Tourist Places: వరంగల్ చుట్టుపక్కల ఉన్న ఆరు గొప్ప ప్రదేశాలు మీరు చూశారా?
ABN, Publish Date - Jul 06 , 2024 | 09:19 PM
భారతదేశం బహుళ సంస్కృతులు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం. భారతదేశంలోని రాష్ట్రాల్లో వివిధ సంస్కృతులు ఉన్నాయి. శతాబ్దాల క్రితం వివిధ రాష్ట్రాలను పాలించిన ఆయా రాజులు.. తమ పాలనలో వివిధ కట్టడాలు నిర్మించి భావి తరాలకు అందించారు. అందులో ఆధ్యాత్మికంగా కట్టిన వివిధ ఆలయాలే ఎక్కువగా ఉంటాయి. కరోనా తర్వాత దేశంలో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందింది. ఎక్కడెక్కడ మంచి ప్రదేశాలు ఉన్నాయో వెతుకుతూ గూగుల్‌ను జల్లెడ పట్టేస్తున్నారు. అలాంటి వారికి తెలంగాణ రాష్ట్రం ఒక మంచి గమ్యం. అందులోనూ ముఖ్యంగా వరంగల్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాలు ఒక చక్కని అనుభూతిని ఇస్తాయి.
వరంగల్: భారతదేశం బహుళ సంస్కృతులు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం. భారతదేశంలోని రాష్ట్రాల్లో వివిధ సంస్కృతులు ఉన్నాయి. శతాబ్దాల క్రితం వివిధ రాష్ట్రాలను పాలించిన ఆయా రాజులు.. తమ పాలనలో వివిధ కట్టడాలు నిర్మించి భావి తరాలకు అందించారు. అందులో ఆధ్యాత్మికంగా కట్టిన వివిధ ఆలయాలే ఎక్కువగా ఉంటాయి. కరోనా తర్వాత దేశంలో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందింది. భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఒక్కసారిగా పెరిగిపోయారు. ఎక్కడెక్కడ మంచి ప్రదేశాలు ఉన్నాయో వెతుకుతూ గూగుల్‌ను జల్లెడ పట్టేస్తున్నారు. అలాంటి వారికి తెలంగాణ రాష్ట్రం ఒక మంచి గమ్యం. అందులోనూ ముఖ్యంగా వరంగల్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాలు ఒక చక్కని అనుభూతిని ఇస్తాయి. ఇక్కడ పలు మతపరమైన, సాంస్కృతిక కట్టడాలు ఉన్నాయి. అవి ఏంటో వారి ప్రాధాన్యత ఏంటో ఇప్పుడు చూద్దాం..
1.భద్రకాళి ఆలయం
వరంగల్‌లోని భద్రకాళి ఆలయం రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ పురాతన ఆలయాన్ని చాళుక్య రాజులు నిర్మించారు. ఈ దేవాలయాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. వరంగల్ నడిబొడ్డున ఉన్న ఈ దేవాలయానికి గొప్ప చరిత్ర, మతపరమైన ప్రాధాన్యత ఉంది. చక్కటి శిల్పాలతో ఆకర్షనీయంగా దీన్ని చాళుక్య రాజులు తీర్చిదిద్దారు. దీని అద్భుతమైన నిర్మాణాన్ని చూసేందుకు పెద్దఎత్తున పర్యాటకులు వస్తుంటారు. అమ్మవారి శక్తి అవతారాలలో ఒకటిగా భద్రకాళి దేవి రూపాన్ని కొలుస్తారు.
2.వెయ్యి స్తంభాల గుడి
హనుమకొండ నగరంలో వెయ్యి స్తంభాలగుడి లేదా రుద్రేశ్వరస్వామి దేవాలయంగా పిలచే ఆలయం ఉంది. దీన్ని వెయ్యి స్తంభాలతో నిర్మించడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. కాకతీయ సామ్రాజ్య కాలంలో దీన్ని నిర్మించారు. ఆలయం శిల్పాకళ వైభవం చెప్పేందుకు మాటలు సరిపోవు, చూసేందుకు కళ్లు సరిపోవు. ఈ గుడిని శివుడు, విష్ణువు, సూర్య భగవానుడికి అంకితం చేసినట్లుగా చెప్తుంటారు. పౌరాణిక గాధలను వెయ్యి స్తంభాలపై అద్భుతమైన శిల్పాలతో చెక్కారు. విశాలమైన హాలులో ప్రతీ స్తంభంపైనా అద్భుతమైన ఆకృతులు చెక్కడం వల్ల వెయ్యి స్తంభాల ఆలయంగా పేరొచ్చింది.
3.పద్మాక్షి ఆలయం
పద్మాక్షి ఆలయం హన్మకొండ నగరం మధ్యలో ఉంది. ఈ దేవాలయం లక్ష్మీదేవి రూపమైన పద్మాక్షి దేవికి అంకితం చేయబడింది. ఆలయ ఆకృతిలో కాకతీయ, చాళుక్యుల నిర్మాణ శైలి, కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇక్కడికి పెద్దఎత్తున భక్తులు వస్తుంటారు. ప్రతి యేడాది ఇక్కడ బతుకమ్మ పండగను మహిళలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయం మంచి ఆధ్యాత్మిక అనుభూతిని అందించడంతో సమీప, దూరప్రాంతాల నుంచి యాత్రికులు పెద్దఎత్తున వస్తుంటారు.
4.రామప్ప దేవాలయం
రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించారు. ఇది వరంగల్ నగరానికి 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో ఉంది. దీన్నే రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. ఆలయ ప్రధాన శిల్పి అయిన రామప్ప పేరు మీద ఆలయాన్ని పిలవడం దీని ప్రత్యేకత. విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా దీన్ని చెప్తుంటారు. పక్కనే ఉన్న రామప్ప సరస్సు, కాకతీయుల కాలం నాటిదిగా చెప్తారు. దీన్ని UNESCO ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ప్రధాన హాలులో అందమైన శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దేవాలయ నిర్మాణ వైభవం ప్రకృతి ప్రేమికులకు, భక్తులకు, చరిత్ర ప్రియులకు ఉత్తమ ప్రదేశాల్లో ఒకటిగా నిలుస్తుంది.
5.జైన్ టెంపుల్
కొలనుపాక జైన తీర్థయాత్రకు ప్రధాన ప్రదేశం. జైన మతాన్ని అనుసరించే వారు చూసేందుకు ఇక్కడ అనేక జైన దేవాలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయాన్ని క్రీ.పూ.6వ శతాబ్దంలో నిర్మించారు. దీన్ని వర్ధమాన మహావీరునికి అంకితం చేశారు. ఈ ప్రదేశంలో ఒక్కప్పుడు జైన మతం గొప్పగా వర్ధిల్లినట్లు చరిత్రకారులు చెప్తుంటారు. ఈ ఆలయంలో 3.5మీటర్ల పొడవైన మహావీరుడి పచ్చని ఏకశిలా విగ్రహాన్ని ఉంది. ఈ ప్రదేశం పర్యాటకులకు మంచి అనుభూతి ఇస్తుంది. చాలా మంది యాత్రికులు, జైనులు.. తీర్థంకరుల దర్శనం కోసం తండోపతండాలుగా వస్తారు.
6.లక్నవరం సరస్సు
లక్నవరం సరస్సు గురించి ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మూడు ఇరుకైన లోయలను మూసివేయడం ద్వారా సరస్సు ఏర్పడింది. దీన్ని 13వ శతాబ్దంలో కాకతీయ రాజవంశంలో నిర్మించారు. ఈ ప్రాంతానికి సెలవు రోజుల్లో పర్యాటకులు పోటెత్తుతారు. ఇక్కడ బోటింగ్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది. దీంతో ఎక్కువగా ఇక్కడికి వచ్చేందుకు ఔత్సాహికులు ఆసక్తి చూపుతారు. చుట్టూ పచ్చని వాతావరణం, కొండల మధ్య ఈ ప్రాంతం ఉండడంతో పర్యాటకుల మనసుకు హత్తుకుపోతుంది. ఇక్కడికి ఒకసారి వచ్చిన యాత్రికులు మళ్లీమళ్లీ వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తారు.
ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ సెలవు రోజుల్లో టూర్‌కి ప్లాన్ చేసుకోండి. భద్రకాళి ఆలయం, వెయ్యి స్తంభాల గుడి, పద్మాక్షి ఆలయం, రామప్ప దేవాలయం, జైన్ టెంపుల్, లక్నవరం సరస్సు సహా వరంగల్ చుట్టుపక్కల మరికొన్ని ప్రాంతాలను చూసి మీ జీవితాలలో మరపురాని ముద్ర వేసుకోండి.
Updated Date - Jul 06 , 2024 | 09:19 PM