ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponguleti: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక రేపటి నుంచి..

ABN, Publish Date - Dec 05 , 2024 | 04:07 AM

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 6 (శుక్రవారం) నుంచి పథకంలో లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

  • నేడు సీఎం చేతులమీదుగా యాప్‌ ఆవిష్కరణ

  • ఈ ఆర్థిక సంవత్సరం నియోజకవర్గానికి 3500-4000 ఇళ్ల నిర్మాణం

  • కుటుంబంలోని మహిళ పేరు మీద మంజూరు

  • కనీసం 400 చదరపు అడుగుల్లో నిర్మించాలనే

  • నిబంధన.. ఆపై ఎంతైనా: మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 6 (శుక్రవారం) నుంచి పథకంలో లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండేలా, అవినీతికి, రాజకీయ ప్రమేయానికి ఆస్కారం లేకుండా అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు వీలుగా మొబైల్‌యా్‌పను రూపొందించామని బుఽధవారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. అర్హులైన పేదలకే ఇళ్లను అందించేందుకు వీలుగా ప్రతి గ్రామం, వార్డుల వారీగా ‘ఇందిరమ్మ ఇళ్ల కమిటీ’లను ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఒక్కో ఇంటికీ రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని నాలుగు దశల్లో ఇస్తామని, మహిళ పేరు మీద ఇంటిని మంజూరు చేస్తామని పేర్కొన్నారు. పథకం కింద నిర్మించే ఇళ్లు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో వంటగది, టాయిలెట్‌ సౌకర్యం కలిగి ఉంటాయన్నారు. గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్‌ వ్యవస్థ ఉండేదని, ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేసి లబ్ధిదారులే ఇళ్లను నిర్మించుకునేలా అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులు తమ సౌలభ్యాన్ని బట్టి 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా ఇంటిని నిర్మించుకోవచ్చన్నారు. కాగా, మోడల్‌ హౌస్‌ కింద నమూనాగా ఒక ఇంటిని ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటుచేస్తామని చెప్పారు.


ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడతలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గానికి 3500-4000 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందులో మొదటి విడతలో సొంత స్థలం ఉన్నవారికి, రెండో దశలో స్థలం లేనివారికి ప్రభుత్వమే స్థలమిచ్చి, ఇళ్లను మంజూరు చేస్తుందన్నారు. పథకంలో వికలాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్‌జెండర్లు, సఫాయి, కర్మచారులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పథకం అమలు నేపథ్యంలో గృహ నిర్మాణ సంస్థను బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతోపాటు వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉన్న గృహ నిర్మాణ శాఖ ఉద్యోగుల్లో 296 మందిని తిరిగి శాఖకు తీసుకువచ్చామన్నారు. గత ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్సార్‌ హయాంలో 2006-2007లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిందని గుర్తుచేశారు. అప్పుడు తెలంగాణ ప్రాంతంలో 2006-07నుంచి 2014 వరకు 23,85,188 ఇళ్లను మంజూరు చేయగా, వాటిలో 19.32 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని, మరో 4,53,187 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు. ఇల్లులేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.


  • యాప్‌ను ఆవిష్కరించనున్న రేవంత్‌..

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల గుర్తింపు కోసం రూపొందించిన మొబైల్‌ యాప్‌ను సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ఆవిష్కరించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సచివాలయంలో యాప్‌ను ఆవిష్కరించి, అందుబాటులోకి తీసుకురానున్నారు. యాప్‌లో ఇంటి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం, కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి నిర్మాణానికి సంబంధించిన భూమి సహా పలు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

Updated Date - Dec 05 , 2024 | 04:07 AM