ఇగంలో శ్రమైక జీవనం
ABN, Publish Date - Dec 19 , 2024 | 11:26 PM
కొన్ని రోజులుగా చలి గజ్జున వణికిస్తుంది. ఇళ్ల నుంచి బయటకు రావడానికే జనం జంకుతున్నారు. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చిన్నాపెద్ద అనే తేడా లేకుండా ఆ... ఊ... అంటూ వణికిపోతున్నారు. హిమాలయాలను తలపిస్తున్న వాతావరణంలోనూ ప్రజలు తమ జీవన పోరాటాన్ని ఆపడం లేదు.
చేవెళ్ల, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : కొన్ని రోజులుగా చలి గజ్జున వణికిస్తుంది. ఇళ్ల నుంచి బయటకు రావడానికే జనం జంకుతున్నారు. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చిన్నాపెద్ద అనే తేడా లేకుండా ఆ... ఊ... అంటూ వణికిపోతున్నారు. హిమాలయాలను తలపిస్తున్న వాతావరణంలోనూ ప్రజలు తమ జీవన పోరాటాన్ని ఆపడం లేదు. వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తూ గడ్డ కట్టే చలిలోనూ ముందుకు సాగుతున్నారు. చేవెళ్ల డివిజన్‌లో రెండు రోజులుగా 6.8, 6.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంత చలిని సైతం లెక్క చేయకుండా ప్రజలు, రైతులు వారివారి పనుల్లో నిమగ్నమవుతున్నారు. చలికి భయపడి ఇంట్లో కూర్చుంటే బతుకు బండి సాగడం కష్టమని తెల్లవారుజామున ఐదు గంటలకే రైతులు పొలం బాట పడుతున్నారు. పాడి రైతులు పాలు పితికి ఇంటింటికీ తిరిగి పోస్తున్నారు. ఇగం పుట్టిస్తున్నా ఏజెంట్లు, బాయ్‌లు న్యూస్ పేపర్లను ఇంటింటికీ వేసి వస్తున్నారు. చలి నుంచి రక్షణకు పొందేలా దుస్తులు ధరించి శ్రమైక జీవనం సాగిస్తున్నారు.
వణికిస్తున్న చలి
రెడ్డిపల్లిలో 10.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
రంగారెడ్డి అర్బన్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వారం రోజుల నుంచి చలి చంపేస్తుంది. గురువారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో 10.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లిలోని కేసవరంలో 12.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
Updated Date - Dec 19 , 2024 | 11:26 PM