ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వ్యవసాయ రంగం తడబాటు

ABN, Publish Date - Dec 28 , 2024 | 12:27 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యవసాయరంగం ఈ ఏడాది పలు ఆటుపోట్లను ఎదుర్కొంది. ఈ ఏడాది ఖరీ్‌ఫ లో ఆలస్యంగా వర్షాలు కురవడం, నాగార్జునసాగర్‌ సైతం ఆలస్యంగా వరద రావడంతో ఆయకట్టులో వరిసాగు ఆలస్యమైంది.

గత ఏడాది కంటే మెరుగైన పంటల సాగు

పెరిగిన ధాన్యం దిగుబడి

తగ్గిన పత్తి దిగుబడులు

కొలిక్కిరాని రైతుభరోసా పథకం, రైతుల ఎదురుచూపు

(ఆంధ్రజ్యోతి, నల్లగొండ): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యవసాయరంగం ఈ ఏడాది పలు ఆటుపోట్లను ఎదుర్కొంది. ఈ ఏడాది ఖరీ్‌ఫ లో ఆలస్యంగా వర్షాలు కురవడం, నాగార్జునసాగర్‌ సైతం ఆలస్యంగా వరద రావడంతో ఆయకట్టులో వరిసాగు ఆలస్యమైంది. ఖరీఫ్‌ ధాన్యం దిగుమతి పెరిగినా కొనుగోళ్ల సమయంలో సన్నాల రైతులు తొలుత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక పత్తి దిగుబడి తగ్గింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రూ.2లక్షల లోపు రుణాలు మాఫీ కావడం రైతులను కొంత ఊరటకు గురిచేసినా రైతు భరోసా పథకంపై ఎలాంటి ప్రణాళికలు రూపొందించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

గత ఏడాది వానాకాలంలో పత్తిపంట రైతులను దెబ్బతీయగా, ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో సుమారు 9.27లక్ష ఎకరాల్లో పత్తి సాగైంది. అయితే ఎకరానికి 12క్వింటాళ్లకు బదులు కేవలం 6నుంచి 8క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి వచ్చింది.ఒక్క నల్లగొండ జిల్లాలోనే 149191.39 మెట్రిక్‌ టన్నులను సీసీఐ కొనుగో లు చేసింది. సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో పత్తి, వరి అధికంగా సాగైంది. ఉమ్మడి జిల్లాలో 85లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేయగా, సు మారు 70లక్షల మెట్రిక్‌ టన్నులు దిగుబడి వచ్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ సాగుపై దృష్టి పెట్టింది. నల్లగొండ జిల్లాలో ఇప్పటికే 10వేల ఎకరాలల్లో ఆయిల్‌పామ్‌ సాగు కాగా, సూర్యాపేట జిల్లాలో సుమారు 6వేల ఎకరాల్లో సాగైంది. రానున్న రోజుల్లో మరింతగా పంటలను విస్తరించి ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 65వ జాతీయ రహదారిపై నల్లగొండ, సూర్యాపేట జిల్లాల మధ్య 200 ఎకరాల్లో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటుచేయాలని చూస్తోంది. ప్రభుత్వం సన్న ధాన్యానికి క్వింటాకు రూ.500 బోన్‌సను అమలులోకి తెచ్చింది.

‘రైతు భరోసా’పై నిర్ణయం తీసుకోని ప్రభుత్వం

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబందు పథకాన్ని అమలుచేయగా, ఉమ్మడి జిల్లాలో సుమారు 12.40లక్షల మందికి పెట్టుబడి సాయం అందింది. ప్రతీ సీజన్‌లో రూ.1600కోట్లకు పైగా అప్పటి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. గత ఏడాది ఎన్నికల కోడ్‌తో ఈ ప్రక్రియ నిలిచిపోగా, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గత ఏడాది డిసెంబరు 12 నుంచి జమచేయాలన్న ఆదేశాలతో అనేక ఆటంకాల నడు మ ఆ ఏడాది యాసంగికి సంబంధించిన పెట్టుబడి సాయం అరకొరగా అందింది. ఖజనాలో నగదు కొరత కారణంగా ఈ పథకం ముందుకు సాగలేదు. పార్లమెంటు ఎన్నికల ముందు రైతులనుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఏకకాలం లో రైతుబంధును విడుదల చేసింది. రైతు భరోసాపై మాత్రం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత ప్రభుత్వం ఎకరాకు రూ.5వేలు రైతుబంధు ఇస్తే కాంగ్రెస్‌ ఎకరాకు రూ.7500 చెల్లిస్తామని ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా దీనిపై స్పష్టత లేదు. సంక్రాంతి పండుగ, లేదంటే ఆ తరువాత రైతు భరోసా ఇస్తామని, ప్రభుత్వం చెబుతున్నా, ఎన్ని ఎకరాలకు చెల్లిస్తుందనే దానిపై మార్గదర్శకాలు విడుదల చేయలేదు.

ఎస్‌ఎల్‌బీసీ, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుల్లో కదలిక

నల్లగొండ జిల్లాలో శ్రీశైలం సొరంగమార్గంతో పాటు బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టుల్లో కదలిక మొదలైంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు టయల్‌రన్‌ ప్రారంభించడంతో పాటు కాల్వ పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే లక్ష ఎకరాలకు సాగునీరు అందనుంది. మరో 10 శాతం పనులు మాత్రమే బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టులో మిగిలాయి. ఈ ప్రాజెక్టు కింద నకిరేకల్‌ నియోజకవర్గంలో 60వేల ఎకరాలకు, నల్లగొండ నియోజకవర్గంలో 25వేల ఎకరాలకు, మునుగోడు మండలానికి 10వేల ఎకరాలు, 5వేల ఎకరాల వరకు తుంగుతుర్తి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలకు సాగునీరు అందనుంది. ఇక ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.4500కోట్ల ను వెచ్చించాలని నిర్ణయించింది. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అమెరికా పర్యటన సందర్భంగా టన్నెల్‌ బోర్‌ మిషన్‌ బేరింగ్‌ను పరిశీలించడంతో పాటు దానిని తెప్పించడానికి కృషి చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి నుంచి సొరంగ మార్గం పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

యాసంగిపై బోలెడు ఆశలు

యాసంగి సీజన్‌పై రైతులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. మెట్ట ప్రాంతాల్లో భూగర్భ జలాలు అతంత మాత్రంగా ఉండటం, విద్యుత్‌ అనధికార కోతలతో ఇబ్బందులు తప్పేలా లేవు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 23,74,280 ఎకరాలకు పైగా సాగుభూమి ఉంది. నల్లగొండ జిల్లాలో 11.50లక్షల ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 6,24,280 ఎకరాలు, యాదాద్రి జిల్లాలో 6లక్షల ఎకరాలు ఉంది. యాసంగిలో కేవలం వరి పంట సాగుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. నల్లగొండ జిల్లాలో సాగర్‌ ఆయకట్టుకు ఈ సీజన్‌లో కూడా నీటి విడుదల జరగనుండటంతో రైతులకు ప్రయోజనం చేకూరనుంది. మెట్ట ప్రాంతాల్లో బోరు బావుల కింద రైతులు వరి సాగు చేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో 2.31లక్షల ఎకరాలు బోరుబావుల కింద సాగవుతుండగా, 1.23 లక్షల్లో వర్షాధారంగానే పంటలు సాగవుతున్నాయి. భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్‌, భువనగిరి ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో మూసీ నీటి ఆధారంగా రైతులు వరి సేద్యం చేస్తున్నారు. ఏఎమార్పీ కింద కూడా ఈసారి నీటి విడుదల చేయనున్నారు. హైలెవల్‌ కెనాల్‌తో పాటు లోలెవల్‌ కెనాల్‌కు 120 రోజుల పాటు నీటిని విడుదల చేయడానికి నీటిపారుదలశాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 13 వరకు సాగు నీటిని విడుదల చేయనున్నారు. యాసంగి పంటలు పూర్తయ్యేవరకు 800క్యూసెక్కుల చొప్పున విడతల వారీగా నీటిని విడుదల చేయనున్నారు. హైలెవల్‌ కింద 2.20లక్షల ఎకరాలకు, లోలెవల్‌ కింద 80లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. అదేవిధంగా 55 డిస్ట్రిబ్యూటరీలకు నీటిని విడుదల చేయనున్నారు. అయితే డివిజన్‌ల వారీగా వారబంధీ విధానంలో 800క్యూసెక్కుల చొప్పున అధికారులు సాగునీటిని విడుదల చేయనున్నారు.

రూ.2లక్షలు, ఆపైన రుణమాఫీపై ఇంకా గందరగోళం

రైతుల రుణాలు రూ.2లక్షలతో పాటు ఆపై ఉన్నవి రుణాల మాఫీ ఇంకా కొలిక్కి రాలేదు. గత ప్రభుత్వం రూ.లక్ష వరకు రుణ మాఫీ ప్రకటించినా, అది అందరికీ వర్తించలేదు. మూడు జిల్లాల్లో సుమారు 4లక్షల మంది రైతులకు రుణమాఫీకి అర్హులు ఉన్నారు. రూ.2లక్షల లోపు రుణమాఫీ జరగ్గా, ఇంకా రూ.2లక్షల నుంచి ఆపైనా రుణాల పరిస్థితి గందరగోళంగా మారింది. ఇటీవల ఉమ్మడి జిల్లాకు రూ.2లక్షలకు సంబంధించి సుమారు రూ.500కోట్లకు పైగా ప్రకటించినా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇంకా జమ కాలేదు. ఎవరైనా రైతు దురదృష్టవశాత్తు మృతిచెందితే వారి కుటుంబాలు వీధిన పడకుండా ఉండేందుకు గత ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని అమలు చేయగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు మాసంలో రైతుబీమా ప్రీమియంను రెన్యువల్‌ చేసింది.

ఉమ్మడి జిల్లాలో పదకొండు ఏళ్లల్లో 450మందికి పైగా రైతుల ఆత్మహత్యలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ పదకొండు ఏళ్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు జరిగాయని గణాంకాలు చెప్పుతున్నాయి. ఆత్మహత్య చేసుకున్న వారిలో చిన్న సన్నకారు రైతులతో పాటు కౌలు రైతులు అఽధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ పదకొండు ఏళ్లల్లో 450మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు రైతు సంఘాలు వివిధ రైతు వేదికలు పేర్కొంటున్నాయి. రైతుల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వాలు మాత్రం ధ్రువీకరించే పరిస్థితి లేదు. త్రిమెన్‌ కమిటీలో తహశీల్దార్‌, ఎస్‌ఐ, మండల వ్యవసాయాధికారి నివేదికల ఆధారంగానే కేసులు నమోదు అవుతాయి. అయితే త్రిమెన్‌ కమిటీ మాత్రం రైతుల ఆత్మహత్యల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. వరితోపాటు పత్తి పంటలు సాగు చేయడానికి ఎకరాకు ఒక్కో రైతుకు రూ.25వేల వరకు ఖర్చు వస్తుంది. దుక్కుల దున్నకం, కూళ్లు, విత్తనాలు, ఎరువుల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం ఎకరానికి రూ.5వేలు చెల్లించగా కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు ధపాలుగా రూ.2వేల చొప్పున ఆరువేల వరకు ఇస్తుంది. గత ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించక పోగా ప్రస్తుతం ప్రభుత్వం కౌలు రైతులకు కూడా ఆర్ధిక సహాయం ఇస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగానే భూమిలేని వారికి ఏటా రూ.12వేలు చెల్లిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఈనెలా 28న తొలివిడతగా రూ.6వేలు ఇస్తామని చెప్పినప్పటికినీ ఇప్పటి వరకు విధివిధానాలు వెల్లడి కాలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 3లక్షలమంది వరకు కౌలు రైతులు ఉన్నట్లు సమాచారం. ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటకాలతో నష్ట వాటిల్లడంతో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. పంటల భీమా లేకపోవడం, ఏదైనా నష్టం జరిగినప్పుడు కౌలు రైతులతో పాటు రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కౌలు రైతుల రక్షణకు 2011 భూ ఆధికృత సాగుదారుల చట్టం ఉన్నప్పటికిని ఇప్పటికి అది అమలుకు నోచుకోవడం లేదు.

Updated Date - Dec 28 , 2024 | 12:28 AM