BRS: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష
ABN, Publish Date - Jan 19 , 2024 | 10:52 AM
తెలంగాణ భవన్‌లో ఈ రోజు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరగనుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. మెదక్ పార్లమెంట్ పరిధిలో గల ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమీక్షిస్తారు.
హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ (BRS) మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అధ్యక్షతన ఈ రోజు జరగనుంది. మెదక్ పార్లమెంట్ పరిధిలో గల 7 అసెంబ్లీ నియోజకవర్గాలు సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్ చెరు, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమీక్షిస్తారు. ఆరు అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. పార్టీ అభ్యర్థుల విజయంలో మాజీమంత్రి హరీశ్ రావు కీలకపాత్ర పోషించారు. 2018లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరు సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే.
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. దీంతో మెదక్ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మెదక్ లోక్ సభ సీటును గెలుచుకుంటామని బీఆర్ఎస్ పార్టీ ధీమాతో ఉంది. పార్లమెంట్ పరిధిలో ఆరు అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు విజయం సాధించారని చెబుతుంది. మెదక్ లోక్ సభ నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కేసీఆర్ బరిలోకి దిగకుంటే టికెట్ కోసం నేతలు ప్రయత్నిస్తున్నారు. వంటేరు ప్రతాప్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, శివకుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. సమీక్షలో మాజీమంత్రి హరీశ్ రావు, పార్టీ జనరల్ సెక్రటరీ కే కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 19 , 2024 | 10:52 AM