Kaushik Reddy: హుజూరాబాద్‌లో ఉద్రిక్తత
ABN, Publish Date - Nov 10 , 2024 | 02:05 AM
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో దళితబంధు రెండో విడత నిధులను విడుదల చేయాలని శనివారం దళితులు, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది.
దళితబంధు కోసం లబ్ధిదారుల ధర్నా
కౌశిక్‌రెడ్డి, పోలీసుల మధ్య తోపులాట
ఎమ్మెల్యేకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
హుజూరాబాద్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో దళితబంధు రెండో విడత నిధులను విడుదల చేయాలని శనివారం దళితులు, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. దళిత బంధు రెండో విడత డబ్బులు రాని వారు తమ ఇంటికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నాలుగు రోజుల క్రితం పిలుపునిచ్చారు. దీంతో లబ్ధిదారులు శనివారం ఎమ్మెల్యే ఇంటికి పెద్దఎత్తున తరలివచ్చారు. హుజూరాబాద్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద తాము చేపట్టే ధర్నాలో పాల్గొనాలని లబ్ధిదారులు కౌశిక్‌రెడ్డిని కోరారు. దీంతో అందరూ కలిసి ర్యాలీగా చౌరస్తాకు చేరుకుని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు.
పోలీసులు ఎమ్మెల్యేను అడ్డుకోవడంతో తీవ్రవాగ్వాదం జరిగింది. కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు యత్నించగా లబ్ధిదారులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎమ్మెల్యేను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కౌశిక్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కౌశిక్‌రెడ్డిని విడుదల చేయాలని దళితబంధు లబ్ధిదారులు గంట పాటు రాస్తారోకో చేశారు. దీంతో కరీంనగర్-హనుమకొండ ప్రధాన రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దళితబంధు రెండో విడత నిధులు లబ్ధిదారులకు ఇచ్చేదాకా పోరాటం చేస్తామని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అన్నారు. హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే హుజూరాబాద్‌లోని దళితుల కాలనీల్లో పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు. దళితబంధు రెండో విడత డబ్బులు ఇవ్వాలని ధర్నా చేస్తే పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, లబ్ధిదారులపై దాడి చేస్తారా..? అని గంగుల కమలాకర్ ప్రశ్నించారు.
Updated Date - Nov 10 , 2024 | 02:05 AM