Mahesh Kumar Goud: బీసీ బిడ్డగా భరోసా ఇస్తున్నా..
ABN, Publish Date - Oct 22 , 2024 | 03:21 AM
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిలుపుదలకు సుప్రీంకోర్టు నిరాకరించడం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
జీవో 29తో రిజర్వుడ్ అభ్యర్థులకు అన్యాయం జరగదు
ప్రశాంతంగా పరీక్ష రాసుకోండి- పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
హైదరాబాద్, నిజామాబాద్ అర్బన్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిలుపుదలకు సుప్రీంకోర్టు నిరాకరించడం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ యువతకు ఉన్నత ఉద్యోగాలు ఇవ్వాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను హైకోర్టు, సుప్రీంకోర్టు సమర్థించాయన్నారు. ఇక ఎలాంటి ఆందోళన, ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసుకోవాలంటూ అభ్యర్థులకు సూచించారు. 13 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జీవో 29 వల్ల రిజర్వుడు క్యాటగిరీ అభ్యర్థులకు ఎలాంటి అన్యాయమూ జరగదని ఒక బీసీ బిడ్డగా తాను విద్యార్థులకు మరోసారి భరోసా ఇస్తున్నానని పేర్కొన్నారు.
అంతకుముందు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిజామాబాద్ అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ(నుడా) చైర్మన్‌గా నియమితులైన కేశవేణు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు వాటి రాజకీయ లబ్ధి కోసం గ్రూప్ -1 అభ్యర్థులను పావుగా వాడుకున్నాయన్నారు. కార్యకర్తలనుద్దేశించి... పార్టీ కోసం కష్టపడ్డ వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ... ప్రభుత్వంపై సోషల్ మీడియాతో పాటు కొన్ని మీడియా సంస్థల ద్వారా విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
Updated Date - Oct 22 , 2024 | 03:21 AM