Sajjanar: ఆ ప్రచారంలో నిజం లేదు.. అసలేం జరిగిందంటే..
ABN, Publish Date - Aug 08 , 2024 | 10:54 AM
జనగామ డిపోకి చెందిన ఒక కండక్టర్‌ను అకారణంగా విధుల నుంచి తప్పించారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని... ఇది పూర్తి అవాస్తవమని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.
హైదరాబాద్: జనగామ డిపోకి చెందిన ఒక కండక్టర్‌ను అకారణంగా విధుల నుంచి తప్పించారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని... ఇది పూర్తి అవాస్తవమని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే.. ఈ నెల 1వ తేదీన ఒక మహిళ, తన తల్లి, ఏడాది కుమారుడితో కలిసి హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు జనగామ డిపోకి చెందిన బస్సు ఎక్కారు. వీరంతా మొదటి వరసలో ఉన్న మహిళా రిజర్వ్‌డ్ సీట్లలో కూర్చున్నారు. ఆ సమయంలో ఆ సీట్లను ఖాళీ చేయాలంటూ కండక్టర్ శంకర్ వారితో అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించారు. లేకుంటే బస్సు దిగి వెళ్లిపోవాలని చెప్పారు. తన అమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పినా వినకుండా.. ముగ్గురిని మడికొండ వద్ద బస్సులోంచి దింపేశారు. ఈ విషయాన్ని బాధిత మహిళా ప్రయాణికురాలి భర్త సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్ ద్వారా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు.
అందుకు సంబంధించిన వివరాలతో పాటు బస్సు, డ్రైవర్, కండక్టర్ ఫొటోలను సైతం షేర్ చేశారు. ఈ ఘటనపై యాజమాన్యం విచారణకు ఆదేశించింది. ఈ ఆదేశాలతో ఆర్టీసీ వరంగల్ రీజియన్ అధికారులు విచారణ జరిపారు. ఈ విచారణలో మహిళా ప్రయాణికురాలి పట్ల దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించడం, నిబంధనలకు విరుద్ధంగా మార్గమధ్యంలో బస్సులోంచి వారిని దించినట్లు తేలడంతో కండక్టర్ శంకర్‌ను విధుల నుంచి తప్పించడం జరిగింది. టీజీఎస్ఆర్టీసీ నియమ నిబంధనల మేరకే కండక్టర్‌పై శాఖపరమైన చర్యలను సంస్థ తీసుకుంది. గతంలోనూ శంకర్‌పై ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి. దీంతో రెండు సార్లు సస్పెండ్ చేయడంతో పాటు ఒక సారి ఆయనను విధుల నుంచి తొలగించడం జరిగింది. అంతేకాదు, అధికారులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వేర్వేరుగా ఐదు సార్లు మూడున్నరేళ్ల పాటు విధులకు గైర్హాజరు అయ్యారు.
మొత్తంగా 12 సార్లు శంకర్‌పై ఫిర్యాదులు వచ్చాయని సజ్జనార్ వెల్లడించారు. అయినా మానవత దృక్పథంతో సంస్థ ఆయనకు పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. తాజాగా మళ్లీ ఫిర్యాదు రావడంతో విచారణ జరిపి గతంలో మాదిరిగానే శాఖపరమైన చర్యలను సంస్థ తీసుకుందన్నారు. టీజీఎస్ఆర్టీసీకి ప్రయాణికులే దేవుళ్లు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన రవాణా సేవలందించేందుకు టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది నిబద్దత, అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు. 45 వేల ఆర్టీసీ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు సగటున 55 లక్షల మందిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నామని సజ్జనార్ తెలిపారు. విధి నిర్వహణలో సేవాతర్పరత చాటుతున్న సిబ్బందిని ఎక్స్‌ట్రా మైల్ కార్యక్రమం ద్వారా సంస్థ సత్కరిస్తోందని.. ప్రయాణికుల నుంచి వచ్చే ఫిర్యాదులను సంస్థ సీరియస్ గా తీసుకుంటోందని తెలిపారు. వాటిని వీలైనంత త్వరగా విచారణ జరుపుతుందన్నారు. ఫిర్యాదుల విషయంలో నిబంధనల ప్రకారమే యాజమాన్యం నడుచుకుంటోందని స్పష్టం చేశారు. అన్ని కోణాల్లో సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందని సజ్జనార్ తెలిపారు.
Updated Date - Aug 08 , 2024 | 10:54 AM