వరకట్న వేధింపులు.. భార్య మృతి
ABN, Publish Date - Dec 27 , 2024 | 12:13 AM
భర్త వేధింపులు తాళలేక భార్య మృతిచెందిన ఘటన మహేశ్వరం పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం మైలార్‌బాయి తండాకు చెందిన సబావత్ సంతోష(25)ను 2019లో కందుకూరు మండలం పెద్దమ్మ తండాకు చెందిన సంతోష్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు.
మహేశ్వరం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): భర్త వేధింపులు తాళలేక భార్య మృతిచెందిన ఘటన మహేశ్వరం పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం మైలార్‌బాయి తండాకు చెందిన సబావత్ సంతోష(25)ను 2019లో కందుకూరు మండలం పెద్దమ్మ తండాకు చెందిన సంతోష్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. పెళ్లి సమయంలో రూ.8లక్షల కట్నంతో పాటు ఇతరత్రా పెట్టుబోతలు అప్పగించి వివాహం జరిపించారు. అయితే, సంతోష్ కొన్ని రోజులుగా అదనపు కట్నం తేవాలని భార్యను వేధించడంతో పాటు తీవ్రంగా కొట్టేవాడు. భర్త వేధింపులు తాళలేని సంతోష ఈనెల 24న మహేశ్వరం పోలీసుస్టేషన్లో భర్త సంతో్‌షపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని సంతో్‌షపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అప్పటికే నాలుగు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంతోష.. మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటోంది. ఈక్రమంలో గురువారం ఉదయం ఆసుపత్రిలో మృతి చెందింది. దాంతో సంతోష మృతదేహంతో బంధువులు పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. సంతోష మృతికి కారణమైన భర్తను చట్టపరంగా శిక్షించడంతో పాటు పెళ్లి సమయంలో ఇచ్చిన రూ.8లక్షలు తిరిగి ఇవ్వాలని.. ఆ డబ్బుతో ఇద్దరు పిల్లల సంరక్షణ చూడాలని ఇరువురి బంధువలు తరఫున పెద్దలు ఒప్పందం కుదుర్చుకోవడంతో ఆందోళన విరమించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి..
యాచారం, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): రెండుబైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైన ఓ వ్యక్తి గురువారం మృతిచెందాడు. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీసుల కథనం మేరకు.. మండల పరిధిలోని బండమీది తండా వద్ద మూడు రోజుల క్రితం ముచ్చర్లకు చెందిన బీరప్ప, ఊట్లపల్లికి చెందిన యాదగిరిలు బైక్‌లపై వస్తుండగా తండా సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో బీరప్పకు స్వల్పగాయాలైనాయి, యాదగిరి(25) తీవ్రంగా గాయపడడంతో కుటుంబీకులు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎల్.కృష్ణంరాజు తెలిపారు.
Updated Date - Dec 27 , 2024 | 12:13 AM