Tummala: పట్టు పరిశ్రమ పునరుజ్జీవానికి చర్యలు
ABN, Publish Date - Nov 05 , 2024 | 03:51 AM
పట్టు పరిశ్రమలో తక్కువ పెట్టుబడితో అధిక రాబడి ఉందని, గ్రామీణ పేదలకు అనుకూలంగా స్థిరమైన వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
అందులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి
ఆ పరిశ్రమను ప్రోత్సహించాలని తుమ్మల ఆదేశాలు
ఒక్కరోజే 3,400 టన్నుల పత్తి కొన్నామని వెల్లడి
హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): పట్టు పరిశ్రమలో తక్కువ పెట్టుబడితో అధిక రాబడి ఉందని, గ్రామీణ పేదలకు అనుకూలంగా స్థిరమైన వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పట్టు పరిశ్రమను మరింత ప్రోత్సహించే దిశగా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టు పరిశ్రమ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. రైతులు రెండెకరాల్లో మల్బరీ మొక్కలను నాటితే ఐదుగురి వరకు ఉపాధి దొరుకుతుందని, ఏడాదికి సగటున 2 నుంచి 3 లక్షల ఆదాయం వస్తుందన్నారు. పట్టు పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రాయితీలు ప్రకటిస్తున్నాయని, రైతులు పంట మార్పిడిలో భాగంగా మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకం చేపట్టాలని సూచించారు.
రాష్ట్రంలో ఉన్న ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్లకు సరిపడే నాణ్యమైన పట్టు గూళ్ల ఉత్పత్తికి అవసరమైన సాంకేతిక సలహాలను జిల్లాల వారీగా రైతు సదస్సులు ఏర్పాటు చేసి రైతు రాబడిని పెంచాలని సూచించారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట చీరలకు ముడి సరుకును ఇక్కడే ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ సర్కారు రాష్ట్ర వాటా నిధులు కేటాయించకపోవడంతో పట్టు పరిశ్రమకు అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2024-25 సంవత్సరానికి రూ.16 కోట్ల మ్యాచింగ్ గ్రాంటును రాష్ట్ర వాటా కింద జమ చేసిందని తెలిపారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు ఊపందుకున్నాయన్నారు. సీసీఐ 105 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, సోమవారం ఒక్కరోజే 1,474 మంది రైతుల నుంచి 3,400 టన్నుల పత్తిని కొనుగోలు చేశామని వెల్లడించారు.
Updated Date - Nov 05 , 2024 | 03:51 AM