ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డబ్బులెవరికీ ఊరికే రావు..

ABN, Publish Date - Dec 23 , 2024 | 11:44 PM

డబ్బులెవరికీ ఊరికే రావు.. చేసిన ఖర్చుకు తగిన వస్తు, సేవలు పొందడం మన హక్కు. నష్టపోయిన, మోసపోయిన వారికి వినియోగదారుల ఫోరం అండగా నిలబడుతోంది.

మహబూబ్‌నగర్‌ పట్టణంలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ కార్యాలయం

- నాణ్యమైన వస్తు, సేవలను పొందడం మన హక్కు

- సరైన అవగాహన లేక నష్టపోతున్న ప్రజలు 8 ధైర్యంగా ముందుకు రావాలి

- నష్టపోయినా, మోసపోయినా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాలి

- నేడు జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం

మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ప్రముఖ మాల్‌లో ఓ మహిళ ఎంతో ముచ్చటపడి పట్టుచీర కొనుగోలు చేసింది. తీరా కట్టుకుం దామని చూసే సరికి అది డ్యామేజ్‌ అయి ఉంది. వెంటనే చీర తీసుకుని మాల్‌కు వెళ్లి అడిగింది. వారి నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో ఆమె నేరుగా వినియోగ దారుల ఫోరాన్ని ఆశ్ర యించడంతో సంబంధిత మాల్‌ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది. దీంతో వారు ఆ మహి ళకు మరో కొత్త చీరను ఇచ్చి కేసును పరిష్కరించుకున్నారు.

పాలమూరుకు చెందిన ఓ వ్యక్తి ప్రముఖ కంపెనీ వస్త్రాన్ని తీసుకుని, వారి వద్దనే సూట్‌ కుట్టించుకున్నారు. కానీ అది సరిగా కుదరలేదు. టైలర్‌ చేసిన పొరపాటుతో నష్టపోయిన అతడు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. వారు సదరు వస్త్ర పరిశ్రమ నుంచి రూ. 10 వేలు పరిహారం ఇప్పించారు.

గద్వాల జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి రూ.70 లక్షలకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చేశారు.. రెండేళ్ళు సక్రమంగా ప్రీమియం చెల్లించారు. ఆ తరువాత ఆయన చనిపోయారు. పాలసీ డబ్బు కోసం కుటుంబీకులు ఇన్సూరెన్స్‌ కంపెనీని సంప్రదిస్తే వారు నిరాకరించారు. పాలసీ చేయకముందే ఆ ఉద్యోగికి అనారోగ్య సమస్యలున్నాయని, డబ్బులు రావని చెప్పడంతో బాధిత కుటుంబీకులు ఫోరంను ఆశ్రయించారు. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : డబ్బులెవరికీ ఊరికే రావు.. చేసిన ఖర్చుకు తగిన వస్తు, సేవలు పొందడం మన హక్కు. నష్టపోయిన, మోసపోయిన వారికి వినియోగదారుల ఫోరం అండగా నిలబడుతోంది. ఈ విషయంపై సరైన అవగాహన లేక చాలా మంది నష్టపోతున్నారు. ఎంతో ముచ్చట పడి మార్కెట్‌లో వస్తువులు కొనుగోలు చేసిన వారు, అవి సరిగా లేకపోయినా, సరైన సేవలు అందనప్పుడు సంబంధిత దుకాణానికి వెళ్లి అడిగినా, వారు సరైన సమాధానం ఇవ్వకుండా అమ్మడం వరకే తమ బాధ్యత అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. కొనుగోలు చేసినపుడే అన్నీ చూసుకోవాలంటూ దురుసుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి సమయాల్లో వినియోగదారుల ఫోరం వారికి అండగా నిలుస్తోంది.

పోతే పోనీలే అనుకొని నష్టపోవద్దు

వినియోగదారుల ఫోరం అందించే సేవలపై ప్రతీ అవగాహన కలిగి ఉండాలి. కొత్త చెప్పులు నాలుగు రోజులకే తెగిపోయినా, ముచ్చటపడి కొన్న చీర డ్యామే జీ అయినా, కొన్న విత్తనాలు మొలకెత్తకపోయినా.. ఫోరం తలుపు తట్టవచ్చునన్న విషయాన్ని తెలుసు కోవాలి. అయితే చాలా మంది చిన్న చిన్న వస్తువులు కొని నష్టపోయినప్పుడు ఫోరం వరకు ఎందుకు? పోతే పోయిందిలే అనుకొని వదిలేస్తుంటారు. మరికొంత మంది ఫోరంను ఎలా ఆశ్రయించాలో తెలియక సర్దుకుపోతుంటారు. కానీ మోసపోయినా, నష్టపోయినా తప్పనిసరిగా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలి. అప్పుడే వ్యాపారులు కూడా సరైన సేవలు, నాణ్యమైన వస్తువులు అందించేందుకు కృషి చేస్తారు.

ఫిర్యాదులకు ఫీజు తక్కువే..

వివిధ వస్తు సేవల కొనుగోలులో మోసపోయిన, నష్టపోయిన వారు వినియోగదారుల ఫోరంలో ఫిర్యా దు చేసేందుకు చాలా తక్కువ ఫీజు మాత్రమే చెల్లిం చాల్సి ఉంటుంది. వస్తువు లేదా సేవల విలువ ఐదు లక్షల రూపాయల లోపు అయితే ఎలాంటి ఫీజు చెల్లిం చాల్సిన అవసరం లేదు. ఐదు లక్షల రూపాయల నుంచి రూ. 10 లక్షల లోపు అయితే రూ. 250, రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు రూ.400, రూ. 20 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు వెయ్యి రూపాయలు, రూ. 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రెండు వేలు మాత్రమే ఫీజు ఉంటుంది.

ఏటా 90 నుంచి 100 కేసులు

ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తానికి మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఒకే ఒక వినియోగ దారుల ఫోరం ఉంది. ఇక్కడ ఫోరం అధ్యక్షుడు, ఇద్దరు సభ్యులతో కూడిన బెంచ్‌ అన్ని పని దినాల్లో కేసులను విచారిస్తుంది. ఫోరంకు ఈ ఏడాది 98 కేసులు వచ్చాయి. గత ఏడాది 80 కేసులు నమోదయ్యాయి. ఫోరం ప్రారంభం అయిన తరువాత ఇప్పటివరకు 6,211 కేసులను విచారించింది. వినియోగదారులు ఆన్‌లైన్లో వివరాలు సమర్పించి, ఫోరంను సంప్రదిం చవచ్చు. లేదా న్యాయవాది ద్వారా ఫిర్యాదు చేసినా, కేసును స్వీకరిస్తారు.

బిల్లులు భద్రపరుచుకోవడం తప్పనిసరి

వినియోగదారులు తాము కొనుగోలు చేసిన ప్రతీ వస్తువు బిల్లును తప్పనిసరిగా భద్ర పరుచుకోవాలి. కొనుగోలు చేసిన తేదీ నుంచి రెండేళ్లలోపు ఫోరంను ఆశ్రయించేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏడాది లోపు వారంటీ ఉండి, వస్తువు పని చేయకపోతే ఆ సమయంలోనే కేసు వేయాలి. మార్కెట్‌లో కొనుగోలు చేసిన ఏ వస్తువు సరిగా లేకపోయినా, లోపమున్నా, నిర్ధారిత ధర కన్నా ఎక్కువ తీసుకున్నా, కొత్త వాహనాల పేరుతో పాతవి విక్రయించినా ఫిర్యాదు చేయొచ్చు. మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలో సెల్‌ ఫోన్లు, వాహనాల సర్వీసులు, వైద్య సేవల్లో నిర్లక్ష్యం, ఆన్‌లైన్లో జరిగిన మోసాలపై ఎక్కువ కేసులు వస్తు న్నాయి. వ్యవసాయానికి సంబంధించి విత్తనాలు మొల కెత్తకపోవడం, మొలకెత్తినా పూత, గింజ పట్టకపోవడం వంటి ఫిర్యాదులు వస్తున్నాయి. గద్వాల, బిజినేపల్లి, భూత్పూర్‌ మండలాల పరిధిలో ఈ బెడద ఎక్కువగా ఉంటోంది. రైతులు విత్తనాలను కొనుగోలు చేసినప్పుడు తప్పని సరిగా బిల్లు తీసుకొని భద్ర పరుచుకోవాలి. నష్టం జరిగినప్పుడు ముందుగా మండల వ్యవ సాయాధికారికి ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత అన్ని ఆధారాలు, అవసరమైన ధ్రువపత్రాలతో ఫోరంలో ఫిర్యాదు చేస్తే తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది.

వినియోగదారులకు న్యాయం చేయడమే ఫోరం లక్ష్యం.

బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేసే కేసును స్వీకరిస్తాం. కొనుగోలు చేసిన వస్తువు బిల్లులు, ఆధారాలు సమర్పించాలి. మహబూబ్‌నగర్‌కు చెందిన వ్యక్తి ఢిల్లీలో వస్తువు కొనుగోలు చేసి నష్టపోయినా, ఇక్కడ ఫిర్యాదు చేయొచ్చు. మునిసిపాలిటీల్లో నిర్దేశిత పన్ను కన్నా అధికంగా వసూలు చేసినా ఫోరంను ఆశ్రయించవచ్చు. వస్తువు విలువ రూ.50 లక్షల లోపు ఉంటే మహబూబ్‌నగర్‌లో ఫిర్యాదు చేయాలి. అంతకన్నా ఎక్కువగా ఉంటే హైదరాబాద్‌ ఫోరంను ఆశ్రయించాల్సి ఉంటుంది.

- ఎం అనూరాధ, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ అధ్యక్షురాలు

Updated Date - Dec 23 , 2024 | 11:44 PM