Tummala: నేతన్నలను ఆదుకునేందుకు 874 కోట్లు విడుదల
ABN, Publish Date - Dec 10 , 2024 | 04:54 AM
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకున్నా రైతాంగానికి చేసిన విధంగానే నేతన్నలను ఆదుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి రూ.874 కోట్ల పాత బకాయిలను విడుదల చేసినట్టు చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
అమీర్‌పేట, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకున్నా రైతాంగానికి చేసిన విధంగానే నేతన్నలను ఆదుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి రూ.874 కోట్ల పాత బకాయిలను విడుదల చేసినట్టు చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో టెస్కోకు రావాల్సిన రూ.488.38 కోట్లలో రూ.465 కోట్లు చెల్లించినట్టు చెప్పారు. ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకుని చేనేత, జౌళి శాఖలు హైదరాబాద్‌లోని అమీర్‌పేట కమ్మ సంఘంలో నిర్వహించిన హస్తకళలు, వస్త్ర ప్రదర్శన ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల హాజరై మాట్లాడారు.
చేనేతను కాపాడాలన్న లక్ష్యంతో అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, ప్రభుత్వ సంస్థలకు కావాల్సిన వస్త్రాలను టెస్కో నుంచికొనాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. నేత కార్మికులకు నిరంతరం పని కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. వేములవాడలో నూలు డిపో ఏర్పాటుతో దాదాపు 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న మరమగ్గాల కార్మికుల కల నెరవేరిందన్నారు. నేతన్న బీమా పథకంలో నమోదైన చేనేత కార్మికుడు ఏ కారణం చేతనైనా మరణి స్తే అతని నామినీకి రూ.5 లక్షలు చెల్లించనున్నట్టు చెప్పారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ)ని సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారని తెలిపారు.
Updated Date - Dec 10 , 2024 | 04:54 AM