Raghunandan Rao: కేసీఆర్ పులి, పిల్లి కాదు ఎలుక.. హరీశ్ రావుపై రఘునందన్ విసుర్లు
ABN, Publish Date - Jan 20 , 2024 | 04:04 PM
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని ఆ పార్టీ నేత రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని ఆ పార్టీ నేత రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావు ఎవరు పోటీ చేసినా గెలవరని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బిగ్ జీరోగా నిలవనుందని జోస్యం చెప్పారు. మాజీ మంత్రి హరీశ్ రావుపై రఘునందన్ రావు ఆగ్రహాం వ్యక్తం చేశారు.
గతంలో ప్రధాని మోదీ తెలంగాణ వస్తే అప్పటి సీఎం కేసీఆర్ పదిసార్లు మొహం చాటేశారని రఘునందన్ రావు గుర్తుచేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొత్త సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిశారని గుర్తుచేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ను కేటీఆర్ పులి అంటున్నారు. పులి జనాల్లో ఎందుకు ఉంటుంది, అడవీలో ఉంటుందనే విషయం కేటీఆర్ తెలుసుకోవాలని సెటైర్లు వేశారు. కేసీఆర్ పులి కాదు, పిల్లి అంతకన్నా కాదు ఎలుక అని రఘునందన్ ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి వాత పెట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందన్నారు.
కృష్ణా జలాల నీటిలో 299 టీఎంసీలకు ఒప్పందం చేసుకుంది అప్పటి సీఎం కేసీఆర్ కాదా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. అన్యాయం జరిగితే అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్లలేదు అని అడిగారు. ఎన్నికల సమయంలోనే హరీశ్ రావుకు మోటార్లకు మీటర్లు గుర్తొస్తాయని మండిపడ్డారు. 1998లో మెదక్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ గెలిచిన విషయం హరీష్ గుర్తుంచుకోవాలని సూచించారు.
పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా కోట్లు ఉన్న వారికే బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ టికెట్లను కేటాయిస్తుందని రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు లోక్ సభ సీటు ఇవ్వగలరా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. వంద కోట్లకు లోక్ సభ సీట్లు అమ్ముకున్న చరిత్ర మీ పార్టీది అని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 20 , 2024 | 04:04 PM