వైటీపీఎ్‌సలో ఉద్యోగాలేవీ?
ABN, Publish Date - Dec 23 , 2024 | 01:02 AM
యాదాద్రి థర్మల్‌పవర్ ప్లాంట్ నిర్మాణంలో ఇళ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇచ్చే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైనా నిర్వాసితుల ఎదురుచూపు
573 మందికి ఇప్పటికే ఉద్యోగ హామీపత్రాలు
ఇళ్లు కోల్పోయిన 133 గిరిజనకుటుంబాల్లో అర్హుల వివరాల సేకరణ పూర్తి
అయినా అందని నియామక పత్రాలు
నత్తనడకన సాగుతున్న ప్రక్రియ
(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): యాదాద్రి థర్మల్‌పవర్ ప్లాంట్ నిర్మాణంలో ఇళ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇచ్చే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ప్లాంటు ప్రారంభానికి ముందే ఉద్యోగాలిస్తారని ఆశించినా, అధికారికంగా ప్రారంభించిన తర్వాత కూడా ఉద్యోగకల్పన ప్రక్రియ పూర్తిచేయకపోవడంపై నిర్వాసిత కుటుంబాల్లో అసంతృప్తి నెలకొంది.
యాదాద్రి థర్మల్ ప్లాంట్ శంకుస్థాపన సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ నిర్వాసితులు, భూములు కోల్పోయినవారికి ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలిసారి పవర్‌ప్లాంటును సందర్శించిన డిప్యూటీ సీఎం మల్లుభట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం నిర్వాసితుల త్యాగాన్ని గుర్తించి ఉద్యోగాలిస్తామని, భూములు కోల్పోయినవారికి ఉద్యోగాలివ్వడం కనీస బాధ్యత అని పేర్కొనడమేగాక ఆ ప్రక్రియను చేపట్టాలని జెన్‌కో, రెవెన్యూ అధికారులను పురమాయించారు. నిర్వాసితులకు ఉద్యోగాలిచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నా, అర్హులను తేల్చే ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండడం విమర్శలకు తావిస్తోంది.
అటవీభూములను సాగుచేసిన వారిపై తేలని నిర్ణయం
పవర్‌ప్లాంటులో సేకరించిన భూముల్లో అటవీభూముల్లో పట్టాలు పొందిన (ఆర్‌వోఎ్‌ఫఆర్) గిరిజనులకు పరిహారమైతే ఇచ్చారు కానీ, వారికి ఉద్యోగాలిచ్చే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ భూములు కోల్పోయిన రైతులు మరో 200 మంది వరకు ఉన్నారు. భూములు కోల్పోయిన కుటుంబీకులు వారికి సైతం తమ కుటుంబాల్లో అర్హులకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి ఉద్యోగాలిచ్చే విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో వీరు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
కొందరిని అర్హులుగా తేల్చినా, ఉద్యోగాల ప్రకటనలో జాప్యమే
ఉపముఖ్యమంత్రి, మంత్రుల ఆదేశాల మేరకు తొలిదశలో ప్లాంటులో ఇళ్లు కోల్పోయి నిర్వాసితులైన వారి కుటుంబాల్లో అర్హులను గుర్తించారు. అందుకోసం అక్టోబరు, నవంబరు నెలల్లో రెవెన్యూ అధికారులు మోదుగులకుంటతండా, కపూర్‌తండాలకు చెందిన జాబ్‌కార్డులు పొందిన 133 కుటుంబాల్లో ఉద్యోగానికి ప్రతిపాదిస్తున్న వారి విద్యార్హతల పత్రాలు, నివాస పత్రాలు, కులధ్రువీకరణ పత్రాలు, ఇతర సర్టిఫికెట్లను పరిశీలించి నమోదు చేసుకున్నారు. ఈ సర్వే వివరాలను జెన్‌కోకు సైతం అందజేశారు. డిప్యూటీ సీఎం మల్లుభట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించిన ప్రకారం మొదటి విడతలో ఈ 133 మందికి ఉద్యోగ నియామకాలు ఇవ్వాల్సి ఉంది. వీరికి ఎలాంటి విద్యార్హతలున్నా, అవసరమైనవారికి నైపుణ్యశిక్షణ కూడా అందజేయాలని ప్లాంటు పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం జెన్‌కోను ఆదేశించారు. ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉన్నా, తొలిదశలో ప్రకటించినవారికైనా ఉద్యోగాల నియామకాలు చేపట్టకపోవడంపై అర్హులైనవారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
573 మందికి ఉద్యోగహామీ కార్డులిచ్చిన ప్రభుత్వం
యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్‌లో ఇళ్లు, భూములు కోల్పోయిన వారిలో 573 మందికి ఉద్యోగాలిస్తామనే హామీతో ఉద్యోగహామీ కార్డులను (జాబ్‌కార్డులు) ప్రభుత్వం ఇప్పటికే జారీచేసింది. ఇళ్లు, భూములు రెండూ కోల్పోయిన వీర్లపాలెం శివారు గిరిజనతండాలైన మోదుగులకుంట, కపూర్‌తండాలలోని 173 కుటుంబాలకు, అదేవిధంగా భూములు కోల్పోయిన మరో 440 కుటుంబాలకు ఉద్యోగాలిస్తామని ప్రకటించింది. అయితే ఉద్యోగాలు వదులుకుంటే ఆ కుటుంబానికి రూ.5లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించడంతో మోదుగులకుంటతండా, కపూర్‌తండాలకు చెందిన 40 కుటుంబాల వారు పరిహారం తీసుకొని ఉద్యోగాలు వదులుకున్నారు. దీంతో ఈ తండాలకు చెందిన 133మందికి, భూములు కోల్పోయిన వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెం (కొత్తపల్లి), తిమ్మాపురం గ్రామాలకు చెందిన మరో 440 కుటుంబాలకు కలిపి మొత్తం 573మందికి జాబ్‌కార్డులను గతంలోనే అందజేశారు. వీరికి అప్పటి ప్రభుత్వం తాజా కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ప్లాంటు ప్రారంభానికి ముందే ఉద్యోగాలిస్తామని ప్రకటించినా ఇంకా ఇది అమలుకాలేదు.
నెమ్మదిగా సాగుతున్న వివరాల సేకరణ
భూములు కోల్పోయిన వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెం, తిమ్మాపురం గ్రామాలకు చెందిన, జాబ్‌కార్డులు పొందిన మరో 440 కుటుంబాల్లో ఉద్యోగాలకు ప్రతిపాదిస్తున్న వారి వివరాలు, విద్యార్హతలు, ధ్రువీకరణ పత్రాల పరిశీలన, నమోదు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఈ ప్రక్రియ ఎంత వేగంగా ముగిస్తే, అంత త్వరగా ఉద్యోగాల నియామకాలు నిర్వాసిత కుటుంబాలు పొందనున్నాయి. అయితే సర్వే బాధ్యతలు రెవెన్యూశాఖ నిర్వహించాల్సి ఉండడం, ఆ శాఖకు సంబంధించి క్షేత్రస్థాయిలో వీఆర్‌వోలు లేకపోవడం, తహసీల్దారే స్వయంగా ఈ సర్వే నిర్వహించాల్సి రావడంతో ప్రక్రియలో జాప్యమవుతోందని చెబుతున్నారు. ప్రధానంగా ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల సర్వేలు, ధాన్యం కొనుగోళ్లు, ఓటర్ల నమోదు వంటి పనుల ఒత్తిడి ఉండడంతో ఈ సర్వేలో జాప్యం జరుగుతుందని చెబబుతున్నారు. సర్వేను వేగవంతంగా పూర్తిచేసి జెన్‌కోకు నివేదిక చేరాక, మళ్లీ విద్యుత్‌శాఖలో ఉన్నతస్థాయిలో ఆమోదం పొందాకే ఉద్యోగాల నియామక ప్రకటన వస్తుంది. విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగాలను నిర్ణయిస్తారని, అవసరమైన వారికి ప్రత్యేక శిక్షణ లేక నైపుణ్యశిక్షణను కూడా అందించిన తర్వాతే ఉద్యోగ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఈ ఉద్యోగాలను నేరుగా రెగ్యులర్ నియామకంగా చేపడతారా? లేక ఒకటి, రెండేళ్ల పాటు ప్రొబేషనరీలో ఉంచుతారా? అనే విషయమూ తేలాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న వివరాల సేకరణ ఎంత వేగంగా పూర్తయితే, మిగిలిన ప్రక్రియ అంత త్వరగా చేపడతారని, ఆ దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని నిర్వాసితులు కోరుతున్నారు.
అర్హులకు త్వరితగతిన ఉద్యోగాలివ్వాలి : హేమానాయక్, కపూర్‌తండా, భూనిర్వాసితుడు
యాదాద్రి పవర్ ప్లాంట్‌లో ఇళ్లు, భూములు కోల్పోయాం. మా కుటుంబాల్లో అర్హులైనవారికి ఉద్యోగాలిస్తామని జాబ్‌కార్డులు జారీ చేశారు. పవర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు కానీ ఉద్యోగాలు ఇంకా ఇవ్వలేదు. పవర్‌ప్లాంట్‌లో కాంట్రాక్టర్ల కింద పనిచేస్తున్నవారికి కూడా సకాలంలో వేతనాలివ్వడం లేదు. ప్రభుత్వం వేగంగా స్పందించి ఉద్యోగాలు ఇవ్వాలి.
ఈనెల 24లోగా వివరాల సేకరణ: జవహర్‌లాల్, తహసీల్దార్, దామరచర్ల
ఈనెల 24లోగా నిర్వాసితుల వివరాల సేకరణ, కుటుంబాల వివరాల నమోదు పూర్తిచేయాలని సబ్‌కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాం. ఇప్పటికే మెజార్టీ నిర్వాసితుల వివరాలు సేకరించాం. సర్వే నిర్వహించిన వారిలో 190 కుటుంబాలకు చెందినవారు, వారి కుటుంబంలో ఎవరికి ఉద్యోగమివ్వాలనే విషయాన్ని తేల్చుకోలేకపోతున్నారు. వారికి కొంత గడువు ఇవ్వాల్సి వస్తోంది. ఈ నెల 24లోగా పూర్తయిన సర్వే మేరకు నివేదికను సబ్‌కలెక్టర్‌కు సమర్పిస్తాం. ఆ తర్వాత ఉన్నతాధికారుల ద్వారా అది జెన్‌కోకు చేరుతుంది. అదేవిధంగా మిగిలిన వారి వివరాలు కూడా త్వరలోనే పూర్తిగా సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తాం. ప్రభుత్వం హామీ ఇచ్చినమేరకు ప్రతి నిర్వాసితుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తిచేస్తాం.
Updated Date - Dec 23 , 2024 | 01:02 AM