ధ్యానంతో ఆత్మజ్ఞానం
ABN, Publish Date - Dec 24 , 2024 | 12:50 AM
ధ్యాన సాధన చేసి ఆత్మజ్ఞానం పొందిన వారు మానసిక భయాలు వీడి మనో ధైర్యంతో ఆనందమయ జీవితాన్ని పొందుతారని పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా సభ్యురాలు, దివంగత బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ కుమార్తె పరిణతి పత్రీజీ అన్నారు. శ్వాసమీద ధ్యాసతోనే వ్యక్తికి పరిపూర్ణత లభిస్తుందని.. అది ధ్యానం ద్వారా సిద్ధిస్తుందని తెలిపారు.
ధ్యాన గురువు పరిణతి పత్రీజీ
కొనసాగుతున్న ధ్యాన మహాయాగం వేడుకలు
తెలుగు రాష్ట్రాల నుంచి తరలివస్తున్న ధ్యానులు
ఆకట్టుకున్న కళాకారుల నృత్య ప్రదర్శనలు
ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
కడ్తాల్, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ధ్యాన సాధన చేసి ఆత్మజ్ఞానం పొందిన వారు మానసిక భయాలు వీడి మనో ధైర్యంతో ఆనందమయ జీవితాన్ని పొందుతారని పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా సభ్యురాలు, దివంగత బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ కుమార్తె పరిణతి పత్రీజీ అన్నారు. శ్వాసమీద ధ్యాసతోనే వ్యక్తికి పరిపూర్ణత లభిస్తుందని.. అది ధ్యానం ద్వారా సిద్ధిస్తుందని తెలిపారు. కడ్తాల మండలం అన్మా్‌సపల్లి మహేశ్వర మహాపిరమిడ్‌లో కొనసాగుతున్న ధ్యాన మహాయాగం వేడుకల్లో భాగంగా మూడోరోజు సోమవారం పరిణతి పత్రీజీ పాల్గొని ధ్యానులనుద్దేశించి మాట్లాడారు. పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ కోర్పోలు విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ద్యానం ద్వారా జ్ఞానం, సంస్కారం సిద్ధించి వ్యక్తి ఉన్నతికి దోహదపడుతుందన్నారు. మహేశ్వర మహాపిరమిడ్ కేంద్రంగా పత్రీజీ ప్రారంభించిన ధ్యాన విప్లవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ధ్యానులు, పిరమిడ్ మాస్టర్లు కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు.
అట్టహాసంగా వేడుకలు
అన్మా్‌సపల్లి గ్రామ సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్‌లో పత్రీజీ ధ్యాన మహాయాగం వేడుకలు-3 అట్టహాసంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వేడుకలకు ధ్యానులు, సాధకులు, సందర్శకులు, పిరమిడ్ మాస్టర్లు, ఆధ్యాత్మికవేత్తలు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. పలు దేశాలకు చెందిన ధ్యానులు, ఆధ్యాత్మికవేత్తలు పాల్గొని తమ ధ్యాన అనుభవాలను వివరిస్తున్నారు. పత్రీజీ శక్తిస్థల్‌ను శోభాయమానంగా అలంకరించారు. ధ్యాన మహాయాగంలో భాగంగా సోమవారం తెల్లవారుజామున 5గంటలకు ధ్యాన మహాత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం యోగా మాస్టర్ వెంకటేశ్‌చే యోగా శిక్షణ, చైతన్య తేజల ఆధ్వర్యంలో వేద పఠనం, వేణునాథ, సంగీత కళాకారులు గణేశ్, సంజయ్‌కింగ్ బృందాలచే సంగీతనాద ధ్యానం కార్యక్రమాలు నిర్వహించారు. ధ్యాన గురువు పత్రీజీ వేణునాధ సంగీత ధ్యాన వీడియోలను సరస్వతి ప్రాంగణంలోని సభావేదికపై నుంచి వీడియో ద్వారా ప్రదర్శించారు. సంగీత విధ్వాంసుల సంగీత ధ్యానం అమితంగా ఆకట్టుకుంది. పలువురు పిరమిడ్ మాస్టర్లు, ఆధ్యాత్మికవేత్తలు, ట్రస్ట్ సభ్యులు ధ్యానులనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ధ్యాన విలువలను వివరించారు. ఈమేకు ఆదాయ పన్ను శాఖ అధికారి జైన్ వేడుకలకు హాజరై ధ్యాన విస్తరణకు చేస్తున్న కృషిని అభినందించారు. పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు సాంబశివరావు, హన్మంతరావు, మాధవి, దామోదర్‌రెడ్డి, లక్ష్మి, అన్మా్‌సపల్లి మాజీ సర్పంచ్ శంకర్, పీఎ్‌సఎ్‌సఎం అధ్యక్షులు సరోజ, తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యానమహాయగంలో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరిస్తున్నాయి. ఆధ్యాత్మిక వేత్తల ప్రసంగాలు ఆకట్టుకుంటున్నాయి. ధ్యాన, శాఖాహార విలువల గురించి పలువురు పిరమిడ్ మాస్టర్లు ధ్యాన వేడుకల్లో వివరించి అవగాహన కల్పిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆధ్యాత్మిక వేత్తలు పిరమిడ్‌ను సందర్శించి ధ్యాన మహాయాగంలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల కల్చరల్, అకాడమీలకు చెందిన కళాకారుల నృత్యాలు, కళాప్రదర్శనలు అందరినీ అమితంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు, యువతులు, కళాకారుల నృత్యరూపకాలు, భరత నాట్యాలు, కూచిపూడి నృత్యాలు అదరహో అనిపించాయి. కామాక్షి బృందంచే నిర్వహించిన సంగీత కార్యక్రమం అలరించింది.
పలు పుస్తకాల ఆవిష్కరణ
ధ్యాన మహాయాగంలో భాగంగా పిరమిడ్ సభా ప్రాంగణంలో పలు ధ్యాన, ఆధ్యాత్మిక పుస్తకాలను పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ కోర్పోలు విజయభాస్కర్ రెడ్డి, పత్రీజీ కూతురు పరిణిత పత్రిజీ ఆవిష్కరించారు. ద్యాన విలువలను చాటుతూ పుస్తకాలను వెలువరిస్తున్న రచయితలను ఈ సందర్బంగా వారు అభినందించారు. అదేవిదంగా పలు ద్యాన కేంద్రాల ద్వారా రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు.
Updated Date - Dec 24 , 2024 | 12:50 AM