Share News

తెలుగు పుస్తకాలు వెనక్కి

ABN , Publish Date - Jun 14 , 2024 | 03:43 AM

తెలుగు పాఠ్య పుస్తకాల్లో ముందుమాట మార్చకుండా విద్యార్థులకు పంపిణీ చేయడం వివాదాస్పదమవడంతో వాటిని వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం

తెలుగు పుస్తకాలు వెనక్కి

‘ముందుమాట’పై వివాదం నేపథ్యంలో విద్యాశాఖ నిర్ణయం

ఆ పేజీ మరోవైపున వందేమాతరం, జాతీయ గీతం

దాన్ని తొలగిస్తే ఇబ్బందే..!

హైదరాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): తెలుగు పాఠ్య పుస్తకాల్లో ముందుమాట మార్చకుండా విద్యార్థులకు పంపిణీ చేయడం వివాదాస్పదమవడంతో వాటిని వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాలవుతున్నా.. 1 నుంచి పదో తరగతుల తెలుగు పుస్తకాల్లోని ముందుమాటలో మాజీ సీఎం కేసీఆర్‌, అప్పటి మంత్రులు, అధికారుల పేర్లే ఉండడం వివాదానికి కారణమైన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. బుధవారం పంపిణీ చేసిన పుస్తకాలతో పాటు, ఇంకా పంపిణీ చేయకుండా ఆయా మండల కేంద్రాల్లో ఉన్న పుస్తకాలను కూడా వెనక్కి తెప్పిస్తున్నారు. ఈ పుస్తకాల్లోని ‘ముందుమాట’లో మార్పులు చేస్తారా? లేక గత ప్రభుత్వంలోని ముఖ్యుల పేర్లున్న స్థానంలో స్టిక్కర్‌ను అతికిస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ముందుమాట పేజీని తొలగించి దాని స్థానంలో మరో పేజీని అతికించడానికి కొన్ని సాంకేతిక ఇబ్బందులున్నట్టు తెలుస్తోంది. ఈ ముందుమాట ఉన్న పేజీ మరోవైపు వందేమాతరం, జాతీయ గీతం ముద్రించి ఉన్నాయి.. దాంతో దీన్ని ఎలా సరిచేస్తారనేది ఆసక్తిగా మారింది.

Updated Date - Jun 14 , 2024 | 03:44 AM