ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీలేవి?
ABN, Publish Date - Dec 19 , 2024 | 11:47 PM
ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. విద్యావ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా అభివృద్ధి పనులకు ప్రణాళికలతో ముందుకెళ్తోంది.
రక్షణ చర్యలు శూన్యం
ఇబ్బందుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు
కొడంగల్ రూరల్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. విద్యావ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా అభివృద్ధి పనులకు ప్రణాళికలతో ముందుకెళ్తోంది. అయితే కొన్నిచోట్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా మారింది. కొడంగల్ మండల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీలు లేక రక్షణ కరువైంది. ప్రభుత్వం నూతనంగా పాఠశాలలు నిర్మిస్తున్నప్పటికీ ప్రహరీల నిర్మాణంపై చర్యలు తీసుకోవడం లేదు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని పాఠశాలలు రహదారి పక్కనే ఉండడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు.
మండలంలో ఇదీ పరిస్థితి
మండలంలో 37 ప్రాథమిక, 10 ప్రాథమికోన్నత, ఏడు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అందులో 4,524 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. నాలుగు పాఠశాలలకు పూర్తిస్థాయిలో ప్రహరీలు ఉండగా మరికొన్ని పాఠశాలల ముందు పహరీ ఉండగా వెనక వైపు ప్రహరీలు లేవు. అప్పాయిపల్లి, ఉడిమేశ్వరం, పాతకొడంగల్, పాతకొడంగల్, పలుగురాళ్ళ తండాలు, ఆలేడు, గుండ్లకుంట, హేసేన్‌పూర్, ప్యాలమద్ది, బుల్కపూర్, ఆశమ్మకుంట, మైసమ్మ, పోశమ్మకుంట తండాలు, పాటిమీదిపల్లి, నాగారం, బోయపల్లి, భవనమ్మ, బీమ్లీతండాలు, రావులపల్లి, రుద్రారం, లక్ష్మీంపల్లి, సంగాయిపల్లి, కొండరెడ్డిపల్లి, కొడంగల్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలతో పాటు మరికొన్ని పాఠశాలలకు ప్రహరీలేవు. చాలా చోట్ల కనీస సౌకర్యాలు లేక విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని పాఠశాలలు పొలాల పక్కనే ఉన్నాయి. మరికొన్ని పాఠశాల ఆవరణలో శునకాలు, పశువులు, పందులు సంచరిస్తూ అపరిశుభ్రంగా మారుస్తున్నాయి. పాఠశాల ఆవరణలో పెంచిన మొక్కలను ధ్వంసం చేస్తున్నాయి. సెలవు రోజుల్లో మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి. ప్రహరీలు లేక పాఠశాల స్థలం ఆక్రమణకు గురయ్యే అవకాశం ఉంది. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపించాం: రాంరెడ్డి, ఎంఈవో, కొడంగల్
కొడంగల్ మండలంలో ప్రహరీలు లేని పాఠశాలలను గుర్తించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం. పాఠశాల ఆవరణల్లో ప్రహరీల నిర్మాణంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
Updated Date - Dec 19 , 2024 | 11:47 PM