CM Revanth Reddy: నా వ్యాఖ్యలు వక్రీకరించారు... సుప్రీం కోర్టు సీరియస్ కావడంపై రేవంత్
ABN, Publish Date - Aug 30 , 2024 | 10:32 AM
సుప్రీం వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మె్ల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడంపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సుప్రీం వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని ఆయన పేర్కొన్నారు.
తనకు న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉందని.. సుప్రీం కోర్టు తీర్పును తప్పుబట్టే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తన వాఖ్యలను తప్పుగా చిత్రీకరించి ప్రచారం చేయడంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
కోర్టు ఏమందంటే..
ఢిల్లీ మద్యం కేసులో కవితకు బెయిల్ ఇవ్వడంపై బుధవారం నాడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ముఖ్యమంత్రి స్థాయి రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలు కాదని ధర్మాసనం అభిప్రాయ పడింది. ఆయన న్యాయస్థానానికి ఉద్దేశాలను ఆపాదించినట్లు వ్యాఖ్యానించారని చెప్పింది. ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం మధ్యాహ్నం వాదనల సందర్భంగా ధర్మాసనం కవితకు బెయిల్ ఇవ్వడంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించింది. ‘‘తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం బీఆర్‌ఎస్ పని చేసిందని, బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య కుదిరిన ఈ ఒప్పందం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని సీఎం కామెంట్ చేశారు’’ అని కవిత తరఫున్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యాఖ్యలపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
సీఎం రేవంత్‌రెడ్డిని తీవ్రంగా మందలించింది. జస్టిస్ బీఆర్ గవాయి స్పందిస్తూ... ‘‘ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో కొందరి ఆలోచనల్లో భయాలు రేకెత్తే అవకాశం ఉంది. రాజకీయ నాయకులను సంప్రదించి మేము తీర్పులు ఇస్తున్నామా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘న్యాయమూర్తులుగా మేం ప్రమాణం చేస్తాం. మనస్సాక్షిగానే మా విధిని నిర్వర్తిస్తాం’’ అని స్పష్టం చేశారు. మరో న్యాయమూర్తి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ జోక్యం చేసుకొని... ‘‘ఇది ఒక సీఎం హోదాలో ఉన్న బాధ్యత గల వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలా? సంస్థల పట్ల పరస్పర గౌరవం ఉండాలని ప్రాథమిక కర్తవ్యం చెప్పలేదా? గౌరవం కలిగి ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. మరోసారి జస్టిస్ గవాయి అసంతృప్తి వ్యక్తం చేస్తూ... చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థ కార్యకలాపాల్లో తాము జోక్యం చేసుకోబోమని, అలాగే రాజకీయ నాయకుల నుంచి కూడా తాము అదే ఆశిస్తామని చెప్పారు.
సుప్రీంకోర్టు అదేశాలపై వ్యాఖ్యానించిన మహారాష్ట్ర ఐఏఎస్ అధికారికి కోర్టు ధిక్కార నోటీసులు జారీచేసిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. తెలంగాణ ముఖ్యమంత్రి సైతం దేశ అత్యున్నత న్యాయస్థానం పట్ల గౌరవం లేకుండా, ఇలాంటి ప్రవర్తనే కలిగి ఉంటే ఆయన తెలంగాణ బయటి కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని మందలించింది. కాగా... ప్రభుత్వం తరపున రోహత్గీ జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. అంతలోనే.. మరో సీనియర్ న్యాయవాది సిథార్థ లూథ్రా ముఖ్యమంత్రికి కౌన్సిలింగ్ ఇస్తామని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ క్రమంలో పిటిషనర్ తరపు న్యాయవాది శేషాద్రి నాయుడు స్పందిస్తూ... సుప్రీంకోర్టు గురించి ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు హైకోర్టు, దిగువ కోర్టుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని సూచించారు.
Updated Date - Aug 30 , 2024 | 01:16 PM