MLC Kavitha: కవితను ఈడీ ఎప్పుడెప్పుడు విచారించిందంటే..
ABN, Publish Date - Aug 27 , 2024 | 02:01 PM
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఐదు నెలల తర్వాత సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రౌస్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టు చివరకు సుప్రీంకోర్టులో కానీ ఆమెకు విముక్తి లభించలేదు
హైదరాబాద్: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఐదు నెలల తర్వాత సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రౌస్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టు చివరకు సుప్రీంకోర్టులో కానీ ఆమెకు విముక్తి లభించలేదు. బెయిల్ కోసం ఆమె పెద్ద పోరాటమే చేశారు. మార్చి 15 న కవిత అరెస్ట్ అయ్యారు. అంతకు పది రోజుల ముందు ఆమెకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ కవిత హాజరు కాలేదు. 2022 జులైలో లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దాదాపు 5 నెలల తర్వాత మొదటిసారిగా కవితను సీబీఐ విచారించింది. 2022 డిసెంబర్ 11న కవిత ఇంట్లోనే ఆమెను సీబీఐ విచారించింది. లిక్కర్ స్కామ్‌లో సీఆర్పీసీ 160 కింద 7 గంటల పాటు ఆమె వాంగ్మూలాన్ని సీబీఐ నమోదు చేసింది. 2023 మార్చి 11న మొట్టమొదటిసారిగా ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు.
ఆ తర్వాత మార్చి 16, 20, 21 తేదీల్లో ఢిల్లీలో కవితను ఈడీ విచారించింది. తన ఎనిమిది ఫోన్లని ఈడీకి ఆమె సమర్పించారు. ఈడీ, సీబీఐలు దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో కవిత పేరు ప్రస్తావించడం జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ 50 కింద ఈడీ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది. జనవరి 5న కవితకు మళ్ళీ ఈడి నోటీసులు జారీ చేసింది. మహిళను వ్యక్తిగతంగా విచారణకు పిలవడాన్ని సుప్రీంకోర్టులో కవిత సవాల్ చేశారు. ఢిల్లీ లిక్కర్స్ స్కామ్‌లో ఫిబ్రవరి 21న కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 26న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. 41 సీఆర్పీసీ నోటీసులను సీబీఐ ఇచ్చింది. ఆ తరువాత తొలిసారిగా కవితను సీబీఐ నిందితురాలుగా చేర్చింది.
సుప్రీం కోర్టులో కేసు విచారణ ఉందని.. కాబట్టి తాను విచారణకు రాలేనని రిప్లై ఇచ్చారు. ఆ రోజు సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉండగా అది వాయిదా పడింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి సౌత్ గ్రూప్‌నకు కవిత నేతృత్వం వహించారనేది ప్రధాన ఆరోపణ. ఇటీవల ఈ కేసులో మాగుంట రాఘవ అప్రూవర్‌గా మారారు. గతంలో ఇదే కేసులో దినేష్ ఆరోరా, గోరుంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్ళై అప్రూవర్‌గా మారారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయి కొంతకాలం పాటు జైలులో ఉండి ఇటీవలే బయటకు వచ్చారు. మొత్తానికి ఇవాళ కవితకు బెయిల్ మంజూరైంది.
Updated Date - Aug 27 , 2024 | 02:01 PM