‘మత్తు’ కేసుల్లో దొరికితే ఆస్తులు సీజ్!
ABN, Publish Date - Nov 30 , 2024 | 04:37 AM
రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి కేసుల్లో పట్టుబడుతున్న నిందితుల ఆస్తులను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీజీ న్యాబ్) అధికారులు ఫ్రీజ్ చేస్తున్నారు.
మూడు కేసుల్లో నిందితుల ఆస్తులు ఫ్రీజ్ చేసిన టీజీ న్యాబ్
హైదరాబాద్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి కేసుల్లో పట్టుబడుతున్న నిందితుల ఆస్తులను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీజీ న్యాబ్) అధికారులు ఫ్రీజ్ చేస్తున్నారు. మూడు వేర్వేరు కేసుల్లో పట్టుబడిన నిందితులకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో నగదు, ఇతర స్థిర, చరాస్తులను టీజీ న్యాబ్ అధికారులు ఫ్రీజ్ చేశారు. హైదరాబాద్ శివారులోని గుమ్మడిదలలో జి.అంజిరెడ్డి అల్ఫాజోలం విక్రయిస్తుండగా స్థానిక పోలీసులు, టీజీ న్యాబ్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడి నుంచి 2.6 కిలోల అల్ఫాజోలం, రూ.లక్షపైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణ అనంతరం మత్తు పదార్థాలు విక్రయించి సంపాదించిన సుమారు రూ.కోటి విలువైన ఆస్తులను టీజీ న్యాబ్ అధికారులు ఫ్రీజ్ చేశారు.
మరో కేసులో ఎం.రామకృష్ణ (ఏఆర్ కానిస్టేబుల్) మరికొందరితో కలిసి అల్ఫాజోలం విక్రయిస్తుండగా రెండుసార్లు అరెస్ట్ చేశారు. కేసుల విచారణ అనంతరం నిందితులు కూడబెట్టిన సుమారు రూ.4.5 కోట్ల విలువైన బ్యాంకు బ్యాలెన్స్, స్థిరాస్తుల్ని ఫ్రీజ్ చేశారు. మరో కేసులో ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్సలకు ఉపయోగించే మత్తు ఇంజక్షన్లను విక్రయిస్తున్న అనస్థిషియా డాక్టర్ అహసాన్ ముస్తఫా ఖాన్‌తోపాటు మరికొందర్ని అరెస్ట్ చేశారు. నిందితుల ఖాతాల్లో నగదు, ఓపెన్ ప్లాటు, ద్విచక్ర వాహనాలు ఫ్రీజ్ చేశారు.
Updated Date - Nov 30 , 2024 | 04:37 AM