ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kaleshwaram project: కేసీఆర్‌ ఆదేశాలతోనే బ్యారేజీల నిర్మాణం!

ABN, Publish Date - Oct 25 , 2024 | 04:09 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు నిర్మించాలని అప్పటి సీఎం కేసీఆరే నిర్ణయం తీసుకున్నారని రామగుండం మాజీ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు చెప్పారు.

సీఎం అధ్యక్షతన జరిగిన భేటీలోనే ‘కాళేశ్వరం’పై నిర్ణయం.. స్థలాలను ప్రభుత్వమే ఎంపిక చేసింది

  • సర్కారు ఆదేశాలతో వ్యాప్కోస్‌ నివేదిక

  • ఈ ప్రాజెక్టు కట్టాలన్న నిర్ణయం తప్పే!

  • జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌కు తెలిపిన మాజీ ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు

హైదరాబాద్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు నిర్మించాలని అప్పటి సీఎం కేసీఆరే నిర్ణయం తీసుకున్నారని రామగుండం మాజీ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు చెప్పారు. కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలోనే బ్యారేజీల నిర్మాణ స్థలాలపై నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. వ్యాప్కోస్‌ తయారు చేసిన కాళేశ్వరం డీపీఆర్‌ను ప్రభుత్వం ఆమోదించిందని, ముఖ్యమంత్రే అనుమతి ఇస్తూ సంతకం చేశారని తెలిపారు. నిర్మాణం చేపట్టే క్రమంలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ ప్రదేశాలను మార్చినట్లు చెప్పారు. గురువారం కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో భాగంగా జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ముందు వెంకటేశ్వర్లు హాజరయ్యారు. గతంలో, గురువారం కలిపి కమిషన్‌ మొత్తం ఆయనకు 195 ప్రశ్నలు సంధించింది. ఉదయం 11:20 గంటల నుంచి సాయంత్రం 4:10 గంటల దాకా విచారణ కొనసాగింది. శుక్రవారం కూడా ప్రశ్నించనుంది.


  • కమిషన్‌: డీపీఆర్‌ ఉద్దేశం ఏంటి? బ్యారేజీల నిర్మాణంపై నిర్ణయం ఎవరిది?

వెంకటేశ్వర్లు: ఒక ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సాంకేతిక సమాచారం డీపీఆర్‌లో ఉంటుంది. జియోలాజికల్‌, జియోఫిజికల్‌ పరీక్షలు చేశాం. 2016 జనవరిలో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బ్యారేజీల నిర్మాణంపై నిర్ణయం జరిగింది. వ్యాప్కోస్‌ సమర్పించిన డీపీఆర్‌ ఆధారంగా ప్రాజెక్టులోని వివిధ కాంపోనెంట్ల నిర్మాణ అంచనాలను సిద్ధం చేయాలని కేసీఆర్‌ ఆదేశించారు. సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలోనే నిర్ణయాలన్నీ జరిగాయి. డీపీఆర్‌లోని అన్ని ప్రామాణికాలను సీఎం కేసీఆరే ఆమోదించి, సంతకాలు చేశారు.


  • డీపీఆర్‌ను ఎప్పుడు సమర్పించారు?

కేంద్ర జలవనరుల సంఘం అనుమతి కోసం 2016 మార్చిలో దరఖాస్తు చేశాం. డీపీఆర్‌ దాఖలు చేశాక నిర్మాణాలపై నిర్ణయం జరిగింది. లింక్‌-1లో మూడు బ్యారేజీల (మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల)తో పంప్‌హౌ్‌సల నిర్మాణం జరిగింది. డీపీఆర్‌లో అన్ని కాంపోనెంట్ల వివరాల్లేవు. గైడ్‌బండ్‌, ఫ్లడ్‌ బ్యాంకులు, డైవర్షన్‌ ఛానళ్లను తర్వాత చేర్చాం. . గైడ్‌బండ్‌ ఇతర పనులను స్టేట్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ నిర్ణయానికి అనుగుణంగా మార్చాం. స్థానిక పరిస్థితులు, అటవీ భూమి ముంపు వంటి అంశాల ఆధారంగా అన్నారం బ్యారేజీ ఎత్తును 119 మీటర్లకే కుదించాం.


  • అక్కడే బ్యారేజీలు కట్టాలని చెప్పిందెవరు?

బ్యారేజీలు కట్టాలని వ్యాప్కోస్‌ చెప్పింది. స్థలాలను ప్రభుత్వమే ఎంపిక చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే వ్యాప్కోస్‌ నివేదిక ఉంది.

  • సీఈ/ఈఎన్‌సీగా మీ బాధ్యతలేంటి? మీ కాలంలో ఎస్‌ఈ, ఈఈలెవ రు?

ఇతర రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకోవడం, డీపీఆర్‌ తయారీ కోసం వ్యాప్కో్‌సతో సంప్రదింపులు, ఇన్వెస్టిగేషన్లు చేయించడం, భూసేకరణ కోసం అధికారులతో సమన్వయం చేసుకోవడం, ప్రభుత్వ కార్యదర్శులతో జరిగిన సమావేశాలకు హాజరవడం వంటివి సీఈ/ఈఎన్‌సీ బాధ్యతలు. ఎస్‌ఈ, ఈఈల వివరాలు శుక్రవారం ఇస్తా.


  • బ్యారేజీల నిర్మాణ స్థలాలు మార్చారా? బ్యారేజీలు, ప్రాజెక్టులకు ఒకటే డీపీఆర్‌ ఉందా?

అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఎంపిక స్థలాలను మార్చాం. గ్రావిటీ కెనాల్‌ పొడవు తగ్గించడం, నిల్వ సామర్థ్యం పెంచడం, అటవీ భూమి సేకరణ తగ్గించడం వంటి మూడు అంశాలను ప్రామాణికంగా చేసుకొని స్థలాలు మార్చాం.

  • ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై 6156 కోట్లు వెచ్చించిన తర్వాత రీ ఇంజనీరింగ్‌ నిర్ణయం సరైనదేనా?

కాళేశ్వరం ప్రాజెక్టు కింద 18.83 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించాలని నిర్ణయం తీసుకున్నాం. ఎస్‌ఆర్‌ఎస్పీ రెండో దశ, ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌ (ఎఫ్‌ఎ్‌ఫసీ), సింగూరు, నాగార్జునసాగర్‌ ఆయకట్టు స్థిరీకరణ కూడా ఈ ప్రాజెక్టులో ఉంది. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్లతో బ్యారేజీ కట్టడానికి మహారాష్ట్ర అభ్యంతరం తెలిపింది. 148 మీటర్లకు అంగీకారం తెలిపింది. ఆ ఎత్తుతో బ్యారేజీ కడితే 44 టీఎంసీలు మాత్రమే తరలించడానికి అవకాశం ఉండేది. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పడం వల్లే రీ ఇంజనీరింగ్‌ జరిగింది.


  • రెండు దశల్లో తక్కువ కరెంట్‌తో నీళ్లు వచ్చే ప్రాజెక్టును కాదని, 11 వేల మెగావాట్లకు పైగా సామర్థ్యం కలిగిన పంపులతో కిందినుంచి పైకి నీటిని పంపింగ్‌ చేసే ప్రాజెక్టు కడతారా? ఇది తప్పుడు నిర్ణయమే కదా?

అవును.. తప్పుడు నిర్ణయమే.

  • ఎల్లంపల్లి దాకా చేపట్టిన పనులన్నీ వృథాయే కదా? మాజీ ఇంజనీర్ల కమిటీ సిఫారసులను పక్కనపెట్టారా?

మాజీ ఇంజనీర్ల సిఫారసులతో ఏకీభవించను.

అదనంగా ప్రతిపాదించిన పనులను పర్యావరణ అనుమతి లేకుండా చేపట్టారా?

రికార్డులను పరిశీలించి చెబుతా.


  • కోల్‌ బెడ్‌పై మేడిగడ్డ బ్యారేజీ కట్టారా? ఎవరి ఆదేశాలతో బ్యారేజీల్లో నీటి నిల్వ చేశారు?

వాస్తవం కాదు. (జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ నివేదిక చూడలేదా? అంటూ నివేదికను చూపించిన కమిషన్‌) ప్రభుత్వ పెద్ద (కేసీఆర్‌ పేరు ఎత్తకుండా) ఆదేశాలతోనే నీటిని నిల్వ చేశాం.

  • నిర్మాణంలో సీకెంట్‌ పైల్స్‌ను ఎంచుకున్నారేం?

దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్మాణంలో సీకెంట్‌ పైల్స్‌ను వాడారు.

అన్నారం, మేడిగడ్డ పునాదుల్లో వేర్వేరు పద్ధతులను ఎందుకు పాటించారు?

నిర్మాణ ప్రదేశం ఆధారంగా పద్ధతులను ఎంచుకోవాలన్న సీడీవో సీఈ సిఫారసుల మేరకు నిర్ణయం తీసుకున్నాం.

Updated Date - Oct 25 , 2024 | 07:28 AM