PM Modi : అదానీ, అంబానీ నుంచి ఎంత ముట్టింది?
ABN, Publish Date - May 09 , 2024 | 06:05 AM
గడచిన ఐదేళ్లుగా అదానీ, అంబానీలపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్.. ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే ఎందుకు మౌనం దాల్చిందో స్పష్టం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ డిమాండ్
ఐదేళ్లుగా విమర్శలు.. ఇప్పుడు మౌనమేల?
ఎన్నికల సమయంలోనే ఈ మార్పు ఏమిటి?
టెంపోల్లో ఎంత నల్లధనం అందింది?
కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ప్రశ్నల వర్షం
పదేళ్లలో ప్రతీ రంగాన్ని అభివృద్ధి చేశాం
మూడు దశల ఎన్నికల్లో బీజేపీదే హవా
గెలిచే సీట్ల కోసం కాంగ్రెస్ భూతద్దంతో
వెతుకుతోంది.. ఇకపై మైక్రోస్కోప్ అవసరం
ఇండీ గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు
అయోధ్య రామమందిరానికి
తాళం వేయాలని కాంగ్రెస్ యోచన
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లది అవినీతి బంధం
హైదరాబాద్‌ను మజ్లిస్‌కు లీజుకిచ్చారు
వేములవాడ, వరంగల్ బీజేపీ సభల్లో ప్రధాని
వేములవాడ, వరంగల్, సిరిసిల్ల, మే 8 (ఆంధ్రజ్యోతి): గడచిన ఐదేళ్లుగా అదానీ, అంబానీలపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్.. ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే ఎందుకు మౌనం దాల్చిందో స్పష్టం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ డిమాండ్ చేశారు. ఈ ఎన్నికలకు అదానీ, అంబానీల నుంచి ఎంత ముట్టిందో చెప్పాలన్నారు. ‘ఐదేళ్లుగా విమర్శిస్తూ వచ్చి, ఎన్నికల ప్రక్రియ ఆరంభం కాగానే అదానీ, అంబానీలపై రాత్రికి రాత్రే విమర్శలు ఎందుకు ఆగిపోయాయి? తెలంగాణ గడ్డపై నుంచి ప్రశ్నిస్తున్నా... టెంపోల్లో ఎంత నల్లధనం మీకు చేరింది?’ అని కాంగ్రె్‌సను మోదీ నిలదీశారు. దాల్ మే కుచ్ కాలా హై అని వ్యాఖ్యానించారు. బుధవారం వేములవాడ, వరంగల్‌లలో బీజేపీ జనసభ పేరుతో నిర్వహించిన బహిరంగసభల్లో మోదీ ప్రసంగించారు. గడచిన పదేళ్లలో ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రతీ రంగాన్ని అభివృద్ధి చేస్తూ వస్తోందన్నారు. ‘వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సాగురంగాన్ని ఆధునీకరిస్తున్నాం. నానో యూరియా, డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాం. కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా అమలు చేస్తున్నాం. ప్రతీ ఇంటికీ అభివృద్ధి ఫలాలు అందేలా కృషిచేస్తున్నాం. టెక్స్‌టైల్ పార్కులు అభివృద్ధి చేస్తున్నాం. మీ ఒక్క ఓటుతో... ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగింది. 370 ఆర్టికల్ రద్దు చేశాం. రక్షణ రంగంలో ఉత్పత్తులను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. ఇవన్నీ చేసింది నేను కాదు.. మీరిచ్చిన ఓటు బలం’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
విజయపథంలో బీజేపీ
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయపథంలో దూసుకుపోతోందని, మూడో దశలో ఇది స్పష్టమైందని మోదీ తెలిపారు. కాంగ్రెస్, ఇండీ (ఇండియా) కూటమి ఫ్యూజు ఊడిపోయిందని ఎద్దేవా చేశారు. ఈ మూడు దఫాల్లో ఎక్కడ గెలిచే అవకాశం ఉందో తెలుసుకోవడానికి కాంగ్రెస్ నాయకులు భూతద్దం పెట్టి వెతుకుతున్నారని, ఇక నాలుగో దశలో ఆ పార్టీకి భూతద్దం కూడా సరిపోదు.. మైక్రోస్కోప్ అవసరం అని పేర్కొన్నారు. ఇండీకూటమి ఐదేళ్లు, ఐదుగురు పీఎంలు ఫార్ములాతో వస్తోందని.. కూటమిలోని ప్రతీ పార్టీ నుంచి ఏటా ఒకరు ప్రధానిగా ఉండాలని వారు నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. ఏడాదికో ప్రధాని ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అని హెచ్చరించారు. మీ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా, వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణ లక్ష్యం నెరవేరాలన్నా ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ కావాలని మోదీ పిలుపునిచ్చారు.
మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం వ్యతిరేకం
మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం వ్యతిరేకమని మోదీ పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీల రిజర్వేషన్‌లు లాక్కుని ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణలో మాదిగలకు రిజర్వేషన్‌లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉందని, రిజర్వేషన్‌లను రద్దుచేస్తే చూస్తూ ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని, ఈ మేరకు మంద కృష్ణ మాదిగకు, మాదిగ సమాజానికి ఇచ్చిన మాట మర్చిపోనని మోదీ తెలిపారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకే తాను ముక్కలు
బీఆర్‌ఎస్, కాంగ్రె్‌సలు కుటుంబ పార్టీలని, ఆ రెండు పార్టీలను కలిపేది అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు, జీరో గవర్నెన్స్ (పాలనా శూన్యత) అని విమర్శించారు. ఈ రెండు పార్టీలు ఒకే తాను ముక్కలు.. నాణేనికి బొమ్మా బొరుసు.. వీరి నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన అవశ్యకత ఉందని అన్నారు. బీజేపీకి మాత్రం దేశం తర్వాతే కుటుంబమని తెలిపారు. అవినీతిలో కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలది ఫెవికాల్ బంధమని.. బహిరంగంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు కానీ తెరవెనుక మాత్రం వారిది అవినీతి సిండికేట్ అని పేర్కొన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్.. ఓటుకు నోటు కేసుపై ఎందుకు దర్యాప్తు కొనసాంచలేదు? కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత హడావుడి తప్ప ఏం చేసింది? అని మోదీ నిలదీశారు. కాళేశ్వరం వ్యవహారంలో బీఆర్‌ఎ్‌సను కాంగ్రెస్ రక్షిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా సూపర్‌హిట్ అయిన ట్రిపుల్ ఆర్ సినిమాకు రూ.వెయ్యి కోట్ల కలెక్షన్ వచ్చిందని, కానీ, తెలంగాణలో జరుగుతున్న డబుల్ ఆర్ ట్యాక్స్ వసూళ్లు నాలుగైదు నెలల్లోనే దీనిని మించిపోయాయని మోదీ ఎద్దేవా చేశారు. డబుల్ ఆర్‌లో ఒక ఆర్ తెలంగాణను దోచుకుంటూ ఢిల్లీలోని మరో ఆర్‌కు కప్పం కడుతోందన్నారు. వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్న టెక్స్‌టైల్ పార్కు నుంచి కూడా డబుల్ ఆర్ ట్యాక్స్ కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మోదీ ఆరోపించారు. అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ మాస్టర్ అని మోదీ విమర్శించారు. ఆ పార్టీ అగ్రనేత జన్మదినం సందర్భంగా రైతుల రుణమాఫీ చేస్తామని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రచారం చేసి, ఇప్పుడు పంద్రాగస్టు అని చెబుతున్నారని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్లు, రుణమాఫీని పంద్రాగస్టు నాటికి అమలు చేస్తామని వేములవాడ రాజన్నపై ఒట్టుపెట్టుకుంటున్నారని మోదీ విమర్శించారు. హైదరాబాద్‌ను కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలు ఎంఐఎంకు లీజుకిచ్చాయని విమర్శించారు.
తెలంగాణ తలుపులతో రామమందిరానికి శోభ
సంస్కృతీ సంప్రదాయాలకు, భక్తిశ్రద్ధలకు తెలంగాణ నిలయమని ప్రధాని మోదీ కొనియాడారు. అయోధ్య రామమందిరానికి తెలంగాణ నుంచి వచ్చిన తలుపులు ప్రత్యేక శోభనిస్తున్నాయన్నారు. రామమందిరం పూర్తికావడం మనందరికీ సంతోషం కలిగిస్తుంటే, కాంగ్రె్‌సకు మాత్రం ఈర్ష్య కలిగిస్తోందని విమర్శించారు. ‘సుప్రీంకోర్టు తీర్పు ద్వారా రామమందిరం నిర్మించాం. అధికారంలోకి వస్తే అదే కోర్టు తీర్పును పునస్సమీక్షించాలని కాంగ్రెస్ భావిస్తోంది. రామమందిరానికి తాళం వేయాలని యోచిస్తోంది’ అని ఆరోపించారు. రామమందిరాన్ని కాపాడుకుందాం.. కాంగ్రె్‌సకు గుణపాఠం చెబుదాం అని పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు చెందిన మూడు తరాల కుటుంబసభ్యులను కలుసుకోవడం తనకు సంతోషం కలిగించిందని మోదీ చెప్పారు. పీవీని కాంగ్రెస్ అవమానించిందని, కానీ, తమ ప్రభుత్వం పీవీని భారతరత్నతో గౌరవించిందన్నారు. చివరగా.. మీరు నా వ్యక్తిగత పని ఒకటి చేసి పెడతారా? అంటూ బీజేపీ కార్యకర్తలను ప్రశ్నించిన మోదీ, తాను నమస్కారం చేసినట్లు ఇంటింటికీ వెళ్లి చెప్పాలని కోరారు.
మందకృష్ణకు ఆలింగనం
వరంగల్ సభలో మోదీ వేదికపైకి వెళ్లిన తర్వాత అక్కడనిల్చొని ఉన్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ వద్దకు వెళ్లి ఆయనను ఆలింగనం చేసుకున్నారు. దీంతో సభ ఒక్కసారిగా మోదీ నినాదాలతో మార్మోగింది. మోదీ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. తన కర్మభూమి అహ్మదాబాద్‌తోపాటు ఇక్కడ వరంగల్‌లో కూడా భద్రకాళి ఉన్నారని పేర్కొంటూ.. భద్రకాళికి ప్రణామాలని చెప్పారు.
జనసందోహాన్ని చూసి మోదీ ఫిదా
వేములవాడలో ఉదయం పదిన్నరకు మోదీ వేదిక వద్దకు చేరుకోగా అప్పటికే ఆ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అయినా కూడా బయటి నుంచి జనం తరలివస్తూనే ఉన్నారు. ఈ జనసందోహాన్ని చూసి మోదీ ఫిదా అయ్యారు. ‘గుజరాత్‌లో ఏళ్లపాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా. మూడుసార్లు సీఎంగా చేశా. కానీ, ఎప్పుడు కూడా ఉదయం పది గంటలకే జనం ఇంతగా తరలిరావటం చూడలేదు. ఈ విధంగా సభ నిర్వహణ నాకు గుజరాత్‌లో కూడా సాఽధ్యం కాలేదు. మీరు నా పట్ల చూపిన అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని పేర్కొన్నారు. సభను విజయవంతంగా నిర్వహించినందుకు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ని మోదీ ప్రత్యేకంగా అభినందించారు.
వేములవాడలో మోదీ ప్రత్యేక పూజలు
Updated Date - May 09 , 2024 | 06:05 AM