Asifabad: పత్తి చేనులో మళ్లీ పులి గాడ్రింపు
ABN, Publish Date - Dec 01 , 2024 | 04:47 AM
మనిషి రక్తం రుచి మరిగిన పెద్ద పులి.. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసులను హడలెత్తిస్తోంది. కాగజ్‌నగర్ మండలంలోని ఓ పత్తి చేనులో శుక్రవారం ఓ యువతిని పొట్టనపెట్టుకున్న
పత్తి ఏరుతున్న రైతుపై పంజా.. తీవ్రగాయాలు
ఆసిఫాబాద్ జిల్లాలో బెంబేలెత్తిస్నున్న వ్యాఘ్రం
డ్రోన్ల సాయంతో ముమ్మర గాలింపు
అధికారుల సూచనలు పాటించండి: కొండా సురేఖ
సిర్పూరు(టి)/కాగజ్‌నగర్/ హైదరాబాద్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): మనిషి రక్తం రుచి మరిగిన పెద్ద పులి.. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసులను హడలెత్తిస్తోంది. కాగజ్‌నగర్ మండలంలోని ఓ పత్తి చేనులో శుక్రవారం ఓ యువతిని పొట్టనపెట్టుకున్న పెద్ద పులి.. సిర్పూ రు టౌన్ దుబ్బగూడ సమీపంలోని పత్తి చేల్లో శనివారం మళ్లీ పంజా విసిరింది. తన పొలంలో పత్తి ఏరుకుంటున్న రౌతు సురేశ్ అనే రైతుపై వెనుక నుంచి దాడి చేసింది. పక్కనే ఉన్న సురేశ్ భార్య వేసిన కేకలకు సమీపంలోని పొల్లాల్లో ఉన్నవారు కూడా అక్కడి చేరుకుని అరవడంతో పులి పారిపోయింది. శనివారం ఉదయం పది గంటల సమయంలో ఈ దాడి జరగడం గమనార్హం. తీవ్రంగా గాయపడిన సురేశ్‌ను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాగజ్‌నగర్‌కు అక్కడి నుంచి మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు.
సురేశ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, పెద్దపులి వరుస దాడులతో ప్రజలు హడలిపోతున్నారు. దీంతో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి దాడి చేసిన ప్రాంతాలతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య మాత్రమే పొ లం పనులకు వెళ్లాలని సూచించారు. శనివారం ఉదయం నుంచి డ్రోన్ల సాయంతో పులి జాడను వెతుకుతున్నారు. పులి దాడుల్లో ఓ యువతి మరణించగా, మరో రైతు తీవ్రం గా గాయపడటంపై అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పులి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారుల సూచనలను పాటించాలని పిలుపునిచ్చారు.
Updated Date - Dec 01 , 2024 | 04:47 AM