స్నేహం నటించి.. చంపేస్తాడు!
ABN, Publish Date - Nov 13 , 2024 | 04:45 AM
ఒంటరిగా ఉన్నవారితో మాటలు కలుపుతాడు. స్నేహం పేరుతో పూటుగా మద్యం తాగించి బండారాయితో కొట్టి చంపుతాడు.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో సైకో కిల్లర్
ఒంటరివాళ్లే లక్ష్యం.. 14 రోజుల్లో 2 హత్యలు
మెదక్ అర్బన్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఒంటరిగా ఉన్నవారితో మాటలు కలుపుతాడు. స్నేహం పేరుతో పూటుగా మద్యం తాగించి బండారాయితో కొట్టి చంపుతాడు. తర్వాత దొరికిన వస్తువులు, డబ్బు తీసుకొని ఉడాయిస్తాడు. మెదక్ జిల్లాలో ఓ సైకో కిల్లర్ నైజమిది! ఇలా 14 రోజుల వ్యవధిలో ఇద్దరిని దారుణంగా హత్యచేసిన ఆ కిల్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు చిన్న శంకరంపేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఓట్టేల మల్లేశం అలియాస్ గొల్ల మల్లేశం. కేసు వివరాలను జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మల్లేశానికి నేర చరిత్ర ఉంది. రైళ్లలో అటూ ఇటూ తిరుగుతూ దొంగతనాలు చేస్తూ రైల్వే ప్లాట్‌ఫాంపై పడుకుంటాడు. గతనెల 22న నిజామాబాద్‌లో లేబర్ అడ్డా వద్ద కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటకు చెందిన నవీన్(24)తో స్నేహం నటించాడు.
ఇద్దరూ చిన్నశంకరంపేట వైన్స్‌లో మద్యం తీసుకుని తాగారు. మద్యం మత్తులో ఉన్న నవీన్‌ను ప్రాథమిక ఆర్యోగ కేంద్రం వెనక వైపు తీసుకెళ్లి బండరాయితో కొట్టి చంపాడు. ఈనెల 3న నిజామాబాద్ జిల్లా ఎడుపల్లి మండలం కుర్ణపల్లికి చెందిన కొమ్రే స్వామి(39)తో పరిచయం చేసుకొని మీర్జాపల్లి స్టేషన్‌కు తీసుకొచ్చాడు. మద్యం తాగించి చిన్నశంకరంపేటలో పద్మనాభస్వామి గుట్టవద్ద బండరాయితో కొట్టి దారుణంగా హతమార్చాడు. ఈ రెండు హత్యలను పోలీసులు సవాలుగా తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం మల్లేశాన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నేరా లు ఒప్పుకొన్నాడు. మల్లేశం 2013లో చిన్నశంరంపేట పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన హత్య కేసులో పదేళ్లు జైలులో ఉన్నాడు. 2022లో జైలు నుంచి వచ్చాక హత్యలు చేసి, దొంగిలించిన నగదు, వస్తువులను సోదరుడు రమేశ్‌కు ఇచ్చేవాడని పోలీసులు తెలిపారు. ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Updated Date - Nov 13 , 2024 | 04:45 AM