Treatment: మా అమ్మాయికి చికిత్స చేయించండి
ABN, Publish Date - Nov 16 , 2024 | 05:25 AM
‘‘నా కూతురు(16) గొంతు వాపు వ్యాఽధితో బాధపడుతోంది. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లే రూ.2 లక్షలు ఖర్చవుతుందన్నారు. నా భర్త చనిపోయాడు. నాకు అంత ఆర్థిక స్థోమత లేదు.
ప్రజావాణి తలుపుతట్టిన పేద కుటుంబం
స్పందించి చికిత్స చేయించిన అధికారులు
బేగంపేట, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ‘‘నా కూతురు(16) గొంతు వాపు వ్యాఽధితో బాధపడుతోంది. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లే రూ.2 లక్షలు ఖర్చవుతుందన్నారు. నా భర్త చనిపోయాడు. నాకు అంత ఆర్థిక స్థోమత లేదు. నా బిడ్డకు చికిత్స చేయించండి’’ అంటూ ఓ తల్లి ప్రజావాణిని ఆశ్రయించారు. స్పందించిన అధికారులు ఆ బాలికకు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. సైదాబాద్‌కు చెందిన జుమాన్ బీ భర్త ఎనిమిదేళ్ల క్రితం చనిపోయారు. ఆమె చిన్న కిరాణ దుకాణం నడుపుకుంటూ కూతురు బిస్మీల్లా బీ(16)ను పోషించుకుంటుంది. అయితే ఏడాది క్రితం బిస్మీల్లా బీ మెడకు ఎడమవైపు వాపు వచ్చింది. అది గొంతు వద్ద గడ్డలా మారింది. దాంతో తరచూ నొప్పి, జ్వరంతో పాటు ఆకలి లేకపోవడం వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. గడ్డ కారణంగా ఆహారం తీసుకునేటప్పుడు నొప్పితో ఇబ్బంది పడుతుండేది. సమస్య తీవ్రతరం కావడంతో స్థానికంగా ఉన్న ఓ వైద్యుడిని సంప్రదించగా క్యాన్సర్ అయ్యి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే రూ.2 లక్షల ఖర్చవుతుందన్నారు.
అంత ఆర్థికస్థోమత లేక జుమాన్ బీ అక్టోబరు 18న ప్రజాభవన్‌లో ప్రజావాణికి వెళ్లి నోడల్ అధికారి దివ్య దేవరాజన్‌కు తన బాధను చెప్పుకున్నారు. ఆమె వెంటనే స్పందించి బాలికకు అవసరమైన చికిత్స ప్రైవేట్ ఆస్పత్రిలో అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దాంతో అధికారులు ఈనెల 6న బిస్మీల్లా బీను ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రిలో చేర్పించారు. బాలిక కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు లేకపోవడంతో ఆరోగ్యశ్రీకి అవసరమైన పత్రాలను అధికారులు ఆస్పత్రి వర్గాలకు అందించారు. అదే రోజు సాయంత్రం బాలికకు గొంతు వద్ద శస్త్రచికిత్స చేశారు. వారం రోజులకు సరిపడా మందులు అందించి ఈనెల 8న బాలికను ఆరోగ్య మిత్ర ప్రతినిఽధులు అంబులెన్స్‌లో ఇంటికి పంపించారు. కాగా, తనకు ఉచితంగా వైద్యం అందించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి బిస్మీల్లా బీ ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు బాలిక ఓ లేఖ రాసింది.
Updated Date - Nov 16 , 2024 | 05:25 AM