పందిళ్ల సాగుకు ప్రోత్సాహం
ABN, Publish Date - Dec 21 , 2024 | 12:05 AM
కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా సాగునీటి సౌకర్యం ఉన్న రైతులు పందిళ్ల సాగు చేసేందుకు ఆర్థికంగా చేయూ త అందించాలని నిర్ణయించింది. పందిళ్ల సాగు కింద బీర, కాకర, సొర, దొండకాయ, చిక్కుడు, బీన్స్, తదితర కూరగాయలు సాగుచేయవచ్చు.
అర ఎకరాకు రూ.50వేలు ఆర్థిక సాయం
ఒక్కో రైతుకు రెండున్నర ఎకరాల వరకు అవకాశం
యాదాద్రి జిల్లాకు 35యూనిట్లకు రూ.17.50లక్షలు మంజూరు
నల్లగొండ జిల్లాకు 90 యూనిట్లు మంజూరు
ఉద్యాన పంటల సాగుపై ప్రభుత్వం దృష్టి
రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా సాగునీటి సౌకర్యం ఉన్న రైతులు పందిళ్ల సాగు చేసేందుకు ఆర్థికంగా చేయూ త అందించాలని నిర్ణయించింది. పందిళ్ల సాగు కింద బీర, కాకర, సొర, దొండకాయ, చిక్కుడు, బీన్స్, తదితర కూరగాయలు సాగుచేయవచ్చు. వీటికి టమాట, ఉల్లిగడ్డలా ధరల్లో హెచ్చు తగ్గులు ఉండవు. ఎప్పుడూ నికరంగా ధర ఉంటుంది. దీంతో ఓ వైపు రైతులకు లాభంతోపాటు కూరగాయల కొరత ఏర్పడకుండా చూడాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.
రాష్ట్రంలో కూరగాయల కొరత లేకుండా ఈ పంటల సాగు పెంచేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తు తం మార్కెట్‌లో కూరగాయల ధరలు రోజురోజుకూ రెట్టింపు అవుతున్నాయి. దీంతో ప్రజలకు ఆర్థిక భారం పడుతున్నా రైతులకు మాత్రం ప్రయోజనం ఉండటం లేదు. కేవలం వ్యాపారులు మాత్రమే లాభాలు గడిస్తున్నా రు. ధరల పెరుగుదలకు స్థానికంగా ఈ పంటలను సాగుచేయకుండా, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడమే ప్రధాన కారణమని ప్రభుత్వం గుర్తించిం ది. వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయాలు, పండ్లు, పూ ల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించిం ది. యాదాద్రి జిల్లా హైదరాబాద్‌కు చేరువలో ఉన్నా ఇక్కడ ప్రధానంగా వరి, పత్తి, కంది, తదితర పంటలపైనే రైతులు దృష్టి సారిస్తున్నారు. ఈ ప్రాంత రైతుల దృష్టిని ఉద్యాన పంటల వైపు మళ్లించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అందులో భాగంగా రైతులు పందిళ్లతో కూరగాయల సాగు చేపట్టేలా అర ఎకరానికి రూ.50 వేల వరకు ఆర్థికంగా సాయం అందించనుంది. ఈ నిధులత పందిళ్లకు రాతి స్తంభాలు(కడీలు), ఇనుప వైర్లు ఏ ర్పాటు చేసుకోవచ్చు. యాదాద్రి జిల్లాకు మొత్తం 35యూనిట్లకు ప్రభుత్వం రూ.17.50 లక్షలు మంజూరు చేసింది. నల్లగొండ జిల్లాకు 90యూనిట్లు మంజూరుచేసింది.ఒక్కో రైతు 5యూ నిట్ల వరకు అంటే రెండున్నర ఎకరాల వరకు పందిళ్ల సాగు చేయవచ్చు. వీటి సాగుకు ముందుకొచ్చే రైతు లు దరఖాస్తు చేసుకున్న వెంటనే వారి పంట భూమిని అధికారులు పరిశీలించి అనుమతి ఇచ్చాక ఉద్యానశాఖకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. మరోవైపు ఆయిల్‌పాం సాగును కూడా ఈ ఏడాది 2వేల ఎకరాల వరకు సాగును పెంచేలా అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. యాదాద్రి జిల్లాలో ఇప్పటివరకు 3,500 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగవుతోంది. వచ్చే ఏడాది నుంచి ఆయిల్‌పాం గెలల దిగుమతి రానుంది.
250 గ్రామాలు కూరగాయల సాగుకు దూరం
వానాకాలంతో పాటు యాసంగిలో జిల్లాలో మొ త్తం 3.50లక్షల ఎకరాల్లో పలు రకాల పంటలు సాగవుతున్నాయి. జిల్లాలో 426 గ్రామపంచాయతీల్లో సుమారు 250 పంచాయతీల్లో అసలు కూరగాయల సాగే లేదు. జిల్లా నేలలు పలు రకాల కూరగాయలు సాగుకు అనుకూలమైనా రైతులు ఆసక్తి చూపడంలేదు. జిల్లా జనాభాకు ఏటా సుమారు 80వేల మెట్రిక్ టన్నుల కూరగాయ లు అవసరం. కాగా, జిల్లాలో కేవ లం 30వేల మెట్రిక్ టన్నులు కూరగాయలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. ఏటా జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి 50వేల మెట్రిక్ టన్నులకు పైగా కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. పలు ప్రాంతాల్లో రైతులు వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు సాగు చేస్తూ లాభాలు గడిస్తుండగా, ఈ ప్రాంతవాసులు సంప్రదాయ పంటలకే పరిమితమై నష్టలపాలవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు ‘మన ఊరికి సరిపోయే కూరగాయలు మనమే పండించుకుందాం’ నినాదంతో జిల్లా రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించేలా ఉద్యానశాఖ చర్యలు తీసుకుంటోంది. జిల్లా జనాభాకు అనుగుణంగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలసాగును విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రతీ గ్రామంలో కనీసం ఐదెకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయాలన్నది లక్ష్యం. జిల్లాలోని నేలలు, నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకొని, ఏ మండలంలో ఏయే పంటలు సాగు చేయాలనే అంశంపై ఉద్యానశాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. జిల్లాలో వానాకాలం, యాసంగితో కలిపి ప్రస్తుతం సుమారు 3వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. గ్రామానికి ఐదు ఎకరాల చొప్పున ఈ సీజన్‌లో మరో 2,100 ఎకరాల్లో కూరగాయలు సాగు చేయాలన్నది లక్ష్యం. జిల్లాలో నేలలు టమాటా, వంకాయ, బెండకాయ, దొండకాయ, సొర, చిక్కుడు, గోరుచిక్కుడు, దోసకాయ, మిర్చి, క్యాబేజీ, పొట్లకాయతో పాటు పాలకూర, మెంతి, కొత్తిమీర, పూదీనా, తోటకూర, తదితర పంటల సాగుకు అనుకూలం. గ్రామంలోకి ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి కాకుండా రైతులు వారి పొలాల్లోనే సాగుచేసేలా అవగాహన కల్పిస్తున్నారు. ఏ మండలంలో దిగుబడి అయ్యే కూరగాయలు, ఆ ప్రాంతాల్లోనే విక్రయించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.
శివారులోనే కూరగాయల సాగు
జిల్లా హైదరాబాద్ నగరానికి చేరువలో ఉండటంతో కూరగాయలు పండించిన రైతులకు మార్కెటింగ్ అవకాశం కూడా సులువుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యానపంటల సాగు విస్తీర్ణాన్ని రెట్టింపు చేసేందుకు ఆ శాఖ చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం జిల్లాలో దిగుబడి అవుతున్న 50శాతం మేరకు కూరగాయలు నగరశివారు మండలాల్లోని బొమ్మలరామారం, తుర్కపల్లి, బీబీనగర్ మండలాల్లో సాగవుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో పండించిన కూరగాయలను కొంతమంది రైతులు నగరానికి తరలిస్తుండగా, మరికొంతమంది భువనగిరితోపాటు గ్రామాల్లో విక్రయించేందుకు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. భువనగిరితోపాటు పలు ప్రాంతాలకు నగరంలోని బోయిన్‌పల్లి, ఒంటిమామిడి మార్కెట్ల నుంచి కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. దీంతో ధరలు కూడా నగరంతో సమానంగా ఉంటున్నాయి. స్థానికంగా కూరగాయలు సాగుచేసిన పక్షంలో ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. జిల్లాలోని అన్ని మండలాల్లో కూరగాయల సాగును విస్తరించాలన్నది లక్ష్యం. ప్రస్తుతం జిల్లాలో 16వేల ఎకరాల్లో మామిడి, జామ, అల్లనేరేడు, నిమ్మ, దానిమ్మ, తదితర తోటలు సాగవుతున్నాయి. వీటిని మరో 20వేల ఎకరాలకు వరకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం 2000 ఎకరాల్లో కూరగాయలు సాగవుతున్నాయి. అందులో సుమారు 1,000 ఎకరాలకు ఉద్యానశాఖ ప్రోత్సాహం అందిస్తుండగా, మరో 1,000 ఎకరాల్లో కూరగాయలను రైతులే స్వయంగా సాగుచేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా పీఏపల్లి మండలంలో దొండను రైతులు సాగుచేస్తున్నారు.
పందిళ్ల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రణాళిక : సుభాషిణి, జిల్లా ఉద్యానశాఖ అధికారి
రైతులు కూరగాయలు సాగు చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ, చాలా గ్రామాల్లో సంప్రదాయ పంటలకే పరిమితమవుతున్నారు. జిల్లాలో పందిళ్ల సాగుపై ఆసక్తి ఉన్న రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. పందిళ్ల సాగు కోసం 35 యూనిట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. రైతులు పొలాల్లో అర ఎకరం వరకు సాగు చేస్తే రూ.50వేలు ఆర్థిక సాయం అందుతుంది. ఆయా మండలాల ప్రజల జనాభాకు అనుగుణంగా కూరగాయలు సాగుచేసేలా రైతులకు అవగాహన కల్పిస్తు న్నాం. కూరగాయల సాగుతో రైతులు ఆర్థికంగా మెరుగుపడతారు. జిల్లా వ్యాప్తంగా కూరగాయలతోపాటు పలు రకాల పండ్ల సాగును కూడా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగుకు రైతులు ముందుకువస్తున్నారు. వారికి ప్రభుత్వంపరంగా వచ్చే సబ్సిడీలపై అవగాహన కల్పిస్తున్నాం.
Updated Date - Dec 21 , 2024 | 12:05 AM