు 13 దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. నిందితుడి నుంచి 240 గ్రాముల బంగారంతో పాటు రూ.1.50 లక్షల విలువ చేసే వెండిని రికవరీ చేసినట్లు తెలిపారు. నిందితుడిని పట్టుకొని, కేసులను ఛేదించడంలో కృషి చేసిన మరికల్ సీఐ రాజేందర్, నారాయణపేట సీఐ శివశంకర్, మరికల్, నారాయణపేట ఎస్‌ఐలు రాములు, అందె వెంకటేశ్వర్లు, క్రైం పార్టీ పోలీసు బృందం రవీందర్‌నాథ్, తిరుపతిరెడ్డి, లింగమూర్తి, ఆంజనేయులు, రాములను డీఎస్పీ అభినందించారు. రివార్డులను అందించారు.
Updated Date - Dec 28 , 2024 | 11:00 PM