Trump Tower: హైదరాబాద్‌లో ట్రంప్ టవర్లు
ABN, Publish Date - Nov 09 , 2024 | 05:09 AM
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు చెందిన నిర్మాణ సంస్థ తెలంగాణలోనూ అడుగు పెడుతోంది. హైదరాబాద్‌లో ట్రంప్ టవర్లను నిర్మించనుంది. భారత్‌లో ఇప్పటికే నాలుగు నగరాలు ముంబై, కోల్‌కతా, గుర్గావ్, పుణెల్లో ట్రంప్ టవర్స్ నిర్మించిన ఆ సంస్థ.. తాజాగా మరో ఆరు టవర్లను నిర్మించాలని నిర్ణయించింది.
మాదాపూర్‌లోని ఖానామెట్‌లో నిర్మాణం
భారీ విస్తీర్ణంలో జంట టవర్ల ఏర్పాటు
నిర్మాణానికి 2022లోనే భూమి కొనుగోలు!
దేశంలోని మరో 5 ప్రాంతాల్లోనూ టవర్లు
ఇప్పటికే 4 చోట్ల ఉన్న భారీ భవంతులుమాదాపూర్‌లోని ఖానామెట్‌లో నిర్మాణం
న్యూఢిల్లీ, నవంబరు 8: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు చెందిన నిర్మాణ సంస్థ తెలంగాణలోనూ అడుగు పెడుతోంది. హైదరాబాద్‌లో ట్రంప్ టవర్లను నిర్మించనుంది. భారత్‌లో ఇప్పటికే నాలుగు నగరాలు ముంబై, కోల్‌కతా, గుర్గావ్, పుణెల్లో ట్రంప్ టవర్స్ నిర్మించిన ఆ సంస్థ.. తాజాగా మరో ఆరు టవర్లను నిర్మించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌తోపాటు నోయిడా, బెంగళూరుతోపాటు పుణెలో మరో టవర్‌ను నిర్మించనుంది. దీంతో భారత్‌లో ట్రంప్ టవర్ల సంఖ్య 10కి చేరనుంది. తద్వారా అమెరికా బయట అత్యధికంగా ట్రంప్ టవర్లు భారత్‌లోనే ఏర్పాటు కానున్నాయి. కాగా, హైదరాబాద్‌లో స్థానిక మంజీరా గ్రూప్‌తో కలిసి జంట టవర్లు నిర్మించే యోచనలో ట్రంప్ నిర్మాణ సంస్థ ఉంది.
ఇందుకోసం 2022లోనే మాదాపూర్‌లోని ఖానామెట్‌లో 2.92 ఎకరాల భూమిని హెచ్‌ఎండీఏ వేలంలో కొనుగోలు చేసింది. 27 అంతస్తుల్లో నాలుగు బెడ్‌రూంలు, ఐదు బెడ్‌రూంల అపార్టుమెంట్లతో నిర్మించనున్నారు. నాలుగు బెడ్‌రూంల అపార్టుమెంట్ల విస్తీర్ణం 4వేల నుంచి 5వేల చదరపు అడుగులు, ఐదు బెడ్‌రూంల అపార్టుమెంట్ల విస్తీర్ణం 6వేల చదరపు అడుగులు ఉండనున్నట్లు తెలుస్తోంది. చదరపు అడుగుకు రూ.13 వేలుగా ధరను నిర్ణయించాలని అప్పట్లో భావించారు. నాటి లెక్క ప్రకారమే నాలుగు బెడ్‌రూంల అపార్టుమెంట్ ధర రూ.5.5 కోట్లు కానుంది. ఇక ఇతర నగరాల్లో ట్రిబెకా డెవలపర్స్‌తో కలిసి నిర్మించే టవర్లలో అపార్టుమెంట్లే కాకుండా.. ఆఫీసులు, విల్లాలు, గోల్ఫ్ కోర్స్‌లు ఉండనున్నాయి.
Updated Date - Nov 09 , 2024 | 05:10 AM