సుప్రీం తీర్పు హైడ్రాకు వర్తించదు: రంగనాథ్
ABN, Publish Date - Sep 18 , 2024 | 04:21 AM
చెరువులు, నాలాల్లో ఆక్రమణల కూల్చివేతకు ‘హైదరాబాద్ విపత్తు నిర్వహణ, ఆస్తుల రక్షణ సంస్థ(హైడ్రా)’ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఇప్పటి వరకు రాజకీయ, ఇతర విమర్శలతో ఆచితూచి వ్యవహరిస్తున్న హైడ్రా..
వారాంతం నుంచి కూల్చివేతలు?.. హిమాయత్‌సాగర్‌పై దృష్టి
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మరింత దూకుడు పెంచే యోచన
హిమాయత్‌సాగర్‌లో ఆక్రమణల తొలగింపునకు కార్యాచరణ సిద్ధం
నాలాలపై సర్వే, క్షేత్రస్థాయి పరిశీలనకు త్వరలో ప్రత్యేక బృందాల ఏర్పాటు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): చెరువులు, నాలాల్లో ఆక్రమణల కూల్చివేతకు ‘హైదరాబాద్ విపత్తు నిర్వహణ, ఆస్తుల రక్షణ సంస్థ(హైడ్రా)’ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఇప్పటి వరకు రాజకీయ, ఇతర విమర్శలతో ఆచితూచి వ్యవహరిస్తున్న హైడ్రా.. బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దూకుడు పెంచాలని భావిస్తోంది. సుప్రీం ఆదేశాలు తమకు వర్తించవని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం పేర్కొన్నారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను మాత్రమే తొలగిస్తున్నామని, వీటికి న్యాయస్థానం ఆదేశాల్లోనూ మినహాయింపు ఉందని చెప్పారు.
ఉత్తరప్రదేశ్ తరహాలో నేరస్థులు, నిందితుల ఇళ్లు కూల్చే విధానాలకే సుప్రీం తీర్పు వర్తిస్తుందన్నారు. అలాంటి వారి నిర్మాణాలను హైడ్రా కూల్చడం లేదని తెలిపారు. దీంతో హైడ్రా తదుపరి కూల్చివేతలు ఎక్కడ? అన్నది చర్చనీయాంశంగా మారింది. రెండు నెలల క్రితం హైడ్రాను ఏర్పాటు చేయగా చెరువులు, పార్కులు, నాలాల ఆక్రమణలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తున్న అధికారులు.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్నట్లు నిర్ధారించుకున్న నిర్మాణాలను చర్యలు తీసుకోవాల్సిన జాబితాలో చేరుస్తున్నారు. న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆక్రమణల నిర్ధారణకు రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ తదితర విభాగాల అభిప్రాయలనూ సేకరిస్తున్నారు.
నిమజ్జనం నేపథ్యంలో తాత్కాలిక బ్రేక్..
ఈ నెల 8న దుండిగల్ మల్లంపేటలోని కత్వ చెరువులో విల్లాలు కూల్చివేసిన హైడ్రా.. ఆ తర్వాత ఆక్రమణల తొలగింపునకు బ్రేక్ ఇచ్చింది. గణేశ్ నవరాత్రులు, నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు బందోబస్తు విధుల్లో ఉండాల్సి రావడంతో కూల్చివేతలకు కాస్త విరామం ఇచ్చింది. నిమజ్జనం ముగియడంతో పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటే వారాంతంలోనే కూల్చివేతలు ఉంటాయని సమాచారం. ఇప్పటికే గుర్తించిన పలు చెరువులు, నాలాల వద్ద ఆక్రమణలు తొలగించే అవకాశం ఉంది. వాటర్‌బోర్డు, ఇరిగేషన్ విభాగాల నివేదిక ఆధారంగా హిమాయత్‌సాగర్‌లో ఆక్రమణల తొలగింపునకు రంగం సిద్ధం చేస్తున్నారు.
నాలాలపై సర్వే..
గ్రేటర్ హైదరాబాద్‌లో ముంపు ముప్పునకు చెరువుల ఆక్రమణతోపాటు నాలాలు కుంచించుకుపోవడమూ ప్రధాన కారణం. దీంతో నాలాలపై ఆక్రమణలను తొలగించాలని హైడ్రా నిర్ణయించింది. ఫిర్యాదులపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు.. నాలాల ఆక్రమణల గుర్తింపునకు సర్వే చేయాలని నిర్ణయించారు. రికార్డుల ప్రకారం నాలాల వాస్తవ విస్తీర్ణం.. ప్రస్తుతం ఎంత వెడల్పు ఉన్నదీ గుర్తించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు రంగనాథ్ తెలిపారు. గ్రేటర్‌లో 370 కి.మీ. మేర మేజర్ నాలాలున్నాయి. వీటిలో చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణలను గుర్తించిన తర్వాత ఇళ్ల విషయంలో ఏం చేయాలన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుందని, నివాసేతర భవనాలను మాత్రం తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు.
Updated Date - Sep 18 , 2024 | 06:41 AM