Nagarjuna Sagar: 10 గంటలకు తెరుచుకోనున్న నాగార్జున సాగర్ గేట్లు
ABN, Publish Date - Aug 05 , 2024 | 07:22 AM
ఉరకలెత్తుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ నాగార్జునసాగర్ జలాశయానికి వడివడిగా చేరుతోంది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2 గంటలకు నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకోనున్నాయి
నల్గొండ: ఉరకలెత్తుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ నాగార్జునసాగర్ జలాశయానికి వడివడిగా చేరుతోంది. కేఆర్ఎంబీ సూచనల మేరకు ఉదయం 10 గంటలకు నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు తెరుచుకోనున్నాయి. కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సాగర్ గేట్లను లిఫ్ట్ చేయనున్నారు. ఇందుకోసం జల వనరుల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. సాగర్ ఇన్ ఫ్లో : 2, 79,000 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 30, 000 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం : 580 అడుగులకు చేరుకుంది. సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం : 312.50 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం : 280 టీఎంసీలకు చేరుకుంది.
మధ్యాహ్నం 2 గంటలకు ప్రాజెక్టు 6 క్రస్ట్ గేట్లను ఎత్తి సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు నల్లగొండ జిల్లా (తెలంగాణ)కు చెందిన సీఈ నాగేశ్వరరావు తెలిపారు. 2 లక్షల క్యూసెక్కులను విడుదల చేసి అనంతరం ఇన్ ఫ్లోను బట్టి పెంచే అవకాశం ఉంది. కృష్ణా లోతట్టు పరివాహక ప్రాంతాల ప్రజలను జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు. వరద పెరిగితే ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీసు అధికారులను కలెక్టర్ అరుణ్‌బాబు, ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. సాగర్ జలాశయానికి 4,27,711 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది.
మరోవైపు ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు వద్ద మూడు రోజులుగా గోదావరి నీటిమట్టం స్పల్పంగా తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప నదులు, కొండవాగుల జలాలతో నీటిమట్టం పెరిగింది. భద్రాచలం వద్ద 36.70 అడుగులకు చేరుకుంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి 6,98,968 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేశారు. స్పిల్‌వే ఎగువన 31.180 మీటర్లు, దిగువన 22.37 మీటర్ల నీటిమట్టం నమోదైనట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
Updated Date - Aug 05 , 2024 | 09:52 AM