Ponguleti: 4 జిల్లాల్లోనే 2,000 ఎకరాలు మింగేశారు!
ABN, Publish Date - Dec 07 , 2024 | 04:29 AM
ధరణి ముసుగులో గత పాలకులు చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎకరా రూ.వంద కోట్ల విలువ చేసే భూములను బొక్కేశారని.. కొత్త రెవెన్యూ చట్టం ఆమోదం పొందిన తర్వాత వారి ఖాతాలో వేసుకున్న భూముల వివరాలను సర్వే నంబర్ల వారీగా ప్రజల ముందు పెడతామని తెలిపారు. శు
హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్ పరిధిలో భారీగా ప్రభుత్వ భూముల్ని కాజేసిన గత పాలకుల్ఙు
రాయదుర్గంలో రూ.వందల కోట్ల విలువైన 8.29 ఎకరాలు కొట్టేశారు
సిద్దిపేట జిల్లాలో 380 ఎకరాల స్వాహా
ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి
హైదరాబాద్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ధరణి ముసుగులో గత పాలకులు చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎకరా రూ.వంద కోట్ల విలువ చేసే భూములను బొక్కేశారని.. కొత్త రెవెన్యూ చట్టం ఆమోదం పొందిన తర్వాత వారి ఖాతాలో వేసుకున్న భూముల వివరాలను సర్వే నంబర్ల వారీగా ప్రజల ముందు పెడతామని తెలిపారు. శుక్రవారం తన నివాసంలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పొంగులేటి పలు విషయాలను వెల్లడించారు. జీవో 59 ముసుగులో బీఆర్‌ఎస్ పాలకులు రూ.వందల కోట్ల విలువైన భూములను మింగేశారని ఆరోపించారు. ఒక్క రాయదుర్గంలోనే 8.29 ఎకరాలను తమ తొత్తుల పేరుతో మార్చుకున్నారని, అలాగే హైదరాబాద్‌లో మరోచోట (ఇక్కడ ఎకరం రూ.80-100కోట్లు ఉంటుంది) 19 ఎకరాలను స్వాహా చేశారని చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే సుమారు 2 వేల ఎకరాల ప్రభుత్వ భూములను తమ బినామీల పేరుతో మార్చుకున్నారని, ఆ వివరాలన్నీ సేకరించామని పొంగులేటి చెప్పారు. ఈ భూములన్నింటినీ ఇటీవల మళ్లీ నిషేధిత జాబితాలో పెట్టామన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు సమీపంలో పేదలకు ఇచ్చిన భూములను కూడా వదల్లేదని చెప్పారు. సిద్దిపేట జిల్లాలో ఓ నాయకుడు 380 ఎకరాల ప్రభుత్వ భూమిని తన బినామీల పేరుతో బదలాయించుకుని, దాన్ని పలు సంస్థలకు విక్రయించారని తెలిపారు.
భూ ఆక్రమణలు, రైతుల సమస్యల మీద ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు మళ్లీ ట్రైబ్యునల్ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నామని మంత్రి చెప్పారు. అలాగే ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు కొత్త ఆర్వోఆర్ చట్టంలో కొన్ని మార్పులు చేశామన్నారు. సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించేందుకు వెసులబాటు కల్పిస్తున్నామన్నారు. ధరణి పార్ట్-బిలో ఉన్న 15 లక్షల ఎకరాలకు పరిష్కారం చూపబోతున్నామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ భూములన్నీ స్వాహా అయ్యేవన్నారు. గతంలో తొలగించిన వారి నుంచి గ్రామ రెవెన్యూ సిబ్బందిని ఎంపిక చేస్తామని, దీనిపై ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉందని, 987 మంది అవసరమైతే 238 మందే పని చేస్తున్నారని గుర్తుచేశారు. ఈ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేసి, గతంలో తొలగించిన వీఆర్‌వోల నుంచే సర్వేకు అవసరమైన వారిని తీసుకుంటామని తెలిపారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థలో పని చేసేందుకు కొత్త నియామకాలు చేపట్టేది లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ధరణిలో గత 45 రోజుల్లో వచ్చిన 65 వేల దరఖాస్తులే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సాంకేతిక సమస్యలను అధిగమించే వరకు పాత ఏజెన్సీ సహకారం తీసుకుంటామని చెప్పారు.
హౌసింగ్ బోర్డు బకాయిలు వసూలు చేస్తాం
ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు రూపొందించిన యాప్‌లో ఆరు ప్రశ్నలే ఉంటాయని, అవి కూడా అర్హులను తేల్చడం కోసం అడిగేవేనని పొంగులేటి చెప్పారు. ఎవరైనా ఒంటరి పురుషులు ఉంటే వారికి కూడా ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తుందన్నారు. పథకం మంజూరుపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, అర్హులందరికీ కచ్చితంగా పథకం అందుతుందని చెప్పారు. హౌసింగ్ బోర్డు బకాయిల వసూళ్లలో కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు సంస్థలకు నోటీసులివ్వడంతో పాటు స్థలాలను కూడా అధీనంలోకి తీసుకున్నామన్నారు. నిజాయితీగా పనిచేసే అధికారులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పొంగులేటి చెప్పారు. ప్రభుత్వ అధికారులపై కొన్ని రాజకీయ పార్టీలు హత్యాయత్నం చేయిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కూడా తప్పు చేయకపోతే ఎవరికీ భయపడాల్సిన పనిలేదన్నారు. బాంబులు అంటే అరెస్టులు చేయడం, లాఠీ దెబ్బలు కొట్టడం కాదని.. వారి తప్పులను ప్రజలకు చూపించడమేనని చెప్పారు.
Updated Date - Dec 07 , 2024 | 04:29 AM