సీఎం నోట తిమ్మాపూర్ మాట
ABN, Publish Date - Dec 20 , 2024 | 11:42 PM
తిమ్మాపూర్ భూదాన భూముల కుంభకోణం వ్యవహారం అసెంబ్లీని తాకింది. భూదాన భూముల కుంభకోణాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
భూ కుంభకోణాన్ని ప్రస్తావించిన రేవంత్‌రెడ్డి
ఇటీవలే వెలుగులోకి తెచ్చిన ‘ఆంధ్రజ్యోతి’
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): తిమ్మాపూర్ భూదాన భూముల కుంభకోణం వ్యవహారం అసెంబ్లీని తాకింది. భూదాన భూముల కుంభకోణాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కుంభకోణానికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టినట్లు వెల్లడించారు. నగర శివార్లలోని కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో రూ.200కోట్ల విలువైన 40 ఎకరాల భూదాన భూములు అన్యాక్రాంతంపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో ఎన్నికలకు ముందు బడానేతలు బినామీలను అడ్డుపెట్టుకుని భూదాన భూములను దొడ్డిదారిన పట్టా భూములుగా మార్చిన వైనంపై అక్టోబర్ 28న ‘నాయకులు భూదాహం... అధికారుల భూదానం’ శీర్షికతో ప్రచురితమైన కథనం కలకలం రేకెత్తించింది. ఈ కథనంపై ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణకు ఆదేశించి దీనికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసింది. శుక్రవారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి సైతం దీన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తరువాత అనేక అక్రమాలు, భూకుంభకోణాలు జరిగాయని తిమ్మాపూర్ భూదాన భూములను కూడా రికార్డులను తారుమారు చేసి అన్యాక్రాంతం చేశారన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్వగ్రామమైన తిమ్మాపూర్‌లోనే ఇది జరిగిందని స్వయంగా కేంద్ర మంత్రి ఫిర్యాదు చేసినా కూడా విలువైన భూములను పరాధీనం చేశారని తెలిపారు. ఈ విషయం తన దృష్టికి రాగానే విచారణ జరిపించి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టించానన్నారు. అలాగే గతంలో ‘ఆంరఽధజ్యోతి ’ ప్రచురించిన పొక్కాల్‌గూడ భూముల కుంభకోణం విషయం కూడా సీఎం ప్రస్తావించారు. వీటన్నింటిపై విచారించి తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.
Updated Date - Dec 20 , 2024 | 11:42 PM