Kasturba Hostel: చలితో కస్తూర్బా విద్యార్థులకు అస్వస్థత
ABN, Publish Date - Dec 12 , 2024 | 02:50 AM
జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా బాలికల వసతి గృహంలో తొమ్మిది మంది విద్యార్థులు బుధవారం అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది.
ఆసుపత్రికి తరలింపు.. నిలకడగా ఆరోగ్యం
జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో కలకలం
సారంగాపూర్, డిసెంబరు, 11 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా బాలికల వసతి గృహంలో తొమ్మిది మంది విద్యార్థులు బుధవారం అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. విద్యార్థులు ఉదయం పూరి, పుప్పుతో కూడిన అల్పాహారం తిన్నారు. ప్రార్థన అనంతరం విద్యార్థులు అస్వస్థతకు లోనవడంతో ఉపాధ్యాయులు గమనించి వెంటనే వారిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం నిమిత్తం ముగ్గురు విద్యార్థినులను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చలి ప్రభావం తట్టుకోలేకనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. జిల్లా వైద్యాధికారి, తహసీల్దార్ విడివిడిగా వసతి గృహానికి వెళ్లి విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలు తెలుసుకున్నారు. వసతి గృహంలో మొత్తం 300 మంది విద్యార్థులున్నారని, అందరికి సరిపడా గీజర్స్ లేక పోవడంతో వేడినీరు అందడం లేదని తెలిపారు.
Updated Date - Dec 12 , 2024 | 02:50 AM