Medical Expenses: వైద్య ఖర్చు అత్యల్పం!
ABN, Publish Date - Nov 04 , 2024 | 04:36 AM
దేశవ్యాప్తంగా వైద్య ఖర్చులు పెరిగిపోతుండగా.. తెలంగాణలో మాత్రం అతి తక్కువగా పెడుతుండడం విశేషం. అవును మీరు చదివింది నిజమే! వైద్యంపై అతి తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది!
వైద్య ఖర్చు అత్యల్పం!గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ తక్కువే.. దేశంలోనే అగ్ర స్థానంలో తెలంగాణ
తలసరి వినియోగ వ్యయంలోనూ టాప్1
వైద్యంపై అత్యధిక ఖర్చులో ఏపీ నంబర్-4
స్మార్ట్‌ఫోన్ వినియోగంలో మనం నంబర్ 3
మద్యం ఖర్చులో నాల్గో స్థానంలో తెలంగాణ 6వ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్
దేశంలో 82ు చిన్నారులు సర్కారీ బడులకే!
తెలంగాణలో మాత్రం ప్రైవేటు బడులకే ఓటు
‘జాతీయ శాంపిల్ సర్వే’లో వెల్లడి
హైదరాబాద్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా వైద్య ఖర్చులు పెరిగిపోతుండగా.. తెలంగాణలో మాత్రం అతి తక్కువగా పెడుతుండడం విశేషం. అవును మీరు చదివింది నిజమే! వైద్యంపై అతి తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది! ఈ విషయంలో పొరుగు రాష్ట్రమైన ఏపీలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. వైద్యంపై అత్యధికంగా వెచ్చిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది! ఇక నెలవారీ తలసరి వ్యయంలో కూడా తెలంగాణ టాప్‌లో నిలిచింది! మద్యం, మాంసాహారంపై ఖర్చులో తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి! ఈ విషయాలు కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘జాతీయ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్‌ఎ్‌సఎ్‌సవో)’ సర్వేలో వెల్లడయ్యాయి. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం, పట్టభద్రులు, నిరుద్యోగం.. లాంటి అనేక అంశాలపై ఎన్‌ఎ్‌సఎ్‌సవో వివరాలు సేకరించింది.
జూలై-2022 నుంచి జూన్-2023 మధ్య అన్ని రాష్ట్రాల్లో 3 లక్షలకు పైగా కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 1.73 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 1.28 లక్షల కుటుంబాలు ఉన్నాయి. గ్రామీణ, పట్టణాల్లో కుటుంబాలు చేస్తున్న ఖర్చు, ఇతర అంశాలకు సంబంధించిన సర్వే వివరాలను ఇటీవలే విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణ ప్రాంతాల్లో వైద్యంపై అతి తక్కువ ఖర్చుతో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవగా, అత్యధిక ఖర్చులో ఏపీ(12ు) నాలుగో స్థానంలో నిలిచింది. పశ్చిమబెంగాల్ ప్రజలు తమ మొత్తం ఆదాయంలో అత్యధికంగా 15 శాతం వైద్యంపై ఖర్చు చేస్తుండగా.. 14.4ుతో కేరళ, 12.4తో పంజాబ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ విభాగంలో తెలంగాణలో ఖర్చు 6.1 శాతం మాత్రమే. గ్రామీణ ప్రాంతాల్లో 17.9 శాతంతో కేరళ, 16.8తో పశ్చిమబెంగాల్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. 16.6 శాతంతో ఏపీ తర్వాతి స్థానంలో ఉంది. ఈ విభాగంలో తెలంగాణ 10.3 శాతంతో తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రంగా నిలిచింది.
82 శాతం సర్కారు బడుల్లోనే..
ప్రైవేటు పాఠశాలలు పెరుగుతున్నా.. కార్పొరేట్ సంస్కృతి విస్తరిస్తున్నా.. దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అత్యధికులు సర్కారు బడుల్లోనే చేరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 6-10 ఏళ్ల వయసు చిన్నారుల్లో 82.2 శాతం మంది సర్కారు పాఠశాలల్లో చదువుతుండగా.. పట్టణ ప్రాంతాల్లో 54.7 శాతం మంది చదువుతున్నారు. తెలంగాణలో మాత్రం ప్రైవేటు బడుల్లోనే ఎక్కువ మంది అభ్యసిస్తున్నారు. 6-10 ఏళ్ల చిన్నారుల్లో 94.2 శాతం మంది బడులకు వెళ్తున్నారు. వీరిలో 52 శాత మంది ప్రైవేటులో.. 48శాతం మంది ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారు. దేశవ్యాప్తంగా 25 ఏళ్లు పైబడిన వారిలో కేవలం 38 శాతం మందే పదో తరగతిని పూర్తి చేశారు. 62 శాతం మంది విద్యార్హత పది లోపే. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 30.4 శాతం ఉండగా.. పట్టణాల్లో 56.6 శాతంగా ఉంది. తెలంగాణలో 25 ఏళ్లు పైబడిన మొత్తం జనాభాలో పదో తరగతి పూర్తి చేసుకున్నవారు 45.4 శాతం మాత్రమే ఉన్నారు.
10 కోట్ల మందికి ఉపాధి, శిక్షణ లేదు..
‘స్కిల్ ఇండియా’ పేరుతో నిరుద్యోగులకు శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు కల్పిస్తున్నామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అయితే కేంద్రం చేపట్టిన ఈ సర్వేలో మాత్రం క్షేత్రస్థాయి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. దేశవ్యాప్తంగా 15-29 ఏళ్ల వారిలో 25.6 శాతం మందికి ఉద్యోగాలకు కావాల్సిన కనీస విద్య లేదు. ఉపాధి, నైపుణ్య శిక్షణకు దూరంగా ఉన్నారు. 2021 గణాంకాల ప్రకారం మొత్తం దేశ జనాభాలో 27.2 శాతం మంది 15-29 మధ్య వయసువారే. ఈ లెక్కన దేశ జనాభాలో దాదాపు 7 శాతం యువత విద్య, ఉపాధి, శిక్షణలకు దూరంగా ఉన్నారు. అంటే దాదాపు 10 కోట్ల మంది నిరుద్యోగులు. తెలంగాణలో 15-29 మధ్య వయసున్న మొత్తం జనాభాలో 16.1ు మందికి ఉపాధి, నైపుణ్య శిక్షణ లేదు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో 16.1 శాతం.. పట్టణాల్లో 16.4 శాతంగా ఉంది.
తృణ ధాన్యాలపై 4% ఖర్చు..
2022-23లో సరాసరిగా ఓ కుటుంబం చేసిన మొత్తం ఖర్చులో తృణధాన్యాలు, ఇతర ఆహార పదార్థాలకు వెచ్చిస్తున్నదాన్ని చూస్తే.. బిహార్, అసోం ముందున్నాయి. ఈ రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల్లో 55 శాతం ఖర్చు ఆహార పదార్థాలపై చేస్తుండగా.. ఇందులో 6 శాతం తృణధాన్యాలపై ఉంది. ఏపీలోని పట్టణ ప్రాంత జనాభా మొత్తం ఖర్చులో 43 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 48 శాతం ఆహారంపై ఖర్చు చేస్తున్నారు. తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో 39, గ్రామీణ ప్రాంతాల్లో 47 శాతం వెచ్చిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తృణ ధాన్యాలపై ఖర్చు సరాసరిగా 4 శాతంగా ఉంది.
మద్యం ఖర్చులో నాలుగో స్థానం..
ఆహారంపై చేస్తున్న మొత్తం ఖర్చు వివరాలను ఈ సర్వేలో వెల్లడించారు. ఇందులో మద్యం, ప్రాసెస్డ్ ఫుడ్‌పై అత్యధిక ఖర్చు చేస్తున్న టాప్-6 (గ్రామీణ ప్రాంతాలు) రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. 28.4 శాతంతో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా.. కర్ణాటక 25.4, అసోం 24.6 తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 23.2 శాతంతో తెలంగాణ నాలుగో స్థానంలో నిలవగా. 22.9తో ఒడిశా 5, 21.4 శాతంతో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉన్నాయి. ఇందులో జాతీయ సగటు 20.7 శాతంగా ఉండగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖర్చు జాతీయ సగటు కంటే అధికంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో 33.7 శాతం ఖర్చుతో తమిళనాడు, 32.9తో కర్ణాటక తొలి రెండు స్థానాల్లో ఉండగా.. 32.4తో తెలంగాణ, 28.0తో ఏపీ 3, 4 స్థానాల్లో నిలిచాయి.
తలసరి వ్యయంలో నంబర్ వన్..
నెలవారీ సగటు తలసరి వినియోగ వ్యయంలో పట్టణ ప్రాంతాల్లో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో పట్టణ ప్రాంతాల్లో ఓ కుటుంబం సగటున రూ.6459 ఖర్చు చేస్తుండగా.. తెలంగాణలో రూ.8158 ఖర్చు చేస్తున్నారు. రూ.7911తో హరియాణా, రూ.7666తో కర్ణాటక, రూ.7630తో తమిళనాడు, రూ.7078 కేరళ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇది రూ.6782గా ఉంది.
86 లక్షల మందికి బడి తెలియదు..
దేశవ్యాప్తంగా 6-18 ఏళ్ల వారిలో 2.1 శాతం మందికి పాఠశాల అంటేనే తెలియదు. ఇలాంటివారు గ్రామీణ ప్రాంతాల్లో 2.2 శాతం.. పట్టణ ప్రాంతాల్లో 1.9 శాతం ఉన్నారు. దేశవ్యాప్తంగా 6-18 ఏళ్ల వారి సంఖ్య 43.10 కోట్లుగా ఉంది. ఈ లెక్కన 2 శాతం మంది అంటే 86 లక్షల మంది అక్షరాభ్యాసానికి దూరంగా ఉన్నారు. తెలంగాణలో 6-18 ఏళ్ల వారిలో 0.4 శాతం మందికి బడి అంటే తెలియదు. దీనికి గల కారణాలను విశ్లేషిస్తే.. 82.2 శాతం మంది చిన్నారులకు అనారోగ్యం, అంగ వైకల్య సమస్యలు, 16.6 శాతం మంది చదువుపై అనాసక్తి, 1.2 శాతం మంది ఆర్థిక సమస్యలతో పాఠశాలలకు దూరంగా ఉన్నారు.
ఫోన్లలో తెలంగాణ 3వ స్థానం
దేశవ్యాప్తంగా 96.1 శాతం మంది జనాభా మొబైల్ ఫోన్లు (స్మార్ట్ ఫోన్లతో సహా) వినియోగిస్తున్నారు. 99.40 శాతం మందికి ఫోన్లతో కేరళ అగ్రస్థానంలో.. 98.6 శాతంతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. 98.5 శాతంతో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ జనాభాలో 97.8 శాతం మంది మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారు. కేరళ మొత్తం జనాభాలో 99 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తుండగా.. తెలంగాణలో 94.4 శాతం మంది వినియోగదారులు ఉన్నారు. కర్ణాటకలో 92.4 శాతం, తమిళనాడులో 90.5, ఏపీలో 91.1ు ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు.
మాంసాహారంలోనూ ముందే..
మాంసాహారంపై ఎక్కువ ఖర్చు చేయడంలో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఐదో స్థానంలో నిలిచాయి. దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని కుటుంబాల మొత్తం ఆదాయంలో కేరళ వాసులు 19.8 శాతం మాంసాహారంపై ఖర్చు చేస్తుండగా.. పశ్చిమబెంగాల్ 18.9, అసోం 17.0, తమిళనాడు 12.3 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సమానంగా నిలిచాయి. రెండు రాష్ట్రాల ప్రజలు మాంసాహారంపై 11.9 శాతం ఖర్చు చేస్తున్నారు. ఇందులో జాతీయ సగటు 9.1 శాతంగా ఉంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే.. 23.5 శాతంతో కేరళ ప్రథమ, 20తో అసోం ద్వితీయ, 18.9తో పశ్చిమ బెంగాల్ తృతీయ స్థానంలో ఉండగా.. 15.8తో తెలంగాణ నాలుగు, 14.8తో ఏపీ ఐదో స్థానంలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ సగటు 10.6 శాతంగా ఉంది.
టెక్నాలజీ పట్టభద్రుల్లో టాప్..
సైన్స్ అండ్ టెక్నాలజీ పట్టభద్రుల సంఖ్యలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 21 ఏళ్లు పైబడిన వారిలో మొత్తం పట్టభద్రుల్లో 34 శాతం ఈ కోర్సుల్లో పట్టా పొందుతుండగా.. తెలంగాణలో వీరి శాతం 62.3గా ఉంది. ఏపీ 58.5 శాతంతో రెండో స్థానంలో ఉంది. సంపూర్ణ అక్షరాస్యత కలిగిన కేరళలో సైన్స్ పట్టభద్రులు 47 శాతం, ఢిల్లీలో 26 శాతం, కర్ణాటకలో 41 శాతం, తమిళనాడులో 57 శాతంగా ఉంది. అలాగే 21-59 మద్య వయసున్న పట్టభద్రుల్లోనూ 63 శాతంతో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా.. 59.8 శాతంతో ఏపీ రెండో స్థానంలో ఉంది. దేశంలోని మొత్తం పట్టభద్రుల్లో 38శాతం సైన్స్, టెక్నాలజీ గ్రాడ్యుయేట్లే.
Updated Date - Nov 04 , 2024 | 04:36 AM