Jagitial: ‘శ్రీనివాసుల’ సమ్మేళనం
ABN, Publish Date - Oct 21 , 2024 | 03:34 AM
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 200 మంది శ్రీనివాస్ పేరుతో గల వ్యక్తులు ఒక్కచోట చేరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆసక్తికర సంఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగింది.
ఒకే పేరున్న 200 మంది సమావేశం
జగిత్యాల జిల్లాలో ఆసక్తికర సంఘటన
జగిత్యాల అర్బన్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 200 మంది శ్రీనివాస్ పేరుతో గల వ్యక్తులు ఒక్కచోట చేరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆసక్తికర సంఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగింది. జిల్లాలోని గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివా్‌సకు ఒక అరుదైన ఆలోచన వచ్చింది. జిల్లా వ్యాప్తంగా తన పేరుతో ఉన్న వ్యక్తులకు సంబంధించి ఒక గ్రూప్‌ను ఏర్పాటు చేయాలనుకున్నారు. 15 రోజుల క్రితం ‘శ్రీనివాసుల సేవా సమితి’ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. దీంతో జిల్లాలో ఆ పేరుతో ఉన్న 1,024 మంది అందులో చేరారు.
తర్వాత గ్రూప్ సభ్యులంతా కలవాలన్న ఆలోచనతో శ్రీనివాసుల ఆత్మీయ సమ్మేళనం తొలిసారి జగిత్యాల పట్టణంలోని మార్కెట్‌లో గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగింది. ఈ సందర్భంగా గ్రూప్ అడ్మిన్ పిట్టల శ్రీనివాస్ మాట్లాడుతూ.. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీనివాస్ పేరు ఉన్న లక్షల మందితో సమావేశం నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పుతామన్నారు. గ్రూప్ ద్వారా పేదలకు, అనాథలకు, వృద్ధులకు సేవ చేస్తామని చెప్పారు. తలసేమియా బాధితులకు సహాయపడుతూ ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తామని తెలిపారు.
Updated Date - Oct 21 , 2024 | 03:34 AM