Harish Rao: కేంద్రం ఆయిల్‌పామ్ సాగుకు సహకరించాలి
ABN, Publish Date - Jan 26 , 2024 | 04:21 PM
ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్‌పై సెస్ విధిస్తే ఇక్కడి రైతుల ఆయిల్ పామ్‌కు ధర పెరిగి లాభం చేకూరు తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) తెలిపారు.
సిద్దిపేట జిల్లా: ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్‌పై సెస్ విధిస్తే ఇక్కడి రైతుల ఆయిల్ పామ్‌కు ధర పెరిగి లాభం చేకూరుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) తెలిపారు. శుక్రవారం నాడు నంగునూరు మండలం నర్మెట గ్రామంలో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ పనులను హరీష్ రావు, ఆయిల్ ఫెడ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ... అత్యాధునిక టెక్నాలజీ, అన్ని వసతులతో కూడిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని నర్మెటలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో నూనె ఉత్పత్తి చేయడమే కాదు.. రిపైనరీని పెట్టి ఫైనల్ ప్రొడక్ట్‌ను ఇక్కడ నుంచే నేరుగా మార్కెట్‌లోకి పంపించడం జరుగుతుందని హరీష్‌రావు తెలిపారు.
ఇందుకు కావాల్సిన 4 మెగా వాట్ల సెల్ఫ్ జనరేషన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. గత మూడేళ్ల క్రితం ఆయిల్ పామ్ పంటను సాగు చేసిన రైతుల నుంచి ఈ జూన్ వరకు పంట దిగుబడి రానున్నట్లు తెలిపారు. రైతులు పండించిన ఆయిల్ పామ్‌కు సంబంధించిన రవాణా ఖర్చును ఫ్యాక్టరీనే చెల్లిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆయిల్‌పామ్ సాగుకు సహకరించాలని కోరారు. మెట్రిక్ టన్నుకు కనీసం 15 వేల రూపాయలను కేంద్రం ఇచ్చేలా.. ఒత్తిడి తెస్తున్నామని.. ఆ పైన కూడా మద్దతు ధర ఇస్తే రైతులు నష్టపోకుండా ఉంటారని తెలిపారు. ఆయిల్ పామ్‌లో అంతర్ పంటగా నాటు కోళ్లు, ఇతర పంటలను వేసుకొని అధిక ఆదాయం పొందాలని హరీష్‌రావు సూచించారు.
Updated Date - Jan 26 , 2024 | 04:31 PM