ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponguleti Srinivasa Reddy: తప్పు జరిగితే.. వేటు తప్పదు!

ABN, Publish Date - Dec 25 , 2024 | 05:52 AM

ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో అవినీతి, అక్రమాలకు ఆస్కారం ఇవ్వొద్దని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో.. అవినీతి, అక్రమాలకు ఆస్కారమివ్వొద్దు

పేదవారికి ఇల్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం

ఇందిరమ్మ కమిటీలతో లబ్ధిదారుల ఎంపిక

సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణం ప్రారంభం

అధికారులతో సమీక్షలో మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో అవినీతి, అక్రమాలకు ఆస్కారం ఇవ్వొద్దని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. ఎక్కడైనా చిన్న తప్పు జరిగినట్లు తేలినా వేటు తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో అర్హులైన పేదవారికి ఇల్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అధికారులు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని అన్నారు. ఏ అధికారిపైనా తనకు ఎలాంటి అభిప్రాయమూ, కోపతాపాలు లేవని, కేవలం పేదవారికి ఇళ్లు ఇవ్వాలనే తపన మాత్రమే ఉందని తెలిపారు. అధికారులు ఎలాంటి ఒత్తిడి, ప్రలోభాలకు గురికాకుండా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్నారు. మంగళవారం హిమాయత్‌నగర్‌లోని గృహనిర్మాణ సంస్థ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం, దరఖాస్తుల పరిశీలన సంబంధిత అంశాలపై ఆ శాఖ కార్యదర్శి బుద్దప్రకాశ్‌, మేనేజింగ్‌ డైరక్టర్‌ వీపీ గౌతమ్‌లతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణ పనులు చేసేవారికి గ్రీన్‌చానల్‌ ద్వారా నిధులు విడుదల చేద్దామని, కాంట్రాక్టర్లు ముందుకొస్తే పనులు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం 33 జిల్లాలకు కొత్తగా నియమితులైన ప్రాజెక్టు డైరెక్టర్లకు, పదోన్నతులు పొందినవారికి సంబంధిత పత్రాలను మంత్రి అందజేశారు. ఈ నెల 27న అన్ని కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తానన్నారు.


గృహనిర్మాణ సంస్థకు పూర్వ వైభవం..

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించడంతో గృహనిర్మాణ సంస్థ కార్యాలయానికి పూర్వ వైభవం వచ్చిందని మంత్రి పొంగులేటి అన్నారు. సమీక్ష అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సోమవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల దరఖాస్తుల పరిశీలన జరిగిందని తెలిపారు. జనవరి మొదటి వారంలో 80 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుందని, ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి సంక్రాంతి నాటికి ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అని తెలిపారు. కేంద్రం అమలు చేసే పీఎంఏవై కింద ఏవైనా దరఖాస్తులు తిరస్కరణకు గురైతే.. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.

నాలుగు దశల్లో ఆర్థిక సాయం..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలో వెనక్కి వెళ్లేదిలేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఇళ్లు మంజూరైన వారికి నాలుగు దశల్లో ఆర్థిక సాయం అందిస్తామన్నారు. పథకం అమలు పర్యవేక్షణకు విజిలెన్స్‌ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కాగా, హైదరాబాద్‌కు నాలుగువైపులా వంద ఎకరాల్లో ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు మంత్రి తెలిపారు. రాజీవ్‌ స్వగృహ పరిధిలోని వివిధ టవర్లను త్వరలో వేలం వేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాన్ని లేవనెత్తగా.. రాజీవ్‌ స్వగృహ పరిధిలో వేలం వేసే టవర్లను తీసుకోవడానికి జర్నలిస్టులు సిద్ధంగా ఉంటే నిబంధనల ప్రకారం అందించేందుకు తమకెలాంటి ఇబ్బంది లేదన్నారు. ఈ విషయంపై మీడియా అకాడమీ చైర్మన్‌తో చర్చించాలని శాఖ ఎండీ గౌతమ్‌కు మంత్రి సూచించారు.

Updated Date - Dec 25 , 2024 | 05:52 AM